మధ్యలో దూరితే పాక్‌, టర్కీలపై దాడి చేస్తాం.. హౌతీల తీవ్ర హెచ్చరిక

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత ముదురుతున్న వేళ యెమెన్‌కు చెందిన హౌతీ సంస్థ పాకిస్థాన్‌, టర్కీలకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.

Update: 2026-09-20 11:45 GMT

పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత ముదురుతున్న వేళ యెమెన్‌కు చెందిన హౌతీ సంస్థ పాకిస్థాన్‌, టర్కీలకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. సౌదీ అరేబియాకు మద్దతుగా ఈ రెండు దేశాలు ప్రత్యక్షంగా సైనిక చర్యకు దిగితే.. తమ నుంచి “తీవ్రమైన.. బాధాకరమైన ప్రతీకారం” తప్పదని హౌతీ సీనియర్ నేత మహమ్మద్ అల్‌ బుఖైతీ హెచ్చరించారు.

సౌదీ అరేబియా-హౌతీల మధ్య దాడులు ఉధృతమవుతున్న నేపథ్యంలో ఈ హెచ్చరిక ప్రాధాన్యం సంతరించుకుంది. పాకిస్థాన్‌, టర్కీ, సౌదీ అరేబియాలు గత ఆగస్టు 7న మక్కాలో మక్కా జాయింట్ డిఫెన్స్ అగ్రిమెంట్ పై సంతకం చేశాయి. ఈ ఒప్పందం ప్రకారం మూడు దేశాల్లో ఏదో ఒక దేశంపై సాయుధ దాడి జరిగితే.. అది మిగిలిన రెండు దేశాలపై జరిగిన దాడిగానే పరిగణించే విధంగా పరస్పర రక్షణ సహకారాన్ని బలోపేతం చేయాలని నిర్ణయించారు.

ఈ ఒప్పందం నేపథ్యంలో సౌదీపై హౌతీల దాడులు పెరగడంతో పాకిస్థాన్‌, టర్కీల వైఖరిపై చర్చ మొదలైంది. ముఖ్యంగా టర్కీ విదేశాంగ మంత్రి హకాన్ ఫిదాన్.. సౌదీకి అవసరమైన సైనిక, సాంకేతిక సహాయాన్ని అందించే అంశాన్ని పాకిస్థాన్‌తో కలిసి పరిశీలించవచ్చని తెలిపారు. అయితే పాకిస్థాన్ ఇప్పటివరకు ప్రత్యక్షంగా యుద్ధంలోకి దిగలేదు.

ఈ పరిణామాల మధ్య అల్‌ బుఖైతీ మాట్లాడుతూ.. సౌదీతో కలిసి యెమెన్ వ్యవహారంలో సైనికంగా జోక్యం చేసుకోవద్దని పాకిస్థాన్‌, టర్కీలను కోరారు. తమ దేశంతో నేరుగా సంబంధం లేని యుద్ధంలోకి అడుగుపెడితే.. ఆ రెండు దేశాలపై కూడా హౌతీలు ప్రతీకార చర్యలకు దిగుతారని స్పష్టం చేశారు. అదే సమయంలో పాకిస్థాన్‌, టర్కీల ప్రజలకు యెమెన్ ప్రజల పట్ల సానుభూతి ఉందని ఆయన పేర్కొన్నారు.

రియాద్‌పై హౌతీల మిస్సైల్ దాడి

మరోవైపు సౌదీ అరేబియా రాజధాని రియాద్‌ను లక్ష్యంగా చేసుకుని హౌతీలు బాలిస్టిక్ మిస్సైల్ ప్రయోగించారు. సౌదీ వైమానిక రక్షణ వ్యవస్థ దాన్ని అడ్డుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ దాడితో పాటు యాన్బు, తైఫ్ తదితర ప్రాంతాలను కూడా లక్ష్యంగా చేసుకున్నట్లు హౌతీలు ప్రకటించారు. యాన్బులోని చమురు మౌలిక వసతులపై దాడి చేసినట్లు వారు ప్రకటించినప్పటికీ ఆ వాదనల్లో కొన్ని ధ్రువీకరించబడలేదు.

ఈ పరిణామాలతో మక్కా రక్షణ ఒప్పందం తొలిసారిగా తీవ్రమైన పరీక్షను ఎదుర్కొంటోంది. పాకిస్థాన్‌, టర్కీలు సౌదీకి ఏ స్థాయిలో సైనిక సహకారం అందిస్తాయన్నది ఇప్పుడు కీలకంగా మారింది. అదే సమయంలో హౌతీలు తమ హెచ్చరికలను కార్యరూపంలోకి తీసుకువస్తారా అన్నదానిపైనా అంతర్జాతీయంగా ఆసక్తి నెలకొంది.

Tags:    

Similar News