ఎవరు గెలిచినా మేమే...వైసీపీ అలా తృప్తి పడుతోందా ?
| ఏపీలో ఈ నెల 26న జరగనున్న రెండో విడత మున్సిపల్ ఎన్నికల్లో కాకినాడ మేయర్ పోరు ఆసక్తికరంగా మారింది. జనసేన తరఫున వైసీపీ నుంచి వచ్చిన ఆకుల భవానీ, వైసీపీ అభ్యర్థిగా డాక్టర్ కాడా సత్యశ్రీ బరిలో ఉన్నారు. భవానీకి టికెట్ ఇవ్వడంపై కూటమిలో అసంతృప్తి ఉందన్న ప్రచారం నేపథ్యంలో, ఆ విభేదాలు తమకు కలిసివస్తాయని వైసీపీ ఆశిస్తోంది.
ఏపీలో వైసీపీకి స్థానిక సంస్థల ఎన్నికలు అంతగా కలసి వచ్చిన పరిస్థితి లేదు. అక్కడక్కడ నామమాత్రపు విజయాలనే దక్కించుకుంది. ఇక సెంట్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అని బరిలోకి దిగిన కూటమి ఒకటి రెండు చోట్ల తప్పించి దాదాపుగా అన్నీ గెలుచుకుని విజయపతాక ఎగరేసింది. ఈ క్రమంలో మునిసిపోల్స్ రెండో విడత ఎన్నికలు ఈ నెల 26న జరగనున్నాయి. నాలుగు కార్పోరేషన్లు, 19 మునిసిపాలిటీలకు జరిగే ఈ ఎన్నికలలో కూడా నూటికి నూరు శాతం గెలుచుకోవాలని కూటమి పూర్తి పట్టుదలను ప్రదర్శిస్తోంది. ఇక నాలుగు కార్పోరేషన్లలో రెండు జనసేన, ఒకటి బీజేపీ మరొకటి టీడీపీ మేయర్ పదవులకు పోటీ చేస్తున్నాయి.
కాకినాడ వైపు :
ఇదిలా ఉంటే ఈ రెండవ విడతలో వైసీపీకి ఒక విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. ఎపుడూ టీడీపీతోనే ఎక్కువగా ముఖా ముఖీగా తలపడే ఆ పార్టీ ఈసారి మిత్రులతో పోటీ చేస్తోంది. దాంతో ఒకింత తమకు అడ్వాంటేజ్ ఉంటుందని భావిస్తున్నప్పటికీ కూటమి ఐక్యత గట్టిగానే ఉండడంతో ఓడినా బలమైన పోటీ ఇచ్చామని చెప్పుకోవాలని కూడా చూస్తోంది అని అంటున్నారు. ఇక కాకినాడ మేయర్ పదవిని బీసీ మహిళకు కేటాయించారు. అదే విధంగా ఇక్కడ వైసీపీ నుంచి జనసేనలోకి మారిన మహిళకే మేయర్ టికెట్ ఇచ్చారు. అలా ఇద్దరు మహిళల మధ్య పోటీ పెద్ద ఎత్తున సాగుతోంది.
కీలక పోరుగానే :
ఇదిలా ఉంటే కాకినాడ మేయర్ ఎన్నికలను కీలక పోరుగానే చూస్తున్నారు. ఎందుకంటే కాకినాడ జనసేనకు హార్డ్ కోర్ ప్రాంతంగా ఉంటోంది. పైగా గోదావరి జిల్లా. దాంతో పాటు ఇక్కడ టీడీపీ కూడా బలంగా ఉంది. వైసీపీ 2024 ఎన్నికల నుంచి బలహీనం అవుతూ వస్తోంది. స్థానిక ఎన్నికల్లో కూడా పెద్దగా ఫలితాలు రాలేదు. దాంతో ఈ ఎన్నికలను మామూలుగా అయితే పెద్దగా ఆలోచించకుండా ఏకపక్షంగానే చూడాల్సి ఉంది. అయితే వైసీపీ నుంచి వచ్చిన ఆకుల భవానీకి ఇవ్వడంలో కూటమిలో కొంత అసంతృప్తి ఉందన్న ప్రచారం సాగుతోంది. పార్టీలో మొదటి నుంచి ఉన్న వారికి ఇవ్వలేదన్న బాధ ఒక వైపు ఉంటే మిత్ర పక్షం బీజేపీకి కూడా పెద్దగా పట్టింపు లేదని కమలం నేతలు కూడా ఆవేదన చెందుతున్నారు అని అంటున్నారు.
డాక్టర్ గా ఉంటూ :
ఇక వైసీపీ నుంచి చూస్తే డాక్టర్ గా సిటీలో ఉంటూ మంచి పేరు తెచ్చుకున్న కాడా సత్యశ్రీ మేయర్ గా పోటీకి దిగారు. ఆమె ప్రచారంలో స్పీడ్ పెంచుతున్నారు అని అంటున్నారు. వైసీపీ కీలక సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వడంతో పాటు తటస్థులను విద్యావంతులను ఆకట్టుకోవడానికి సత్యశ్రీని వ్యూహాత్మకంగా ఎంపిక చేసింది అని అంటున్నారు. దాంతో పాటు కూటమిలో లుకలుకలు తమకు కలిసి వస్తాయని వైసీపీ ఆశలు పెట్టుకుంది అని అంటున్నారు.
ఎవరైనా వారేగా :
ఇక్కడే వైసీపీ స్ట్రాటజీతో వర్క్ చేస్తోంది అని అంటున్నారు. తమ పార్టీకి చెందిన మాజీ నేత మేయర్ గా పోటీ చేస్తోందని ఆమె గెలిచినా వైసీపీ గెలిచినట్లే అంటూ ఫ్యాన్ పార్టీ నేతలు చేస్తున్న ప్రచారం అయితే కూటమిలో అసంతృప్తిని రాజేసేందుకే అని అంటున్నారు. ఇక వైసీపీ అభ్యర్ధిగా సత్యశ్రీ గెలిస్తే ఎటూ పార్టీ ముద్ర ఉంటుంది. అలా కాకుండా ఆకుల భవానీ గెలిచిన తమ వారే గెలిచారని చెప్పుకుంటామని వైసీపీ చేస్తున్న ప్రకటనలు కూటమిని బాగా టార్గెట్ చేస్తున్నాయని అంటున్నారు. చూడాలి మరి కాకినాడలో ఎవరు గెలిచి వస్తారో.