ట్రంప్ ను ముట్టడిస్తున్న '1974 నాటి వాటర్‌గేట్' చేదు జ్ఞాపకాలు
| 2026 అమెరికా మిడ్‌టర్మ్ ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని రిపబ్లికన్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలినట్లు కథనం పేర్కొంది. ప్రతినిధుల సభలో డెమోక్రాట్లు 253 సీట్లు గెలుచుకుని మెజారిటీ సాధించగా, రిపబ్లికన్లు 157 స్థానాలకే పరిమితమయ్యారు. ఈ ఫలితాలను 1974 వాటర్‌గేట్ తర్వాత రిపబ్లికన్లకు ఎదురైన పరాజయంతో విశ్లేషకులు పోలుస్తున్నారు.
డొనాల్డ్ ట్రంప్ వైట్‌హౌస్‌లో టీ తాగుతూ ‘అమెరికాను మళ్లీ గ్రేట్‌గా మారుస్తున్నా’ అని మురిసిపోతున్న వేళ ఓటర్లు మాత్రం బ్యాలెట్ బాక్స్ తీసి ‘కొంచెం ఆగండి సార్’ అని చెప్పినట్లుంది ఈ 2026 మిడ్‌టర్మ్ ఫలితాలు. డెమోక్రాట్లు హౌస్‌నూ సెనేట్‌నూ గుప్పిట్లోకి తీసుకుంటూ దూసుకెళ్తుంటే... రిపబ్లికన్ల క్యాంప్‌లో ‘మేం అసలు ఏం చేశాం?’ అనే కంగారు కంటే 52 ఏళ్ల కిందట రిచర్డ్ నిక్సన్ జమానాలో వాటర్‌గేట్ దెబ్బకు వైట్‌హౌస్ ఫ్యాన్లు కూడా తిరగనంతగా సైలెంట్ అయిపోయిన రోజులే మళ్లీ గుర్తొస్తున్నాయి.
అమెరికా రాజకీయాల్లో ప్రతి కొన్ని దశాబ్దాలకూ ఒకసారి బ్యాలెట్ బాక్స్ బాంబులా పేలుతుంది. కానీ 2026 మిడ్‌టర్మ్ ఫలితాలు మాత్రం వైట్‌హౌస్ తలుపులను ఊపేస్తూ ఏకంగా 'వాటర్‌గేట్' కాలం నాటి ఘాటు జ్ఞాపకాలను గుర్తుచేస్తున్నాయి. డోనాల్డ్ ట్రంప్ నాయకత్వంలోని రిపబ్లికన్ పార్టీకి అమెరికా ఓటర్లు ఇచ్చిన ఈ షాక్ మామూలుది కాదు. అర శతాబ్దం కిందటి ముచ్చట ఇదీ.. దాదాపు 52 ఏళ్ల కిందట రిచర్డ్ నిక్సన్ గద్దె దిగాక రిపబ్లికన్లకు ఎలాంటి పరాభవం ఎదురైందో.. సరిగ్గా అలాంటి పొలిటికల్ సీన్ ఇప్పుడు రిపీట్ అవుతోంది.
ప్రతినిధుల సభలోని 435 స్థానాలకు గానూ వెలువడిన 410 ఫలితాల్లోనే డెమోక్రాట్లు 253 సీట్లు కైవసం చేసుకుని మెజారిటీ మార్కు 218ను సునాయాసంగా దాటేశారు. రిపబ్లికన్లు 157 సీట్ల వద్దే నిలిచిపోవడంతో వైట్‌హౌస్‌లో ఇప్పుడు పవర్ కట్ అయినంత పనిచేసింది. సెనేట్‌లోనూ డెమోక్రాట్ల దూకుడు చూస్తుంటే ట్రంప్ మార్క్ ‘గ్రేట్ అమెరికా’ హామీలపై ప్రజలు ఏ స్థాయిలో ఓటు వేసి తీర్పు ఇచ్చారో స్పష్టమవుతోంది.
1972 నాటి వాటర్‌గేట్ కుంభకోణం.. ఆ తర్వాత 1974 ఆగస్టులో రిచర్డ్ నిక్సన్ అవమానకర రాజీనామా అందరికీ గుర్తుండే ఉంటుంది. నిక్సన్ నిష్క్రమణ తర్వాత జరిగిన 1974 మిడ్‌టర్మ్ ఎన్నికల్లో డెమోక్రాట్లు 291 స్థానాలు గెలుచుకుని రిపబ్లికన్లను 144 సీట్లకే పరిమితం చేశారు. ఆ తర్వాత ఐదు దశాబ్దాల పాటు రిపబ్లికన్లు మళ్లీ అలాంటి ఘోర పరాజయాన్ని చూడలేదు.
ఇప్పుడు మళ్లీ అదే తరహాలో డెమోక్రాట్ల ప్రభంజనం వీచడంతో విశ్లేషకులు 1974 నాటి ఫలితాలతో పోలుస్తున్నారు. అయితే నాటి కుంభకోణం వేరు.. నేటి ట్రంప్ పాలనా స్టయిల్ వేరు. కానీ రెండు సందర్భాల్లోనూ ప్రజా తీర్పు ఇచ్చిన సందేశం మాత్రం ఒక్కటే "అధికారం ఉంది కదా అని ఏది పడితే అది చేస్తే చెల్లుబాటు కాదు" అన్నది ట్రంప్ ముఖం మీద కొట్టి మరీ అమెరికన్లు చవిచూపించారు.
ఈ ఓటమితో ట్రంప్ రాజకీయ చాప్టర్ ముగిసిపోలేదని ఆయన మద్దతుదారులు అనవచ్చు. కానీ ఇకపై వైట్‌హౌస్‌లో ఉండే కాలం ఆయనకు రోజాపూల బాట కాదనేది పక్కా.. డెమోక్రాట్లు హౌస్‌ను శాసిస్తుండటంతో ట్రంప్ ప్రతిపాదించే బడ్జెట్, బిల్లులు ప్రతిసారీ గట్టి పరీక్ష ఎదుర్కోవాల్సిందే. ప్రతిపక్షానికి బలం పెరగడంతో ట్రంప్ ప్రభుత్వ విధానాలు.. వివాదాస్పద నిర్ణయాలపై కాంగ్రెస్ కమిటీల విచారణలు.. ప్రశ్నల వర్షం తప్పదు. ఈ విప్లవాత్మక తీర్పు డెమోక్రాట్లలో సరికొత్త ఉత్సాహాన్ని నింపడమే కాక.. రిపబ్లికన్ పార్టీలో అంతర్గత అసంతృప్తికి.. నాయకత్వ మార్పు చర్చలకు తెరలేపనుంది.
2026 మిడ్‌టర్మ్ ఎన్నికలు ట్రంప్‌కు గట్టి 'వార్నింగ్ బెల్' మోగించాయి. మరి కాంగ్రెస్‌లో కొండలా మారిన ప్రతిపక్షాన్ని ఎదుర్కొంటూ ట్రంప్ సర్కార్ ముందుకెళ్తుందో.. లేక మరింత రాజకీయ సంక్షోభంలోకి జారుకుంటుందో చూడాలి.