అచ్చం దానం కేసు మాదిరే మ‌హాచంద్ర ప్ర‌సాద్ సింగ్ ఉదంతం

ఖైర‌తాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్ పై అన‌ర్హ‌త వేటు వేస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పు ఇవ్వ‌టం.. దానిపై స‌ద‌రు ఎమ్మెల్యే స్పందించ‌టం తెలిసిందే.

Update: 2026-09-20 16:39 GMT

ఖైర‌తాబాద్ ఎమ్మెల్యే దానం నాగేంద‌ర్ పై అన‌ర్హ‌త వేటు వేస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పు ఇవ్వ‌టం.. దానిపై స‌ద‌రు ఎమ్మెల్యే స్పందించ‌టం తెలిసిందే. తాను ప్ర‌జాక్షేత్రంలో పోరాడ‌తాన‌ని.. ఉప ఎన్నిక‌కు సిద్ధ‌మ‌ని పేర్కొంటూనే..హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టును ఆశ్ర‌యించిన వైనం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా వ్య‌వ‌హ‌రిస్తూ.. కాంగ్రెస్ పార్టీ బీఫారం మీద సికింద్రాబాద్ ఎంపీ స్థానానికి పోటీ చేయ‌టం ఆయ‌న కేసులో అత్యంత నెగిటివ్ అంశంగా అభివ‌ర్ణిస్తున్నారు.ఇదే త‌ర‌హాలో గ‌తంలో మ‌రే ప్ర‌జాప్ర‌తినిధి అయినా చేశారా? దానికి సంబంధించి న్యాయ‌ప‌ర‌మైన చ‌ర్చ జ‌రిగిందా? అని చ‌రిత్ర‌ను త‌వ్వి చూసిన‌ప్పుడు బిహార్ కు చెందిన ఎమ్మెల్యే మ‌హాచంద్ర ప్ర‌సాద్ సింగ్ ఉదంతాన్ని గుర్తు చేసుకుంటారు. ఆయ‌న ఉదంతాన్ని చూసిన‌ప్పుడు ఇంచుమించు దానం నాగేంద‌ర్ ఇలాంటి ప‌రిస్థితుల్లోనే ఉన్నార‌న్న అభిప్రాయం క‌లుగుతుంది.

ఇంత‌కూ ఎవ‌రీ మ‌హాచంద్ర‌ప్ర‌సాద్ సింగ్? ఆయ‌న నేప‌థ్యం ఏంటి? దానం కేసులో ఉన్న సారుప్యం ఏంటి? అన్న వివ‌రాల్లోకి వెళితే.. బిహార్ కు చెందిన ఆయ‌న ఎమ్మెల్సీగా వ్య‌వ‌హ‌రించే స‌మ‌యంలో ఆయ‌న ఇండిపెండెంట్ గా లోక్ స‌భ ఎన్నిక‌ల్లో పోటీ చేశారు. వీరిద్ద‌రి అంశాల్ని ఒక్కొక్క‌టిగా చూస్తే.. ఈ రెండు కేసులు ఎంత ద‌గ్గ‌ర‌గా ఉన్నాయో అర్థ‌మ‌వుతుంది. మొద‌ట ఏ పార్టీ టికెట్ మీద గెలిచారు? అన్న ప్ర‌శ్న‌కు మ‌హాచంద్ర ప్ర‌సాద్ సింగ్ కాంగ్రెస్ అయితే.. దానం నాగేంద‌ర్ బీఆర్ఎస్. వీరిద్ద‌రు ఏయే స‌భ‌ల‌కు ఎన్నికయ్యార‌న్న విష‌యానికి వ‌స్తే.. మ‌హాచంద్ర ప్ర‌సాద్ సింగ్ బిహార్ శాస‌న మండ‌లికి అయితే.. దానం నాగేంద‌ర్ తెలంగాణ అసెంబ్లీకి.

ఎమ్మెల్సీగా ఉన్న మ‌హాచంద్ర‌ప్ర‌సాద్ సింగ్.. ఎమ్మెల్యేగా ఉన్న దానం నాగేంద‌ర్ ఇద్ద‌రు లోక్ స‌భ‌కు పోటీ చేశారు. మ‌హాచంద్ర ప్ర‌సాద్ ఇండిపెండెంట్ గా పోటీకి దిగితే.. దానం నాగేంద‌ర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద పోటీ చేశారు. వీరిద్ద‌రు ఎంపీగా పోటీ చేసే స‌మ‌యంలో త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామా చేయ‌లేదు. వీరిద్ద‌రి తీరును ప్ర‌శ్నిస్తూ.. ప‌దో షెడ్యూల్ ప్ర‌కారం అన‌ర్హ‌త వేటు వేశారు. అయితే.. ఇక్క‌డే వీరిద్ద‌రి మ‌ధ్య ఒక పెద్ద తేడా ఉంది.

అదేమంటే.. మ‌హా చంద్ర‌ప్ర‌సాద్ సింగ్ విష‌యంలో అప్ప‌టి బిహార్ శాస‌న‌మండ‌లి ఛైర్మ‌న్ అన‌ర్హ‌త వేటు వేస్తే.. దానం నాగేంద‌ర్ విష‌యంలో తెలంగాణ స్పీక‌ర్ అన‌ర్హ‌త వేటు వేయ‌లేదు. దీనిపై చివ‌ర‌గా మ‌హా చంద్ర ప్ర‌సాద్ సింగ్ సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు. దానం నాగేంద‌ర్ ఇప్పుడు సుప్రీంకోర్టును ఆశ్ర‌యించే ప‌నిలో ఉన్నారు.మ‌హాచంద్ర ప్ర‌సాద్ సింగ్ 1998లో కాంగ్రెస్ అభ్య‌ర్థిగా బిహార్ శాస‌న మండ‌లికి ఎన్నికై.. 2004లో జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఇండిపెండెంట్ అభ్య‌ర్థిగా లోక్ స‌భ‌కు పోటీ చేశారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ అభ్యంత‌రం వ్య‌క్తం చేయ‌గా.. ఆయ‌న్ను అన‌ర్హుడిగా పేర్కొంటూ అప్ప‌టి మండ‌లి ఛైర్మ‌న్ నిర్ణ‌యం తీసుకున్నారు. దానం నాగేంద‌ర్ విష‌యంలో మాత్రం అసెంబ్లీ స్పీక‌ర్ అన‌ర్హ‌త నిర్ణ‌యాన్ని తీసుకోలేదు. తెలంగాణ హైకోర్టు ఆ నిర్ణ‌యాన్ని వెలువ‌రించింది.

త‌న‌పై శాస‌న మండ‌లి ఛైర్మ‌న్ తీసుకున్న నిర్ణ‌యాన్ని స‌వాలు చేస్తూ సుప్రీంను ఆశ్ర‌యించ‌గా..త‌న తీర్పులో చెప్పిన అంశాన్ని సూటిగా చెప్పాల్సి వ‌స్తే.. ఒక పార్టీకి చెందిన సిట్టింగ్ ప్ర‌జాప్ర‌తినిధి.. స‌ద‌రు పార్టీ త‌ర‌పు కాకుండా మ‌రో ఎన్నిక‌ల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేయ‌టం ఆ పార్టీ స‌భ్య‌త్వాన్ని స్వ‌చ్చందంగా వ‌దిలిన‌ట్లుగా ప‌రిగ‌ణించొచ్చు. కాక‌పోతే.. వీరిద్ద‌రిలో అన్ని అంశాల్లో సారూప్య‌త ఉన్న‌ప్ప‌టికి స్పీక‌ర్ దానంపై అన‌ర్హ‌త వేటు వేయ‌క‌పోవ‌టం. దీంతో మ‌హాచంద్ర‌కు వ‌ర్తించిన సూత్రం దానంకు వ‌ర్తించ‌ద‌ని ఇట్టే చెప్ప‌లేం. కాకుంటే.. స్పీక‌ర్ నిర్ణ‌యాన్ని హైకోర్టు కొట్టేస్తూ.. తన‌కు తానుగా ఎలా నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించ‌ట‌మే సుప్రీంకోర్టులో బ‌లంగా వాదించే వీలుంది. మ‌హాచంద్ర విష‌యంలో అలాంటి ప‌రిస్థితి లేదు. ఎందుకంటే మండ‌లి ఛైర్మ‌న్ మ‌హాచంద్ర‌పై అన‌ర్హ‌త వేటు వేశారు. దానం విష‌యంలో అందుకు భిన్నంగా జ‌ర‌గ‌టం ఒక సానుకూలాంశం. స్పీక‌ర్ నిర్ణ‌యాన్ని తెలంగాణ హైకోర్టు సెట్ ఏసైడ్ (ప‌క్క‌న పెట్టి) దానం నాగేంద‌ర్ ను స్వ‌యంగా త‌న‌కు తాను అన‌ర్హ‌త వేటు వేసింది. స్పీక‌ర్ నిర్ణ‌యాన్ని హైకోర్టు ఏ ప‌రిమితుల్లో జ్యూడిషియ‌ల్ రివ్యూ చేయ‌గ‌ల‌దు? స్పీక‌ర్ స్థానంలో న్యాయ‌స్థానం కూర్చొని అన‌ర్హ‌త నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టిస్తుందా? అన్న‌ది కీల‌కం. దీనిపై సుప్రీం ఏం చెబుతుందో చూడాలి.

Tags:    

Similar News