కడప రాజకీయాల్లో సంచలనం : జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది రాజీనామా?
| కడప జడ్పీ చైర్మన్ పదవి దక్కకపోవడంతో బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. తన సోదరుడి కుమారుడు రాజేష్ రెడ్డికి ఈ పదవి ఇవ్వాలని కోరినా, కూటమి నేతలు టీడీపీ నేత పుత్తా నరసింహారెడ్డిని ఎంపిక చేయడంతో ఆయన నిరాశకు గురైనట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని యోచిస్తున్నట్లు, ఆయనకు మద్దతుగా కొందరు జడ్పీటీసీలు కూడా రాజీనామాకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. జడ్పీ చైర్మన్ ప్రమాణస్వీకారానికి హాజరుకాకుండా విజయవాడ వెళ్లిన ఆదినారాయణరెడ్డి తదుపరి నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది.
వైఎస్ఆర్ కడప జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. జిల్లా పరిషత్ చైర్మన్ ఎంపికపై జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. కడప జడ్పీ చైర్మనుగా మాజీ ఎమ్మెల్సీ పుత్తా నరసింహారెడ్డిని ఎంపిక చేయడం ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డికి నచ్చలేదని చెబుతున్నారు. తన సోదరుడు కుమారుడు రాజేష్ రెడ్డికి ఈ పదవి ఇవ్వాలని ఎమ్మెల్యే కోరినట్లు చెబుతున్నారు. ఆయన ప్రతిపాదనను పరిశీలించలేదన్న ఆవేదనతో తీవ్ర అసంతృప్తికి లోనైనట్లు చెబుతున్నారు. దీంతో పదవికి రాజీనామా చేయాలని ఎమ్మెల్యే నిర్ణయం తీసుకున్నారని చెబుతున్నారు. ఈ కారణంగానే కడపలో జరిగే జడ్పీ చైర్మను ప్రమాణస్వీకారానికి హాజరుకాకుండా హుటాహుటిన విజయవాడ బయలు దేరివచ్చారని చెబుతున్నారు.
కడప జెడ్పీ చైర్మన్ పీఠం చేజారడాన్ని ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారని చెబుతున్నారు. కడప జిల్లా పరిషత్ చైర్మన్ పదవిని తన సోదరుడి కుమారుడు డాక్టర్ చదిపిరాళ్ల రాజేష్ రెడ్డికి ఇప్పించుకునేందుకు ఆదినారాయణ రెడ్డి చివరి నిమిషం వరకు తీవ్రంగా ప్రయత్నించారు. ఒకానొక దశలో ఈ పదవి విషయంలో ఆయనకు సానుకూల హామీ కూడా లభించినట్లు వార్తలు వినిపించాయి. అయితే, కూటమి నేతల తుది పంపకాల్లో బీజేపీకి కృష్ణా జిల్లా జెడ్పీ పీఠం ఖరారు కాగా, కడప జెడ్పీ చైర్మన్ పదవిని టీడీపీ సీనియర్ నేత పుత్తా నరసింహా రెడ్డికి కేటాయించారు. దీంతో ఆదినారాయణ రెడ్డి వర్గం తీవ్ర నిరాశకు గురైందని అంటున్నారు.
జెడ్పీ చైర్మన్ ఎంపికపై అధికారిక ప్రకటన వెలువడిన వెంటనే ఆదినారాయణ రెడ్డి తన ముఖ్య అనుచరులు, మద్దతుదారులతో కలిసి రాత్రికి రాత్రే హుటాహుటిన విజయవాడకు చేరుకున్నారు. అక్కడ తన వర్గీయులతో భవిష్యత్ కార్యాచరణపై కీలక మంత్రాంగం నిర్వహించినట్లు సమాచారం. కేవలం ఎమ్మెల్యే మాత్రమే కాకుండా, ఆయనకు మద్దతుగా జమ్మలమడుగు, ముద్దనూరు, ఎర్రగుంట్ల ప్రాంతాలకు చెందిన జడ్పీటీసీ సభ్యులు కూడా తమ పదవులకు రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం ఊపందుకుంది.
2014లో వైసీపీ నుంచి గెలుపొందిన ఆదినారాయణ రెడ్డి, ఆ తర్వాత టీడీపీలో చేరి మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. తిరిగి 2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగి జమ్మలమడుగు నుంచి విజయం సాధించారు. జిల్లాలో ముఖ్యంగా పులివెందుల వంటి కీలక ప్రాంతాల్లో స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో వైసీపీని దీటుగా ఎదుర్కోవడంలో ఆయన క్రియాశీలక పాత్ర పోషించారు. అలాంటి నేపథ్యంలో కడప జెడ్పీ పీఠం విషయంలో భంగపాటు ఎదురవడంతో ఆదినారాయణ రెడ్డి మనస్తాపానికి లోనయ్యారని చెబుతున్నారు. దీంతో ఆయన తీసుకోబోయే నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.