ఏఐకి పోటీగా ‘హ్యూమన్’.. 2026 వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా ఎంపిక!
| ఏఐ ప్రభావంతో మనిషి ప్రత్యేకతపై చర్చ పెరుగుతున్న నేపథ్యంలో కేంబ్రిడ్జ్ డిక్షనరీ 2026 సంవత్సరానికి ‘హ్యూమన్’ పదాన్ని వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా ప్రకటించింది. మనుషుల భావోద్వేగాలు, ఆలోచనలు, లక్షణాలను ఈ పదం సూచిస్తుందని తెలిపింది. ఏఐ సృష్టించిన వాటికి, మనుషులు తయారుచేసిన వాటికి మధ్య తేడా చెప్పేందుకు ‘Human-made’, ‘Human-written’ వంటి పదాల వాడకం పెరుగుతోందని పేర్కొంది.
ఏఐ రాకతో ప్రపంచంలో ఎన్నో మార్పులు కనిపిస్తున్నాయి. రచనలు, చిత్రాలు, సంగీతం.. ఇలా ఒకప్పుడు మనుషులు మాత్రమే చేయగలరనుకున్న పనులను ఇప్పుడు యంత్రాలు కూడా చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో మనిషికి ఉన్న ప్రత్యేకతపై చర్చ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కేంబ్రిడ్జ్ డిక్షనరీ 2026 సంవత్సరానికి ‘హ్యూమన్’ (Human) పదాన్ని వర్డ్ ఆఫ్ ది ఇయర్‌గా ప్రకటించింది.
కేంబ్రిడ్జ్ డిక్షనరీ ప్రకారం.. మనుషులకు ఉండే లక్షణాలు, లోపాలు, భావోద్వేగాలను కలిగి ఉండటమే హ్యూమన్ అనే పదానికి అర్థం. దేవుళ్లు, జంతువులు, యంత్రాలకు భిన్నంగా మనుషులను గుర్తించే లక్షణాలను ఈ పదం వివరిస్తుంది.
ఏఐతో మారుతున్న భాష
ఏఐ వినియోగం పెరుగుతున్న కొద్దీ ‘Human-made’, ‘Human-written’ వంటి పదాలు ఎక్కువగా వాడుకలోకి వస్తున్నాయని కేంబ్రిడ్జ్ గుర్తించింది. మనుషులు తయారుచేసినవి, ఏఐ సృష్టించిన వాటి మధ్య తేడాను చెప్పాల్సిన అవసరం పెరుగుతోంది.
కేంబ్రిడ్జ్ డిక్షనరీ లెక్సికోగ్రాఫర్ కోలిన్ మెకింతోష్ మాట్లాడుతూ.. ఏఐ కారణంగా మనిషిగా ఉండటమంటే ఏమిటనే చర్చ మళ్లీ మొదలైందని తెలిపారు. మన ఆలోచనలను యంత్రాలపై ఎంతవరకు ఆధారపెట్టాలనే ప్రశ్న కూడా ముందుకొస్తోందని చెప్పారు.
చివరి జాబితాలో నాలుగు పదాలు
‘Human’తో పాటు ‘Agent’, ‘Analogue’, ‘Wholesome’, ‘Dusking’ పదాలు కూడా పరిశీలనలో నిలిచాయి. స్వతంత్రంగా పనిచేసే ఏఐ వ్యవస్థను Agent అంటారు. డిజిటల్ టెక్నాలజీకి దూరంగా ఉండే వస్తువులు, అనుభవాలను Analogue సూచిస్తుంది.
ఏఐ ఎంత అభివృద్ధి చెందినా మనిషి ప్రత్యేకత ఏమిటనే ప్రశ్నకు ఈ ఎంపిక మరోసారి ప్రాధాన్యం ఇచ్చింది.