'నోటీస్' సమానత్వం: మన 'సర్'లకే తప్పని ఈసీ 'సందు' చిక్కులు!

ఎన్నికల కమిషన్ (ఈసీ) రూల్ బుక్ ముందు అందరూ సమానులే అనే మాటను మన అధికారులు నిజం చేసి చూపించారు

Update: 2026-09-20 16:43 GMT

ఎన్నికల కమిషన్ (ఈసీ) రూల్ బుక్ ముందు అందరూ సమానులే అనే మాటను మన అధికారులు నిజం చేసి చూపించారు! దేశవ్యాప్తంగా సాగుతున్న ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ ఇప్పుడు సామాన్యుల సందుల నుంచి ల్యూటెన్స్ ఢిల్లీ రాజప్రాసాదాల వరకు ఒకే రీతిలో దడ పుట్టిస్తోంది. డిజిటల్ యుగంలో డేటా సరిపోలకపోతే ఏమవుతుందో చెప్పడానికి విదేశాంగ మంత్రి నుంచి ఎన్నికల కమిషనర్ వరకు అందరికీ ఈసీ పంపిన నోటీసులే సజీవ సాక్ష్యం.

అద్వానీ నుంచి జైశంకర్ దాకా.. అందరికీ ఒకే స్కెచ్

రాజకీయాల్లో ఎన్నో మైలురాళ్ళు చూసిన 98 ఏళ్ల బీజేపీ భీష్ముడు ఎల్.కే. అద్వానీకి 2002 నాటి రికార్డులతో ఓటు మ్యాప్ కాలేదట.. నిత్యం అంతర్జాతీయ దౌత్య నీతితో ఇతర దేశాలకు పాఠాలు చెప్పే విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌కు.. స్వయంగా విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీకి కూడా 'మీ వివరాల్లో వ్యత్యాసాలు ఉన్నాయి.. ధ్రువీకరించుకోండి' అంటూ నోటీసులు అందాయి.

ఇక అసలైన ట్విస్ట్ ఏంటంటే.. ఈ ప్రక్రియను పర్యవేక్షించాల్సిన ఎన్నికల కమిషనర్ సుఖ్‌బీర్ సింగ్ సంధు పేరుకే ఈసీ నుంచి నోటీస్ వెళ్లడం.. "నా జాబితాలో నాకే సందేహమా?" అని ఆయన అనుకున్నా ఆశ్చర్యం లేదు. వీరితో పాటు కాంగ్రెస్ సీనియర్లు కపిల్ సిబల్, అభిషేక్ మను సింఘ్వీ, మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, సెబీ చైర్మన్ తుహిన్ కాంత పాండేలకు కూడా ఈసీ సమన్లు తప్పలేదు.

పేరులో 'స్పెల్లింగ్' మారినా.. పాత ఓటు మాయమైనా..

అసలు ఈ రచ్చ అంతా దేనికి? పాత రికార్డుల్లో స్పెల్లింగ్ తప్పుగా ఉన్నా, కుటుంబ వివరాల్లో తేడాలున్నా, సిస్టమ్ వెంటనే 'డిస్క్రెపెన్సీ' అని రెడ్ సిగ్నల్ వేస్తోంది. ఢిల్లీలోనే దాదాపు 33 లక్షల మందికి ఈ 'సర్ప్రైజ్' నోటీసులు వెళ్లాయంటే ఈసీ ఏఐ సిస్టమ్ ఎంత కచ్చితంగా పనిచేస్తుందో అర్థం చేసుకోవచ్చు..

నోటీస్ వస్తే ఓటు పోయినట్లేనా?

నోటీస్ అనగానే "అయ్యో నా ఓటు హక్కు రద్దయిపోయిందా?" అని కంగారు పడాల్సిన పనిలేదు. అది కేవలం ఒక చిన్న రీ-వెరిఫికేషన్ హెచ్చరిక మాత్రమే. సరైన ఆధార్, 2002 నాటి పత్రాలు పట్టుకెళ్లి "నేను ఉన్నాను.. నా ఓటు నిజమే" అని నిరూపించుకుంటే సరిపోతుంది.

ఏదేమైనా ఈసీ పారదర్శకతపై సెప్టెంబర్ 22న సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. కానీ ప్రస్తుతానికైతే.. "సామాన్యుడి ఓటు పోతే పట్టించుకోరు" అనే నిందను చెరిపేసుకుంటూ వీఐపీల పేర్లను కూడా జాబితాలో పెట్టి, "శాసనం ముందు అందరూ సమానులే.. చివరకు 'సర్'లైనా.. 'సంధు'లైనా" అని ఎన్నికల కమిషన్ చాటిచెప్పినట్లయింది.

Tags:    

Similar News