మరణశిక్ష విధించినా బంగ్లాకు హసీనా? భారత్ కు పరీక్ష.. ఏం జరుగనుంది?
| బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా స్వదేశానికి తిరిగి వెళ్లేందుకు న్యాయవాదుల ద్వారా బంగ్లాదేశ్ హైకమిషన్‌కు పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. ఆమె పాత పాస్‌పోర్టును తాత్కాలిక ప్రభుత్వం రద్దు చేసిన నేపథ్యంలో, డిసెంబర్‌లో స్వదేశానికి వెళ్లాలన్న హసీనా నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. ఈ పరిణామం భారత్‌కు దౌత్యపరమైన సవాలుగా మారింది.
ఒకప్పుడు లక్షలాది మంది ప్రజల జైత్రయాత్రల మధ్య బంగ్లాదేశ్ రాజకీయాలను శాసించిన ఉక్కు మహిళ.. ఇప్పుడు అదే దేశంలో అడుగుపెట్టేందుకు పాస్‌పోర్టు కోసం వేయికళ్లతో దరఖాస్తు చేసుకున్న దయనీయ స్థితి.. పీఠం కూలి.. ప్రాణాలు అరచేతిలో పట్టుకుని దేశం విడిచి పారిపోవాల్సి వచ్చిన మాజీ ప్రధాని షేక్ హసీనా కథ ఇప్పుడు ఓ కన్నీటి కావ్యంగా.. అంతర్జాతీయ రాజకీయాల చదరంగంలో విషాద నాటకంగా మారింది. "నాకు మరణశిక్ష విధించినా లెక్కచేయను.. నా దేశానికి తిరిగి వెళ్తాను" అంటున్న ఆమె పట్టుదల వెనుక స్వదేశంపై ఉన్న అంతులేని మమకారం కనిపిస్తోంది. కానీ దాన్ని మించిన క్రూరమైన వాస్తవాలు ఆమెను కట్టడి చేస్తున్నాయి.
ఢిల్లీలోని ఏదో మూలన అజ్ఞాత జీవితం గడుపుతున్న ఆమె చివరికి తన మాతృభూమిని తాకేందుకు న్యాయవాదుల ద్వారా బంగ్లాదేశ్ హైకమిషన్‌ను వేడుకోవాల్సి రావడం అత్యంత బాధాకరం. బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం ఆమె పాత పాస్‌పోర్టును రద్దు చేసి.. నేరస్థురాలిగా ముద్రవేయాలని చూస్తున్న తీరు చూస్తే అధికార దాహం ఎంతటి పతనానికైనా దారితీస్తుందో అర్థమవుతుంది. అప్పగింత ఒప్పందాల పేరిట ఆమెను మృత్యువు ఒడిలోకి పంపాలని చూస్తున్న ప్రస్తుత పాలకుల కక్షసాధింపు రాజకీయాలు హసీనాకు ఇప్పుడు అతిపెద్ద అగ్నిపరీక్షగా మారాయి.
ఇది కేవలం షేక్ హసీనా వ్యక్తిగత పోరాటం మాత్రమే కాదు.. నైతికతను.. శరణార్థులకు ఆశ్రయం ఇచ్చే సంప్రదాయాన్ని నిలబెట్టుకోవాల్సిన భారత్ ముందున్న అత్యంత క్లిష్టమైన దౌత్యపరమైన పరీక్ష.. ఒకవైపు పొరుగు దేశంతో సత్సంబంధాలు.. మరోవైపు తనకు ఆశ్రయం కోరి వచ్చిన మాజీ ప్రధాని ప్రాణాలను రక్షించాల్సిన ధర్మం.. ఈ రెండింటి మధ్య నలిగిపోతున్న భారత్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఉత్కంఠ రేపుతోంది.
డిసెంబర్‌లో స్వదేశానికి వెళ్లి తీరుతానని శపథం చేసిన హసీనా కల నెరవేరుతుందా? లేక దౌత్యపరమైన ఉచ్చులో చిక్కుకుని ఆమె పోరాటం అర్ధంతరంగా ఆగిపోతుందా? అధికార దర్పం నేలకూలిన వేళ.. కన్నతల్లి లాంటి దేశం కోసం పరితపిస్తున్న ఒక వృద్ధురాలి ఆవేదన అంతర్జాతీయ సమాజాన్ని కలచివేస్తోంది. కాలం ఏ మలుపు తిప్పుతుందో... హసీనా స్వదేశ ప్రయాణం ఎలాంటి విషాదాన్ని లేదా విప్లవాన్ని సృష్టిస్తుందో వేచి చూడాల్సిందే..