కొలువు తీరిన ఎంపీపీలు...రికార్డు స్థాయిలో పదవులు
| ఏపీలో 659 మండల పరిషత్‌లకు గాను 600 చోట్ల ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికలు పూర్తయ్యాయి. మిగిలిన 59 మండలాల్లో ఈ నెల 20న జెడ్పీ చైర్మన్ ఎన్నికలతో పాటు ఎన్నికలు నిర్వహించనున్నారు. కొత్తగా ఎన్నికైన ఎంపీపీలు, వైస్ ఎంపీపీల ఐదేళ్ల పదవీకాలం నవంబర్ 19 నుంచి ప్రారంభమైంది. 28 జిల్లాల్లో జెడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు కూడా ఈ నెల 20న జరగనున్నాయి.
ఏపీలో కొద్ది నెలల తేడాలోనే మండలాలకు పాలక వర్గం కొలువు తీరింది. ఈ ఏడాది సెప్టెంబర్ 24న మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తుల పదవీ కాలం పూర్తి అయింది. అంటే కేవలం రెండు నెలల తేడాలో కొత్త ప్రజా ప్రతినిధులు వచ్చారు అన్న మాట. ఇక రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం గురువారం ఎంపీపీల వైఎస్ ఎంపీపీల ఎన్నికలు జరిగాయి. రాష్ట్రంలో మొత్తం 659 మండల ప్రజా పరిషత్‌లకు గానూ 600 మండల ప్రజా పరిషత్‌లకు అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు పూర్తి అయినట్లుగా రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. మిగిలిన 59 ఎంపీపీలకు అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికలు పెండింగ్ లో ఉన్నాయని తెలిపింది.
వాటికి సైతం అపుడే :
ఇక ఈ నెల 20న జిల్లా పరిషత్ చైర్మన్ పదవులకు ఎన్నికలు ఉన్నాయి. వాటితో పాటే మిగిలిన 59 ఎంపీపీలకు అధ్యక్ష ఉపాధ్యక్ష ఎన్నికలు నిర్వహిస్తారు అని అంటున్నారు. ఎన్నికలు శుక్రవారం జరిగే ఎంపీపీలలో జిల్లాల వారీగా చూస్తే శ్రీకాకుళం జిల్లాలో గార, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో భోగాపురం, పూసపాటిరేగ, మెంటాడ, చీపురుపల్లి ఉన్నాయి. అనకాపల్లి జిల్లాలో బుచ్చయ్యపేట, చోడవరం, రావికమతం, రోలుగుంట ఉన్నాయి, అల్లూరి సీతారామరాజు జిల్లాలో డుంబ్రిగూడ, అరకు ఉన్నాయి. పోలవరం జిల్లాలో అడ్డతీగల, గంగవరం ఏజెన్సీ ఉన్నాయి. కాకినాడ జిల్లాలో యు.కొత్తపల్లి, ఏలూరు జిల్లాలో పెదపాడు, లింగపాలెం, కృష్ణా జిల్లాలో మచిలీపట్నం సౌత్, మచిలీపట్నం నార్త్,గూడూరు, నాగాయలంక ఉన్నాయి.
అలాగే పల్నాడు జిల్లాలో అచ్చంపేట, రొంపిచర్ల, వినుకొండ మండలాలు ఉన్నాయి. ఇక బాపట్ల జిల్లాలో బాపట్ల, ప్రకాశం జిల్లాలో కొత్తపట్నం, మార్కాపురం జిల్లాలో వెలిగండ్ల, హెచ్.ఎం.పాడు, కనిగిరి, పిసి పల్లె, తిరుపతి జిల్లాలో వాకాడు, ఒజిలి, వెంకటగిరి, నాగులాపురం, తొట్టంబేడు, పిచ్చాటూరు ఉన్నాయి. అన్నమయ్య జిల్లాలో ములకలచెరువు, వైఎస్ఆర్ కడప జిల్లా: అట్లూరు, బద్వేల్, చాపాడు, గోపవరం, పోరుమామిళ్ల, బి.కోడూరు, పులివెందుల, సింహాద్రిపురం, వీరబల్లి ఉన్నాయి. అదే విధంగా అనంతపురం జిల్లాలో కుడేరు, ఉరవకొండ, వజ్రకరూరు, విడపనకల్లు, బెలుగుప్ప, పామిడి, కళ్యాణదుర్గం, శ్రీ సత్యసాయి జిల్లాలో ముదిగుబ్బ, కర్నూలు జిల్లాలో సి.బెళగల్, గూడూరు, మంత్రాలయం, నంద్యాల జిల్లాలో పాగిడ్యాల, ఉయ్యాలవాడ ఉన్నాయి.
పారదర్శకంగానే :
ఇదిలా మండల ప్రజా పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించామని, మిగిలిన వాటిని కూడా సాఫీగా నిరహించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా తెలిపారు. మరో వైపు చూస్తే ఈ నెల 20న రాష్ట్రంలోని 28 జిల్లాలలోని జిల్లా ప్రజా పరిషత్తులకు జెడ్పీ చైర్ పర్సన్, వైఎస్ పర్సన్ ఎన్నికలు జరగనున్నాయి. ఇక రాష్ట్రంలోని 600 మండల ప్రజా పరిషత్తుల నుంచి నెగ్గిన ఎంపీపీ వైస్ ఎంపీపీ ఎన్నికలతో పాటు కొత్త సభ్యుల ఐదేళ్ల పదవీ కాలం నవంబర్ 19 నుంచి మొదలైంది. ఈ నెల 20వ తేదీ నుంచి జెడ్పీటీసీ సభ్యుల పదవీ కాలం ప్రారంభమవుతుందని, అదే రోజున జిల్లా పరిషత్‌ల తొలి సమావేశాలు కూడా జరుగుతాయని ఎన్నికల సంఘం పెర్కొంది.