ఇల్లు ఉంది.. జ్ఞాపకాలు ఉన్నాయి.. మనుషులే లేరు.. డల్లాస్ వైరల్ వీడియో వెనుక హెచ్1బీ ఉద్యోగుల గుండెకోత
ఆ ఇల్లు ఖాళీ చేసిన తీరు చూస్తే.. వారు ఎంతటి అత్యవసర పరిస్థితిలో.. ఎంతటి మానసిక క్షోభతో ఆ స్థలాన్ని విడిచి వెళ్లిపోయారో అర్థమవుతోంది.
అది డల్లాస్-ఫోర్ట్ వర్త్ ప్రాంతంలోని ఒక ఇల్లు. తీరిగ్గా సర్దుకున్న బట్టలు, సగం కాలిన అగరబత్తీల సువాసనల ఆనవాళ్లు.. గోడలకు వేలాడుతున్న మన దేశీయాంబరాలు.. హాలులో అనాథలా పడి ఉన్న పెంపుడు జంతువు బెడ్.. సగం వండినట్లున్న వంటగది సామాగ్రి... అప్పటివరకు ఒక నవ్వుల కేరింతల కుటుంబాన్ని తన కడుపున దాచుకున్న ఆ ఇల్లు.. ఒక్కసారిగా నిశ్శబ్దమైపోయింది. ఎవరో వచ్చి ఆ ఇంట్లోని మనుషులను మంత్రదండంతో మాయం చేసినట్లుంది ఆ దృశ్యం.. ఇటీవల సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపిస్తున్న ఈ ఒక్క వీడియో.. వేల మైళ్ల దూరంలో ఉన్న భారతీయ టెక్ కుటుంబాల గుండెల్లో తెలియని దిగులును రేపింది.
ఆ ఇల్లు ఖాళీ చేసిన తీరు చూస్తే.. వారు ఎంతటి అత్యవసర పరిస్థితిలో.. ఎంతటి మానసిక క్షోభతో ఆ స్థలాన్ని విడిచి వెళ్లిపోయారో అర్థమవుతోంది. 'ఇది కచ్చితంగా లేఆఫ్స్‌కు గురై.. వీసా గడువు ముగిసి అర్ధాంతరంగా దేశం విడిచి వెళ్లిన ఓ భారతీయ హెచ్1బీ ఉద్యోగి కుటుంబానిదే' అని నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అమెరికా కలలు కని.. ఎన్నో రాత్రులు కష్టపడి.. డల్లాస్ శివార్లలో ఒక సొంతింటిని నిర్మించుకున్న ఆ కుటుంబం.. ఉద్యోగం పోగానే ఇచ్చిన 60 రోజుల గ్రేస్ పీరియడ్‌లో మరో దారి కానరాక.. డిపోర్టేషన్ భయంతో అంతా వదిలేసి వెళ్లిపోయిందా? ఏళ్ల తరబడి కూడబెట్టుకున్న జ్ఞాపకాలను, ఆశలను, ఆఖరికి ఇంట్లోని వస్తువులను కూడా అమ్మేసుకోలేని హడావుడిలో స్వదేశానికి బాట పట్టిందా? ఈ ప్రశ్నలు ప్రతి విదేశీ టెక్ ఉద్యోగిని కలచివేస్తున్నాయి.
అయితే ఈ ఘటనపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. ఇది బ్యాంకుల ఫోర్‌క్లోజర్ కావచ్చు.. అత్యవసర కుటుంబ పరిస్థితి కావచ్చు లేదా మరేదైనా వ్యక్తిగత కారణం కావచ్చు. కానీ ఈ వీడియో వైరల్ కావడానికి కారణం ఆ ఇల్లు మాత్రమే కాదు.. ప్రస్తుతం అమెరికాలోని టెక్ ఉద్యోగులు అనుభవిస్తున్న తీవ్ర అభద్రతాభావం! జాబ్ కట్స్, కఠినతరమవుతున్న వీసా నిబంధనలు.. హౌసింగ్ మార్కెట్ ఒత్తిడుల మధ్య "రేపు మన పరిస్థితి ఏమిటి?" అని అనుక్షణం భయంతో బతుకుతున్న వేలాది మంది హెచ్1బీ బాధితుల ఆవేదనకు ఈ వీడియో ఒక ప్రతిరూపంగా నిలిచింది. ఒక వైరల్ క్లిప్ ఒకరి ఇంటి దృశ్యమే కావచ్చు.. కానీ అది విదేశాల్లో స్థిరపడటానికి మనవాళ్లు చెల్లిస్తున్న అదృశ్య వెలకి ప్రత్యక్ష నిదర్శనం.