హైకోర్టు తీర్పుపై దానం సుప్రీం ఆశ్రయించటం తెలివైన పనేనా?
ఖైరతాబాద్ ఎమ్మెల్యే (?) దానం నాగేందర్ ను అనర్హుడిగా ప్రకటిస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పును ఇవ్వటం తెలిసిందే.
ఖైరతాబాద్ ఎమ్మెల్యే (?) దానం నాగేందర్ ను అనర్హుడిగా ప్రకటిస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పును ఇవ్వటం తెలిసిందే. దీనిపై తాజాగా దానం నాగేందర్ సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు రంగం సిద్దం చేసుకోవటమే కాదు.. పిటిషన్ దాఖలు చేయటం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. హైకోర్టు అంత స్పష్టంగా చెప్పేసిన తర్వాత.. దేశ అత్యున్నత న్యాయస్థానం తలుపు తట్టటంలో లాజిక్ ఏంటన్న ప్రశ్న పలువురి నోటి నుంచి వస్తోంది. ఇంత స్పష్టంగా దానం దొరికిపోయిన తర్వాత సుప్రీంకు వెళ్లటంలో అర్థం లేదంటున్నారు.
దానం వ్యవహారంలో కాంగ్రెస్ అభ్యర్థిగా సికింద్రాబాద్ ఎంపీ స్థానానికి పోటీ చేయటమే ఆయన చేసిన పెద్ద పొరపాటుగా చెబుతున్నారు. అయితే.. సుప్రీంకోర్టులో ఆయన తరఫు న్యాయవాదులు ఎలాంటి వాదనలు వినిపిస్తారు? ఏయే అంశాల్ని డిటైల్డ్ గా చూస్తే.. ఆసక్తికర అంశాలు బోలెడు కనిపిస్తాయి. న్యాయవాద వర్గాల నుంచి తీసుకున్న ఇన్ ఫుట్స్ ప్రకారం చూస్తే.. తన అనర్హత విషయంలో హైకోర్టు తీర్పు స్పష్టంగా ఉన్నప్పటికి.. ఆయన హైకోర్టు పరిధిని ప్రశ్నించే వీలుందని చెబుతున్నారు.
దీనికి కారణం.. దానం నాగేందర్ ను అనర్హుడిగా ప్రకటించే అధికారం హైకోర్టు ఏమేరకు ఉంది? ఎలాంటి పరిస్థితుల్లో ఉంది? ఆ పరిస్థితులు దానం ఉదంతానికి సూట్ అయ్యేలా ఉందా? అన్నది మరో ప్రశ్న. ఈ విషయాల్ని చర్చించే ముందు 2025లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక తీర్పును ప్రస్తావించాల్సిన అవసరం ఉంది.2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫు ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా దానం గెలిచారు. ఆయనతో పాటు కడియం శ్రీహరి.. తెల్లం వెంకట్రావు కూడా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి మారారు. వీరిని అనర్హులుగా ప్రకటించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పీకర్ కు కంప్లైంట్ చేశారు. అయితే.. తమ ఫిర్యాదుపై స్పీకర్ తగిన నిర్ణయం తీసుకోవటంలో ఆలస్యంపై బీఆర్ఎస్ నేతలు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.
దీనిపై హైకోర్టు సింగిల్ జడ్జి విచారణ జరిపి.. స్పీకర్ అనర్హత పిటిషన్లపై విచారణకు షెడ్యూల్ నిర్ణయించాలని ఆదేశించారు. అయితే.. ఆ అదేశాన్ని అసెంబ్లీ కార్యదర్శి డివిజన్ బెంచ్ లో సవాలు చేశారు. 2024 నవంబరు 22న సింగిల్ బెంచ్ ఆదేశాన్ని డివిజన్ బెంచ్ కొట్టివేసింది. అనంతరం ఈ వ్యవహారం 2025లో సుప్రీంకోర్టుకు వెళ్లింది. పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరిన వ్యవహారంలో అనర్హత పిటిషన్లను స్పీకర్ ఎంతకాలం పెండింగ్ లో ఉంచవచ్చన్నది సుప్రీంకోర్టు ముందు ప్రశ్నగా వచ్చింది.
2025 జులై 31న సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయి నేతృత్వంలోని ధర్మాసనం తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పును కొట్టివేసింది. ఈ పది మంది ఎమ్మెల్యేల మీద ఉన్న అనర్హత పిటిషన్లను మూడు నెలల్లోపు నిర్ణయించాలనిపేర్కొంది. ఇక్కడ గమనించాల్సిన అంశం.. సుప్రీంకోర్టు 2025లో పది మందిలో ఒకడైన దానం నాగేందర్ అనర్హుడా కాదా? అన్నది నిర్ణయించలేదు. ఆ నిర్ణయం తీసుకోవాల్సింది స్పీకరే అని చెబుతూ.. సదరు స్పీకర్ నిర్ణయం తీసుకోకుండా ఇంతకాలం పెండింగ్ లో ఉంచటం సరికాదని చెప్పింది. ఇదంతా చూసినప్పుడు అర్థమయ్యేది ఒక్కటే పదో షెడ్యూల్ కింద ఎమ్మెల్యే అర్హుడా? కాదా? అన్నది నిర్ణయించాల్సింది రాజ్యాంగబద్దమైన అధికారం స్పీకర్ దే. కావాలంటే స్పీకర్ నిర్ణయం తర్వాత హైకోర్టు దాన్ని న్యాయసమీక్ష చేయొచ్చు.
ఇక్కడే మరో అంశాన్ని ప్రస్తావించాలి. సాధారణంగా స్పీకర్ చట్టబద్దమైన విధానాన్ని అనుసరించి ఉండని పక్షంలో.. సుప్రీంకోర్టు అలాంటి నిర్ణయాలను కొట్టివేసి.. మళ్లీ స్పీకర్ కే పంపిన సందర్భాలు గతంలో ఉన్న విషయాన్ని ప్రస్తావిస్తూ 2025 తీర్పులో ప్రస్తావించటం గమనార్హం. అయితే.. ఆ తీర్పులో చాలా ముఖ్యమైన మినహాయింపు కూడా ఉంది. రాజేంద్రసింగ్ రాణా కేసులో సుప్రీంకోర్టు ఒకసారి అసాధారణ పరిస్థితుల్లో తానే ఎమ్మెల్యేలు అనర్హులని ప్రకటించిన విషయాన్ని కూడా 2025 తీర్పులో ప్రస్తావించింది.దీనంతా సింఫుల్ గా ఐదు పాయింట్లుగా విభజిస్తే..
1. మొదటి దశలో అనర్హతను నిర్ణయించాల్సింది స్పీకర్
2. అవసరమైతే స్పీకర్ నిర్ణయాన్ని న్యాయసమీక్ష కోర్టు చేయొచ్చు
3. కోర్టు అభిప్రాయానికి భిన్నంగా స్పీకర్ నిర్ణయం ఉంటే.. ఆ విషయాన్ని చెబుతూ.. మరోసారి తగిన నిర్ణయాన్ని తీసుకోవాలని చెప్పొచ్చు.
4. అసాధారణ పరిస్థితుల్లో మాత్రం సుప్రీం కొన్ని నిర్ణయాలు తీసుకోవటం.
5. మొత్తంగా ప్రజాప్రతినిధి అర్హత.. అనర్హత విషయంపై కీలక నిర్ణయం స్పీకర్ దేనని.
దానం నాగేందర్ విషయానికి వస్తే.. 2025 సుప్రీం తీర్పులో అర్హత అంశాన్ని తేల్చాల్సింది స్పీకరేనని స్పష్టం చేసింది. ఎందుకంటే పది మంది ఎమ్మెల్యేలలో దానం నాగేందర్ ఒకరన్నది మర్చిపోకూడదు. తాజా పరిణామం 2025 కేసుకు కొనసాగింపుగా వచ్చిన తెలంగాణ హైకోర్టు తీర్పు అన్నది కీలకమైన అంశం. ఇదే అంశాన్ని దానంనాగేందర్ తన తాజా పిటిషన్ లో ప్రస్తావించే వీలుంది. 2025లో సుప్రీం విచారణ వేళలో పదో షెడ్యూల్ కింద అనర్హత అంశంపై మొదట నిర్ణయం తీసుకునే విషయంలో స్పీకర్ పాత్రను స్పష్టం చేశారు.
దానం విషయంలో స్పీకర్ ఆయన అనర్హుడు కాదని నిర్ణయించారు. ఆ నిర్ణయంపై న్యాయ సమీక్ష చేయొచ్చు. కానీ.. స్పీకర్ నిర్ణయాన్ని కొట్టివేసిన తర్వాత అదే హైకోర్టు స్వయంగా మొదటిదశలో అనర్హతను నిర్ణయించటం 2025లో సుప్రీంకోర్టు నిర్దేశించిన రాజ్యాంగ విధానానికి అనుగుణమేనా? అన్న ప్రశ్నను సంధించే వీలుంది. 2025 తీర్పులో సుప్రీం ఈ కేసును అసాధారణంగా పేర్కొనలేదు. అంటే.. దానం నాగేందర్ పై అనర్హత లేదని స్పీకర్ చెప్పినప్పుడు.. హైకోర్టు ఆ నిర్ణయాన్ని న్యాయసమీక్ష చేసి.. స్పీకర్ నిర్ణయం సరిగా లేదని భావిస్తే.. చట్టానికి అనుగుణంగా మళ్లీ నిర్ణయం తీసుకోవటానికి వీలుగా స్పీకర్ కు పంపాల్సిన అవసరం ఉంది కదా? అని ప్రశ్నించే అవకాశం సుప్రీంకోర్టులో దాఖలు చేసే పిటిషన్ లో ఉంది.
అదే సమయంలో ఏ అసాధారణ పరిస్థితుల్లో హైకోర్టు స్వయంగా తనకు తానుగా అనర్హతను నిర్ణయించింది? అన్న ప్రశ్నను సంధించే వీలుంది. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పుపై దానం నాగేందర్ స్టే కోరే అవకాశం ఉంది. గతంలో తన విషయంలో సుప్రీంకోర్టు చెప్పిన రాజ్యాంగ విధానాన్ని హైకోర్టు ఎందుకు అనుసరించలేదు? అని ప్రశ్నించే వీలుంది. దాని ఆధారంగా తుది విచారణ వరకు హైకోర్టు తీర్పుపై తక్షణం స్టే ఇవ్వాలని అడిగే అవకాశం ఉంది.
అయితే.. స్టే విషయంలో నిర్ణయాత్మక అంశం 2025 తీర్పు ఒక్కటే కాదు. హైకోర్టు తన తీర్పులో ఎందుకు స్వయంగా అనర్హత ప్రకటించిందన్న అంశాన్ని సుప్రీంకోర్టు కచ్ఛితంగా చూస్తుంది. అయితే.. ప్రస్తుతానికి హైకోర్టు తీర్పు పూర్తి పాఠం అందుబాటులోకి రాలేదు కాబట్టి.. అందులో ఏ అంశాల ఆధారంగా హైకోర్టు అనర్హత తీర్పును చెప్పిందన్నది స్పష్టం కాని పరిస్థితి. మొత్తంగా చూస్తే.. దానం నాగేందర్ ఎపిసోడ్ లో సుప్రీంకోర్టును ఆశ్రయించే విషయంలో తగిన బలంతో కూడిన వాదన ఉందన్న అభిప్రాయం నెలకొంది. దానంవైపు ఉన్న వాదనలో కీలక అంశాల విషయంలో దేశ అత్యున్నత న్యాయస్థానం ఈసారి ఎలా స్పందిస్తుందో చూడాలి.