పుస్తకాలతో కుస్తీ లేదు.. ఏఐతో మస్తి.. టాపర్‌గా మారిన చీటర్ కథ
| దక్షిణ కొరియాలో ట్యాక్స్ అకౌంటెన్సీ పరీక్షలో 400కి 397.5 మార్కులు సాధించిన సియోక్, ఏఐ గ్లాసెస్‌తో కాపీ కొట్టినట్లు బయటపడింది. పరీక్ష ప్రశ్నలను స్మార్ట్ గ్లాసెస్‌తో ఫొటోలు తీసి, ఏఐ ద్వారా సమాధానాలు పొందినట్లు విచారణలో తేలింది. దీంతో పోలీసులకు లొంగిపోయాడు. ఏఐని నేర్చుకోవడానికి కాకుండా చీటింగ్‌కు వాడితే ఇలాంటి పరిణామాలే ఎదురవుతాయి.
పుస్తకాలతో బ్రెయిన్ వాడటం మానేశారు.. ఏఐ గ్లాసెస్‌తో నేరుగా టాపర్లు అయిపోయారు.. కష్టపడి చదివే రోజులుపోయి.. కాపీ కొట్టడానికి కూడా ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్’ అద్దాలు పెట్టుకునే ట్రెండ్ వచ్చేసిందయ్యా భయ్యా.. ఇక పరీక్షల్లో పాస్ కావడం ఈజీ అయిపోయింది. చదవడం కంటే చీటింగ్ చేయడానికే విద్యార్థులు ప్రాధాన్యమిస్తుండడం చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు.
పాస్ కావడమే గగనమైన కఠినమైన పరీక్షల్లో.. ఏకంగా 400కు 397.5 మార్కులా? ఈ రేంజ్‌లో టాలెంట్ చూసి తోటి అభ్యర్థులు మొదట్లో జేజేలు కొట్టారు. కానీ ఆ తర్వాత అసలు గుట్టు రట్టు కావడంతో అందరి మైండ్ బ్లాక్ అయింది. పుస్తకాలతో రాత్రంతా కుస్తీ పట్టాల్సిన అవసరం లేకుండా.. ఏకంగా ‘ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పరీక్ష రాసి అడ్డంగా దొరికిపోయాడు దక్షిణ కొరియాకు చెందిన సియోక్.
ట్యాక్స్ అకౌంటెన్సీ లాంటి అత్యంత క్లిష్టమైన పరీక్షలో దాదాపు నూటికి నూరు శాతం మార్కులు సాధించడం సాధారణ విషయం కాదు. అందుకే ఈ అసాధారణ ప్రతిభపై తోటి అభ్యర్థులకు అనుమానం వచ్చింది. విచారించగా అసలు బండారం బయటపడింది. మనోడు పరీక్ష హాలులోకి వెళ్లేటప్పుడు సింపుల్‌గా ఏఐ గ్లాసెస్ పెట్టుకెళ్లాడు. ఆ స్మార్ట్ అద్దాల సాయంతో పేపర్‌లోని ప్రశ్నలను స్నాప్‌లు తీసి ఏఐ టూల్ ద్వారా క్షణాల్లో సమాధానాలు తెప్పించుకుని ఎంచక్కా రాసేశాడు.
ఒకప్పుడు పరీక్షల్లో కాపీ కొట్టాలంటే టెక్స్ట్‌బుక్స్ చిట్టీలు రాసుకోవడం.. అరచేతుల్లో సూత్రాలు రాసుకోవడం లాంటి కష్టమైన పనులు ఉండేవి. కానీ నేటి టెక్నాలజీ యుగంలో కాపీ కొట్టే పద్ధతులు కూడా హైటెక్ అయిపోయాయి. మెదడుకు పని చెప్పకుండా ఏఐకి పవర్ ఆన్ చేస్తే ఇలాగే జైలు ఊచలు లెక్కపెట్టాల్సి వస్తుంది. చివరకు తన తప్పు తెలుసుకుని సియోక్ పోలీసులకు లొంగిపోవాల్సి వచ్చింది.
ఇక్కడ టెక్నాలజీ తప్పు కాదు.. దాన్ని వాడుకున్న విధానమే తప్పు. ఏఐ అనేది విద్యార్థులకు క్లిష్టమైన విషయాలను అర్థం చేయించడానికి సందేహాలు తీర్చడానికి ఒక అద్భుతమైన గురువులా పనిచేస్తుంది. కానీ అదే ఏఐని సొంత తెలివిగా భావిస్తే మాత్రం.. పరీక్షల్లో టాపర్‌గా మారవచ్చు కానీ జీవితంలో మాత్రం 'మహా చీటర్' ముద్ర పడటం ఖాయం.. ఇకపై పరీక్షల నిర్వహాకులు కూడా కేవలం సెల్‌ఫోన్ల నిరోధంతో సరిపెట్టకుండా ఈ ఏఐ గ్లాసెస్ విషయంలోనూ ఓ కన్నేయాల్సిన అవసరం ఉంది.