రోడ్లపై ఎందుకు జగన్...అయ్యన్న సంచలన వ్యాఖ్యలు
సభకు ప్రతిపక్షం హాజరు కాకుండా రోడ్ల మీద చేసే ఈ గుద్దులాటల సంస్కృతి ఏమిటో తనకు అసలు అర్థం కావడం లేదని స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆవేదన వ్యక్తం చేశారు.;
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ప్రస్తుతం పరామర్శ యాత్రలు చేస్తున్నారు.ఆ తరువాత ఆయన మీడియా ముందుకు వచ్చి ఏపీలో సమస్యల మీద మాట్లాడుతున్నారు. అయితే దీని మీద అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు స్పందించారు. ఈ నెల 11 నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఆయన జగన్ సహా వైసీపీ ఎమ్మెల్యేలకు మరోసారి విజ్ఞప్తి చేశారు. రోడ్లపైన మాట్లాడడం ఎందుకు అసెంబ్లీకి రండి అన్ని విషయాలు చర్చిద్దామని ఆయన జగన్ ని కోరారు.
ప్రజా సమస్యల మీద :
ఏపీ అసెంబ్లీలో ప్రజా సమస్యల మీద చర్చ సాగాలని అయ్యన్న కోరారు. ప్రతిపక్షం సభకు రావాలని ఆయన అన్నారు. వారు ప్రజల కోణంలో ప్రజా సమస్యలు ఏవి ప్రస్తావించిన సంబంధిత మంత్రుల చేత జవాబు చెప్పిస్తామని స్పీకర్ హోదాలో స్పష్టం చేశారు. మీరు ఏ సమస్య లేవనెత్తినా ప్రభుత్వం నుంచి సమాధానం రాబట్టడం తన బాధ్యతగా ఆయన చెప్పారు.
రోడ్ల పైన గుద్దులాటలు :
సభకు ప్రతిపక్షం హాజరు కాకుండా రోడ్ల మీద చేసే ఈ గుద్దులాటల సంస్కృతి ఏమిటో తనకు అసలు అర్థం కావడం లేదని స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆవేదన వ్యక్తం చేశారు. సభకు ప్రతిపక్ష సభ్యులు అంతా హాజరు కావాలని ప్రజా సమస్యల మీద నిర్మాణాత్మకమైన చర్చ సాగాలని ఆయన కోరుకున్నారు. అత్యున్నత వేదికలు అయిన చట్ట సభలు ఉండగా రోడ్ల మీద సమస్యల గురించి ప్రస్తావించడం సమంజసమేనా అని ప్రశ్నించారు.
నో వర్క్ నో పే అంటూ :
ఎవరైతే సభకు సభకు హాజరు కారో వారికి నో వర్క్ నో పే విధానాన్ని అమలు చేయాలని అయ్యన్న మరోసారి గట్టిగా కోరారు. ఈ విషయంలో రాజ్యాంగ బద్ధంతా ఉన్న అన్ని అవకాశాలను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాల్సి ఉందని అన్నారు. సభలోనే ఏ అంశం మీద అయినా చర్చ సాగాలి తప్పించి రోడ్ల మీద కానే కాదని ఆయన అంటున్నారు.
అయ్యన్న ప్రతిపాదనలు :
ఇదిలా ఉంటే నో వర్క్ నో పే అన్న అయ్యన్న ప్రతిపాదనలు అమలు అయ్యే అవకాశాలు ఉన్నాయా అన్న చర్చ సాగుతోంది. ఎందుకంటే 2024 లో ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన దగ్గర నుంచి వైసీపీ ఎమ్మెల్యేలు సభకు హాజరు కావడం లేదు, దాంతో వారు సభకు హాజరు కావాలని ప్రతీసారీ స్పీకర్ కోరుతూనే ఉన్నారు. అదే సమయంలో సభ్యులు కొందరు అసెంబ్లీ రిజిష్టర్ లో సంతకాలు చేసి సభకు దూరంగా ఉండడం మీద కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఈసారి బడ్జెట్ సెషన్ లో వైసీపీ సభ్యుల గైర్ హాజరు మీద తీవ్రంగానే చర్చించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.