ట్రంప్ కు షాకిచ్చిన పాకిస్తాన్.. అమెరికా వ్యూహం ఎందుకు ఫెయిలయ్యింది?
| అక్రమ వలసదారులను బహిష్కరించేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రూపొందించిన ట్రాన్సిట్ ప్లాన్‌కు పాకిస్తాన్ నుంచి అడ్డంకి ఎదురైంది. ఇరాన్ పౌరులను పాకిస్తాన్ మీదుగా స్వదేశానికి పంపాలన్న ప్రయత్నానికి అనుమతి లభించకపోవడంతో నవంబర్ 8, 10 తేదీల్లో బయలుదేరిన రెండు విమానాలు వెనక్కి మళ్లాయి. దీంతో అమెరికా బహిష్కరణ ప్రణాళికలో చిక్కులు ఎదురయ్యాయి.
అసలు ప్రపంచంలో నమ్మకద్రోహానికి బ్రాండ్ అంబాసిడర్ ఏదైనా దేశం ఉందంటే అది ‘పాకిస్తాన్’నే.. వెన్నుపోటు పొడవడంలో వీళ్లు పీహెచ్డీలు చేశారు. లాడెన్ లాంటి అమెరికా మోస్ట్ వాంటెడ్ తీవ్రవాదిని పాకిస్తాన్ లో దాచిపెట్టి అమెరికాను 10 ఏళ్లు సహకరించినట్టు నాటకం ఆడిన చరిత్ర పాకిస్తాన్. అలాంటి పాకిస్తాన్ ను నమ్ముకొని ముందు కెళ్లుతున్న అమెరికాకు మరోసారి గట్టి షాక్ నే తగిలింది..
ఇన్నాళ్లు అమెరికా బిస్కెట్లు వేస్తే తల ఊపుకుంటూ ఎవరిపై అంటే వారిపై మొరిగేలా పాకిస్తాన్ ఉండేది. ట్రంప్ తానా అంటే పాకిస్తాన్ పాలకులు తందానా అనేవారు.. ట్రంప్ ను శాంతి బహుమతికి నామినేట్ చేసి తమ కృతజ్ఞతను పాక్ పాలకులు చాటుకున్నారు. అంతలా అగ్రరాజ్యం చేతిలో బందీ అయ్యి ఉండే పాకిస్తాన్ లోనూ ఈ మధ్య ఆత్మాభిమానం తన్నుకొచ్చి.. మీరు వదిలించు కుంటున్న మనుషులు మాకు ఎందుకంటే ఎదురుతిరిగారు. ఇది నిజంగా నిజం.. ట్రంప్ కు షాకిస్తూ అమెరికా వ్యూహానికి పాకిస్తాన్ నో చెప్పడం.. ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
అమెరికాలో అక్రమ వలసదారులను పంపించేందుకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వేసిన ట్రాన్సిట్ స్కెచ్ పాకిస్థాన్ దగ్గర అడ్డంగా బుక్కయింది. ఇరాన్, ఆఫ్ఘనిస్థాన్ పౌరులను నేరుగా వారి దేశాలకు పంపలేక పాకిస్థాన్‌ను కనెక్టింగ్ ఫ్లైట్ లాగా వాడుకోవాలని అమెరికా వేసిన ప్లాన్ రన్‌వే దాటకముందే ఆగిపోయింది.
నవంబర్ 10న అరిజోనాలోని మెసా ఎయిర్‌పోర్ట్ నుండి తొమ్మిది మంది ఇరాన్ పౌరులతో ఒక ప్రత్యేక విమానం ఎంతో ఆర్భాటంగా బయలుదేరింది. కానీ పాకిస్థాన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వకపోవడంతో టేకాఫ్ అయిన కేవలం 30 నిమిషాల్లోనే ఆ విమానం మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చింది. అంతకుముందు నవంబర్ 8న కూడా ఎనిమిది మంది విషయంలో ఇదే సీన్ రిపీట్ అయ్యింది. మూడు రోజుల్లో రెండుసార్లు విమానాలు వెనక్కి రావడంతో పంపించే వాళ్ళు రెడీగా ఉన్నా.. తీసుకునే వాళ్ళు లేకపోతే ఎలా? అన్నట్లుగా మారింది అమెరికా పరిస్థితి.
ఈ వ్యవహారంలో అసలు ట్విస్ట్ ఏంటంటే.. పాకిస్థాన్ మాకు అమెరికాతో తుది ఒప్పందం కుదరలేదు అని చేతులెత్తేస్తుంటే అమెరికా కోర్టు పత్రాల్లో మాత్రం పాక్ 15 రోజుల ట్రాన్సిట్ వీసాలు ఇచ్చినట్లు ఉందని కథనాలు పేర్కొంటున్నాయి. ఒకవైపు అగ్రరాజ్యం ఒత్తిడి.. మరోవైపు పొరుగు దేశాలైన ఇరాన్, ఆఫ్ఘనిస్థాన్‌లతో వచ్చే తలనొప్పుల మధ్య పాకిస్థాన్ సేఫ్ గేమ్ ఆడుతున్నట్లు కనిపిస్తోంది.
గతంలో అమెరికా సైన్యానికి సాయం చేసిన 150-200 మంది ఆఫ్ఘన్లను కూడా ఇదే దారిలో తాలిబన్ల పాలనలోకి పంపాలని ట్రంప్ యంత్రాంగం భావించింది. దీనిపై మానవ హక్కుల సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేయగా.. అమెరికా కోర్టు నవంబర్ 3న తాత్కాలికంగా బ్రేక్ వేసింది. మరోవైపు 66 మంది అమెరికా కాంగ్రెస్ సభ్యులు సైతం పాకిస్థాన్ అధికారులకు ఆంక్షల హెచ్చరికలు జారీ చేయడంతో ఇస్లామాబాద్ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.
సరిహద్దులు దాటించడం ఎంత కష్టమో.. దాటించిన వారిని దింపడానికి మరో దేశం అనుమతి తీసుకోవడం అంతకంటే కష్టమని ఈ ఘటన నిరూపించింది. మరి ట్రంప్ ప్రభుత్వం పాకిస్తాన్ ఇచ్చిన ఈ షాక్ నుంచి ఎలా కోలుకుంటుంది.. ఈ 'ట్రాన్సిట్' చిక్కుముడిని ఎలా విప్పుతుందో చూడాలి.