పాకిస్తాన్ మళ్లీ ఏసింది.. మన రఫెల్ కూల్చినట్టు పాత పాట పాడింది..
| ఆపరేషన్ సింధూర్‌లో భారత వైమానిక దళానికి చెందిన ఎనిమిది రఫేల్ యుద్ధ విమానాలను కూల్చేశామని పంజాబ్ అసెంబ్లీ స్పీకర్ మాలిక్ అహ్మద్ ఖాన్ మరోసారి ప్రకటించారు. అయితే ఈ వాదనకు స్వతంత్ర ఆధారాలు లేకపోవడంతో పాక్ నేతల ప్రకటనలపై విమర్శలు, సెటైర్లు వ్యక్తమవుతున్నాయి. 2025 ఏప్రిల్ 22న పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది మరణించడంతో, మేలో భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టి పాక్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసింది. యుద్ధం ముగిసినా రఫేల్ విమానాల కూల్చివేతపై పాక్ నేతల ప్రకటనలు కొనసాగుతున్నాయని విమర్శలు వస్తున్నాయి.
అంతర్జాతీయ రాజకీయాల్లో.. యుద్ధ క్షేత్రంలో తుపాకుల మోత ఎప్పుడో ఆగిపోయింది. కానీ ఇస్లామాబాద్ వీధుల్లో.. పాకిస్థాన్ నేతల మైకుల ముందు మాత్రం ఆపరేషన్ సింధూర్ ఇంకా లైవ్‌లో రన్ అవుతూనే ఉంది.. యుద్ధం ముగిసినా మైకుల ముందు చేసే వీరంగం మాత్రం ఆగడం లేదు. తాజాగా పంజాబ్ ప్రావిన్స్ అసెంబ్లీ స్పీకర్ మాలిక్ అహ్మద్ ఖాన్ చేసిన ప్రకటన చూస్తుంటే.. పాక్ నేతల వద్ద ఏదో ప్రత్యేకమైన 'క్యాలిక్యులేటర్' ఉన్నట్టు అనిపించకమానదు.
"ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత వైమానిక దళానికి చెందిన ఏకంగా ఎనిమిది రఫేల్ యుద్ధ విమానాలను మేము కూల్చేశాం" అంటూ మాలిక్ అహ్మద్ ఖాన్ మరోసారి పాత పాటకే కొత్త ట్యూన్ కట్టారు. భారత్ గీసిన ప్రతి రెడ్‌లైన్‌ను తాము దాటేశామని.. ప్రధాని మోదీ కోపం భారత్‌కే ఎదురుదెబ్బగా మారిందని ఆయన చెప్పుకొచ్చారు. వినడానికి ఏదో యాక్షన్ సినిమా క్లైమాక్స్ డైలాగ్‌లా బాగానే ఉంది కానీ.. ఆ ఎనిమిది రఫేల్ విమానాల శకలాలు ఎక్కడ పడ్డాయో మాత్రం భూతద్దం పెట్టి వెతికినా కనిపించడం లేదు.
అసలు పాక్ నేతల ప్రకటనలు గమనిస్తుంటే ఒక ఆసక్తికరమైన ట్రెండ్ కనిపిస్తోంది. సమయం గడిచేకొద్దీ కూల్చేసిన విమానాల సంఖ్య పెరుగుతూ పోతోంది. బహుశా వచ్చే ఏడాది నాటికి ఈ లెక్క డజనుకు చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదు.. సోషల్ మీడియాలో నెటిజన్లు కూడా ఇదే విషయంపై సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు. యుద్ధంలో గెలవడం కంటే, ప్రెస్‌మీట్‌లో గెలవడమే పాక్ నేతలకు సులువుగా మారింది అంటూ వ్యంగ్యంగా కామెంట్లు పెడుతున్నారు.
2025 ఏప్రిల్ 22న జమ్మూకాశ్మీర్‌లోని పహల్గామ్ లోయలో ఉగ్రవాదులు జరిపిన కిరాతక దాడిలో 26 మంది అమాయక పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. దీనికి ప్రతిస్పందనగా 2025 మే నెలలో భారత సైన్యం 'ఆపరేషన్ సింధూర్' చేపట్టింది. పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను భారత దళాలు నేలమట్టం చేశాయి.
ఒకవైపు భారత్ కచ్చితమైన లక్ష్యాలతో ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేశామని ప్రకటిస్తే పాకిస్థాన్ మాత్రం ప్రతిసారీ రఫేల్ విమానాల కూల్చివేత అనే ఒకే ఒక్క కార్డును బయటకు తీస్తోంది. ఎలాంటి స్వతంత్ర ఆధారాలు.. శాటిలైట్ చిత్రాలు లేకుండా కేవలం మాటలతోనే ఎనిమిది విమానాలను కూల్చేయడం పాక్ నేతలకే చెల్లింది.
తమ దేశంలో ఉన్న ఆర్థిక సంక్షోభం.. అంతర్గత సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి ఇలాంటి కల్పిత విజయగాథలు పాక్ పాలకులకు బాగా ఉపయోగపడుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. యుద్ధం ఎప్పుడో ముగిసినా.. ఇస్లామాబాద్ నేతల ప్రసంగాల్లో మాత్రం అది ఇంకా బ్లాక్‌బస్టర్ సీరియల్‌లా సాగుతూనే ఉంది. ఆధారాలు లేని ఈ రఫేల్ లెక్కల వార్తల కంటే కామెడీ స్క్రిప్ట్ నే ఎక్కువగా కనిపిస్తున్నాయని సెటైర్లు వినిపిస్తున్నాయి.