'ప్రతిపక్షాల కోసం' - అభిజిత్ దీప్కే సంచలన లేఖ
అధికార పార్టీపై విమర్శలు గుప్పిస్తూ, వివిధ సమస్యలపై ప్రభుత్వాలను నిలదీస్తూ లేఖాస్త్రాలను వదిలే కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఈ సారి రూటు మార్చాడు.
అధికార పార్టీపై విమర్శలు గుప్పిస్తూ, వివిధ సమస్యలపై ప్రభుత్వాలను నిలదీస్తూ లేఖాస్త్రాలను వదిలే కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే ఈ సారి రూటు మార్చాడు. ఎన్నికల వ్యవస్థపై విమర్శలు చేస్తున్న విపక్షానికి సూటి ప్రశ్నలు సంధిస్తూ సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర లేఖ రాశాడు. ‘ప్రతిపక్షాల కోసం’ అంటూ రాసిన ఈ లేఖ ప్రస్తుతం హాట్ టాపిక్ అవుతోంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్ చేస్తూ 48 గంటల డెడ్ లైను విధించిన అభిజిత్ దీప్కే ఈ రోజు మరోసారి ఆ విషయమై స్పందిస్తూ ఇంకా 24 గంటల సమయం మాత్రమే ఉందని గుర్తు చేశాడు. ఇక ప్రతిపక్షాల కోసం అంటూ ఆయన రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కేవలం ఏడు గంటల వ్యవధిలో దాదాపు ఏడు వేల మంది ఈ లేఖను రీ పోస్టు చేయగా, సుమారు రెండు వేల మంది కామెంట్లతో హోరెత్తించారు.
ఎన్నికల వ్యవస్థపై విమర్శలు చేస్తున్న ప్రతిపక్షాలకు కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే రాసిన లేఖ విస్తృత చర్చకు తెరతీసింది. ఎన్నికల్లో రిగ్గింగ్ జరుగుతోందని, ఓటు చోరీ చేస్తున్నారని విమర్శలు చేస్తున్న విపక్షం అటువంటి ఎన్నికల్లో ఎందుకు పోటీ చేస్తోందని అభిజిత్ దీప్కే ప్రశ్నించాడు. ఎన్నికలను బహిష్కరించాలని అప్పుడే ప్రజాస్వామ్యం గురించి ఆలోచించిన వారు అవుతారంటూ వ్యాఖ్యానించాడు. ప్రతిపక్షాల కోసం అంటూ అభిజిత్ రాసిన లేఖలో అనేక విషయాలను ప్రస్తావించాడు. ‘ఔను, ఎన్నికలు రిగ్గింగ్‌కు గురవుతున్నాయి. కానీ మీరు రిగ్గింగ్‌కు గురైన ఎన్నికలలో పాల్గొంటూ చట్టబద్దం చేస్తున్నారు’ అంటూ ఎత్తిచూపాడు.
ప్రస్తుత ఎన్నికల తీరును మ్యాచ్ ఫిక్సింగ్ తో పోల్చిచూపుతూ, ఎన్నికల్లో పాల్గొంటున్న ప్రతిపక్షాలు ప్రతి క్యాచ్‌ను వదిలేయలేవు. కొన్ని క్యాచ్‌లు పట్టుకుంటాయి. ఇలా మ్యాచ్ చివరి ఓవర్ ఆడటం వల్ల పోటీ హోరాహోరీగా సాగుతున్నట్లు కనిపించవచ్చు. మీరు పోటీ పడేలా చేయడానికి నిజమైన పోటీ జరిగిందని ప్రజలు నమ్మించడానికి సరిపోయే కొన్ని విజయాలు మాత్రమే మీకు అందించబడతాయి.’’ అని పేర్కొన్నాడు. అధికార పార్టీ కావాల్సిన మెజార్టీ వరకు గెలుచుకుంటుందని, ప్రతిపక్షాలను ఎప్పటికీ అదే పాత్రకు పరిమితం చేస్తూ ఎన్నికలను ఫిక్స్ చేస్తున్నారనే అర్థం వచ్చేలా దీప్కే తన లేఖలో పేర్కొన్నాడని చెబుతున్నారు.
ఇక ప్రతిపక్షాలు అస్తిత్వం కోల్పోతాయనే భయంతోనే పోటీ పడుతూ ఉన్నాయని, కానీ ఓట్లు దొంగతనం జరిగినప్పుడు, ఎమ్మెల్యేలు, ఎంపీలు కొనుగోలు జరుగుతున్నప్పుడు, ప్రతిపక్ష పార్టీలు చీలిపోతున్నప్పుడు ఏ రకమైన అస్తిత్వాన్ని రక్షించడానికి ప్రయత్నిస్తున్నారని ప్రశ్నించాడు. ఇది రాజకీయ మనుగడ కాదని, ఇలాంటి సిస్టమ్ లో ఎన్నాళ్లు జీవించగలరని నిలదీశాడు. మీ సొంత రాజకీయ మనుగడ కోసం ఆలోచించే ముందు దేశం, ప్రజాస్వామ్యం కోసం ఆలోచించాలని సూచించారు.