అలేఖ్య చిట్టి పచ్చళ్లే కాదు అమెరికాలో కోడిగుడ్లు కొనటం కష్టమే
ఇక్కడ చెప్పే విషయానికి అలేఖ్య చిట్టి పచ్చళ్ల ప్రస్తావన తప్పనిసరి. అందుకే.. తప్పక చెప్పాల్సి వస్తోంది.;
ఏ మాటకు ఆ మాటే చెప్పాలి. సోషల్ మీడియా పుణ్యమా అని పచ్చళ్ల యాపారం సైతం ఏ స్థాయిలో చేయొచ్చన్న విషయాన్ని అర్థమయ్యేలా చేసింది. అంతేనా.. ప్రీమియం ధరలకు పచ్చళ్లను అమ్మేలా సాయం చేసింది. కాస్తంత నోటి దురద లేకుండా ఉండి ఉంటే.. అలేఖ్య చిట్టి పచ్చళ్ల కోసం సెలబ్రిటీలు సైతం క్యూ కట్టేవారేమో? పచ్చళ్ల అంటేనే పిచ్చ లైట్ తీసుకునే వారు సైతం అలేఖ్య చిట్టి పచ్చళ్ల గురించి తెలిసిన తర్వాత.. ఔరా అని ముక్కున వేలేసుకున్న పరిస్థితి. సోషల్ మీడియాలో జరిగిన ట్రోలింగ్ కు అలేఖ్య చిట్టి ఆసుపత్రి పాలైన తర్వాత కూడా ఆమెను వెంటాడతారేంటని మీరు అడగొచ్చు. అది సహజం.
ఇక్కడ చెప్పే విషయానికి అలేఖ్య చిట్టి పచ్చళ్ల ప్రస్తావన తప్పనిసరి. అందుకే.. తప్పక చెప్పాల్సి వస్తోంది. ఇప్పుడు అమెరికాలో కోడిగుడ్ల ధరలు విన్నంతనే అలేఖ్య పచ్చళ్ల వ్యవహారం చప్పున గుర్తుకు రాక మానదు. అందుకే ప్రస్తావించాల్సి వచ్చింది. ఇంతకూ అమెరికాలో కోడిగుడ్ల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి ఎందుకు? అన్న డౌట్ రావొచ్చు. అక్కడికే వస్తున్నాం.
బర్డ్ ఫ్లూ దెబ్బకు అమెరికాలో కోడిగుడ్ల ధరల గురించి తెలిసినంతనే కంటిగుడ్లు పత్తికాయల మాదిరి మారే పరిస్థితి. 2023 ఆగస్టులో డజను కోడి గుడ్లు మన రూపాయిల్లో రూ.175 ఉంటే.. ఈ ఏడాది మార్చిలో అది కాస్తా ఎక్కడికో వెళ్లిపోయింది. ప్రస్తుతం డజను కోడిగుడ్లు అమెరికాలో ఎంతో తెలుసా? మన రూపాయిల్లో అక్షరాల రూ.536. అంటే.. ఒక్కో గుడ్డు రూ.45 వరకు పలుకుతున్న పరిస్థితి.
నిజానికి అమెరికాలో కోడిగుడ్ల ధరలు మార్చి - ఏప్రిల్ లో పెరుగుతుంటాయి. అయితే.. ఈసారి చాలా ఎక్కువగా పెరిగాయి. దీనికికారణం.. బర్డ్ ఫ్లూ వ్యాపించటంతో 3 కోట్ల కోళ్లను (గుడ్డు పెట్టే కోళ్లు) నిర్మూలించారు. దీంతో.. గుడ్ల ప్రొడక్షన్ బాగా తగ్గిపోయింది. దీంతో.. ధరలు భారీగా పెరిగిపోయాయి. బర్డ్ ఫ్లూ వచ్చిన నేపథ్యంలో అమెరికాలో ముందస్తు జాగ్రత్త చర్యల్ని చేపట్టారు. మొత్తం 16.80 కోట్ల కోళ్లను వధించారు. వీటిల్లో అత్యధికం గుడ్ల కోసం పెంచే కోళ్లే. కోళ్లను వధించిన తర్వాత మళ్లీ కోళ్ల ఫారాల్ని పూర్తిగా శానిటైజ్ చేసి గుడ్ల ఉత్పత్తిని షురూ చేశారు. దీనికి కొంత సమయం పట్టనుంది. ఈ లోపు గుడ్ల రేట్లు భారీగా పెరిగిపోయి.. అమెరికన్లకు చుక్కలు చూపిస్తున్నాయి.