బ‌లోపేత‌మే అజెండా.. పార్టీల వ్యూహ‌మేంటి?!

తెలంగాణ‌లో అధికార, ప్ర‌తిప‌క్ష పార్టీలు సంస్థాగతంగా బ‌లోపేతం కావ‌డంపై దృష్టి పెట్టాయి. త్వ‌ర‌లోనే గ్రేట‌ర్ హైద‌రాబాద్ మునిసిప‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌లు ఉన్నాయి.

Update: 2026-08-08 09:37 GMT

తెలంగాణ‌లో అధికార, ప్ర‌తిప‌క్ష పార్టీలు సంస్థాగతంగా బ‌లోపేతం కావ‌డంపై దృష్టి పెట్టాయి. త్వ‌ర‌లోనే గ్రేట‌ర్ హైద‌రాబాద్ మునిసిప‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌లు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో పార్టీలు సంస్థాగ‌తంగా బ‌లోపేతం కావాల‌ని నిర్ణ‌యించ‌డం గ‌మ‌నార్హం. కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌, బీజేపీలు ఇదే వ్యూహంతో ముందుకు సాగుతున్నాయి. వాస్త‌వానికి.. కాంగ్రెస్‌, బీఆర్ఎస్‌లు క్షేత్ర‌స్థాయిలో బ‌లంగానే ఉన్నాయ‌న్న వాద‌న ఉంది. బీజేపీకి మాత్ర‌మే హైద‌రాబాద్ స‌హా.. కొన్ని జిల్లాల్లో బ‌లం ఉన్నా.. రాష్ట్ర వ్యాప్తంగా వెనుక‌బ‌డే ఉంది.

ఈ నేప‌థ్యంలో బీజేపీ సంస్థాగతంగా నిల‌దొక్కుకునేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ముఖ్యంగా పార్టీ పెద్దలు.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తెలంగాణ‌ను ద‌క్కించుకునేందుకు రెడీగా ఉన్నారు. కానీ, క్షేత్ర‌స్థాయిలో వారి అంచనాల‌కు అనుగుణంగా కార్య‌క‌ర్త‌లు బ‌లోపేతం కావ‌డం లేదు. పార్టీ నాయ‌కుల మ‌ధ్య కూడా స‌ఖ్య‌త క‌నిపించ‌డం లేదు. ఈ ప‌రిణామాల‌ను స‌రిదిద్దుకునేందుకు బీజేపీ సంస్థాగ‌తంగా బ‌లోపేతం కావ‌డంపై దృష్టి పెట్టింది. ఈ మేర‌కు పార్టీ చీఫ్ రామ‌చంద‌ర్‌రావు.. చ‌ర్య‌లు చేప‌ట్టారు.

ఇక‌, సంస్థాగ‌తంగా బాగానే ఉన్న కాంగ్రెస్‌, బీఆర్ఎస్ లు కూడా.. ఈదిశ‌గానే అడుగులు వేయ‌డం ఏంట నేది చ‌ర్చ‌కు దారితీస్తోంది. దీనికి ప్ర‌ధానంగా ఒక‌పార్టీపై మ‌రో పార్టీ చేసుకుంటున్న విమ‌ర్శ‌లు.. వేసుకుం టున్న నింద‌లే కార‌ణ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఏమీ చేయ‌డం లేద‌ని, కేసీఆర్ తీసుకువ‌చ్చిన ప‌థ‌కాల‌ను కూడా నీరు గారుస్తోంద‌ని, రైతులు ఉసూరుమంటున్నార‌ని.. బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ప్ర‌చారం చేస్తున్న విష‌యం తెలిసిందే. దీని నుంచి త‌మ‌ను కాపాడుకునేందుకు కాంగ్రెస్ ప్ర‌య‌త్నిస్తోంది.

ఇక‌, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ప్ర‌చారం.. ముఖ్యంగా మాజీ సీఎం, బీఆర్ఎస్ అధిప‌తి కేసీఆర్ కేంద్రంగా సాగుతున్న విమ‌ర్శ‌ల‌కు అడ్డుక‌ట్ట వేయాల‌న్న‌ది బీఆర్ఎస్ వ్యూహంగా ఉంది. ఇక‌, ఉమ్మ‌డి స‌మ‌స్య‌ల విష‌యానికి వ‌స్తే.. క్షేత్ర‌స్థాయిలో చిన్నా చిత‌కా పార్టీల ఆవిర్భావం.. వాటి వ‌ల్ల త‌మ ఓటు బ్యాంకు ప్ర‌భావిత‌మ‌య్యే ప‌రిస్థితిని బీఆర్ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీలు లెక్క‌లు వేసుకుంటున్నాయి. ఈ నేప‌థ్యంలో ఓటు బ్యాంకును కాపాడుకునేందుకు.. క్షేత్ర‌స్థాయి కార్య‌క‌ర్త‌ల‌ను కాపాడుకునేందుకు వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే సంస్థాగ‌త నిర్మాణంపై దృష్టి పెట్టాయి.

Tags:    

Similar News