అర‌గంట‌లో అద‌ర‌కొట్టేసింది.. హైద‌రాబాద్ ఆగ‌మాగం

వీకెండ్ వేళ‌.. హైద‌రాబాద్ మ‌హానగ‌రంలో దంచికొట్టిన వాన ఒక్క‌సారిగా వాతావ‌ర‌ణాన్ని చ‌ల్ల‌బ‌డేలా చేసింది.

Update: 2026-09-20 16:39 GMT

వీకెండ్ వేళ‌.. హైద‌రాబాద్ మ‌హానగ‌రంలో దంచికొట్టిన వాన ఒక్క‌సారిగా వాతావ‌ర‌ణాన్ని చ‌ల్ల‌బ‌డేలా చేసింది. ఎలినినో కార‌ణంగా ఈసారి వ‌ర్షాలు త‌క్కువ‌గా కుర‌వ‌టం.. వానా కాలంలోనూ మండే ఎండ‌ల‌తో ప్ర‌జ‌లు ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప‌రిస్థితి. ఎండ తీవ్ర‌త ఉద‌యం వేళ‌లో ఎక్కువ‌గా ఉండ‌టం ఇబ్బందుల‌కు గురి చేస్తోంది. సాధార‌ణంగా ఆగ‌స్టు.. సెప్టెంబ‌రు వ‌చ్చేస‌రికి వాతావ‌ర‌ణంలో చ‌ల్ల‌ద‌నం పెరుగుతుంది. కానీ.. ఈసారి అందుకు భిన్న‌మైన ప‌రిస్థితి. శ‌నివారం విష‌యానికి వ‌స్తే.. ఉద‌యం మొత్తం మండే ఎండ‌తో ప్ర‌జ‌లు ఉక్కిరిబిక్కిరి అయ్యే ప‌రిస్థితి.

అయితే.. శ‌నివారం సాయంత్రం వ‌ర్షం దంచికొడుతుంద‌న్న అంచ‌నాల‌తో పాటు.. అధికారులు ముంద‌స్తుగా వ‌ర్ష సూచ‌న‌కు సంబంధించి ఫోన్ల‌కు మెసేజ్ పెట్ట‌టం.. సాయంత్రం ఐదు త‌ర్వాత అవ‌స‌ర‌మైతే త‌ప్పించి బ‌య‌ట‌కు రావొద్ద‌న్న సూచ‌న చేశారు. అందుకు త‌గ్గ‌ట్లే సాయంత్రం ఐదు గంట‌ల వేళ‌కు వాతావ‌ర‌ణం పూర్తిగా మారిపోయింది. అప్ప‌టివ‌ర‌కు ఎండ భ‌గ‌భ‌గ‌ల స్థానే ఆకాశంలో ద‌ట్ట‌మైన మ‌బ్బుల ఎంట్రీతో సాయంత్రం వేళ‌కే చీక‌టి ప‌డిన ప‌రిస్థితి.

అంచ‌నాల‌కు అనుగుణంగా ఐదున్న‌ర గంట‌ల వేళ‌లో మొద‌లైన వ‌ర్షం కాసేప‌టికే భారీ వ‌ర్షంగా మారింది. కేవ‌లం అర‌గంట అంటే అర‌గంట వ్య‌వ‌ధిలో హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రం ప‌రిధిలోని ప‌లు ప్రాంతాల్లో ఆరు సెంటీమీట‌ర్ల వ‌ర్ష‌పాతం న‌మోదైంది. కొన్నిచోట్ల నాలుగైదు సెంటీమీట‌ర్ల చొప్పున వ‌ర్షం న‌మోదైంది. వీకెండ్ కావ‌టం.. సాయంత్రం వేళ భారీ వ‌ర్షం ప‌డుతుంద‌న్న అంచ‌నాను ముందే ప్ర‌జ‌లకు స‌మాచారం ఇవ్వ‌టంతో వాహ‌న‌దారుల‌కు ట్రాఫిక్ క‌ష్టాలు అంత‌గా ఎదురుకాని ప‌రిస్థితి.

హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రంలో శివారు ప్రాంతాల్లో భారీ వ‌ర్షం కురిసింది. హ‌య‌త్ న‌గ‌ర్ లో 6.3 సెంటీమీట‌ర్ల వ‌ర్ష‌పాతంన‌మోదుఅయితే.. బాలాపూర్ లో 5.9 సెంటీమీట‌ర్లు.. రాజేంద్ర‌న‌గ‌ర్ లో 4.4 సెంటీమీట‌ర్లు.. ఇలా న‌గ‌రం న‌లుమూల‌లు వ‌ర్షం తాకిడి క‌నిపించింది. భారీ వ‌ర్షంతో ప‌లు ప్రాంతాలు వ‌ర్ష‌పు నీటితో నిండాయి. లోత‌ట్టు ప్రాంతాలు జ‌ల‌మ‌య‌మ‌య్యాయి. వాతావ‌ర‌ణ శాఖ అధికారుల అంచ‌నా ప్ర‌కారం హైద‌రాబాద్ మ‌హాన‌గ‌ర ప‌రిధిలో రానున్న రెండు రోజుల్లో మ‌రింతగా వాన‌లు ప‌డే అవ‌కాశం ఉంద‌ని హెచ్చ‌రిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో వీకెండ్ వేళ‌.. బ‌య‌ట‌కు వెళ్లే వారు త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సిన అవ‌స‌రం ఉంద‌న్న‌ది మ‌ర్చిపోకూడ‌దు.

Tags:    

Similar News