మైక్రోసాఫ్ట్ సేవల్లో భారీ అంతరాయం.. ఔట్‌లుక్, టీమ్స్, కోపైలట్ యూజర్లకు ఇబ్బందులు!
| మైక్రోసాఫ్ట్‌కు చెందిన ఔట్‌లుక్, 365, టీమ్స్, కోపైలట్ సేవలు గురువారం పలు దేశాల్లో నిలిచిపోయాయి. శుక్రవారం తెల్లవారుజామున ఔట్‌లుక్‌పై దాదాపు 1.38 లక్షల ఫిర్యాదులు నమోదయ్యాయి. సురక్షిత కనెక్షన్ల ప్రక్రియలో సాంకేతిక సమస్యతో సర్వర్లు స్పందించలేదని మైక్రోసాఫ్ట్ వెల్లడించింది. ఇది సైబర్ దాడి కాదని స్పష్టం చేస్తూ సేవల పునరుద్ధరణ చర్యలు చేపట్టింది.
ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ యూజర్లకు గురువారం ఊహించని సమస్య ఎదురైంది. సంస్థకు చెందిన ప్రముఖ సేవలైన ఔట్‌లుక్ (Outlook), మైక్రోసాఫ్ట్ 365 (Microsoft 365), టీమ్స్ (Teams), కోపైలట్ (Copilot) పనిచేయకపోవడంతో వేలాది మంది వినియోగదారులు ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా రోజువారీ కార్యాలయ పనులు, ఈమెయిల్ కమ్యూనికేషన్, ఆన్‌లైన్ సమావేశాల కోసం ఈ సేవలపై ఆధారపడే వారికి అంతరాయం ఏర్పడింది.
ఈ సమస్య పలు దేశాల్లోని వినియోగదారులను ప్రభావితం చేసింది. అవుటేజ్ ట్రాకింగ్ వెబ్‌సైట్ డౌన్‌డిటెక్టర్‌లో ఔట్‌లుక్‌కు సంబంధించి భారీ సంఖ్యలో ఫిర్యాదులు నమోదయ్యాయి. శుక్రవారం తెల్లవారుజామున 1:30 గంటల సమయంలో ఈ సంఖ్య దాదాపు 1.38 లక్షలకు చేరినట్లు నివేదికలు వెల్లడించాయి. మైక్రోసాఫ్ట్ 365 సేవకు సంబంధించి కూడా ఫిర్యాదులు ఒక్కసారిగా పెరిగాయి. దీంతో అనేక మంది తమ ఈమెయిల్స్‌ను యాక్సెస్ చేయలేకపోయారు. ఇతర సేవలను ఉపయోగించడంలోనూ సమస్యలు ఎదురయ్యాయి.
ఈ అంతరాయానికి గల కారణాన్ని గుర్తించిన మైక్రోసాఫ్ట్.. సురక్షిత కనెక్షన్లను నిర్వహించే ప్రక్రియలో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా కొన్ని సర్వర్లు స్పందించడం లేదని గుర్తించింది. అయితే ఇది సైబర్ దాడి వల్ల జరిగిన సమస్య కాదని సంస్థ స్పష్టం చేసింది.
మరోవైపు ఈ పరిణామం ఓపెన్‌ఏఐ, ఆంత్రోపిక్ సేవలపైనా ప్రభావం చూపింది. మైక్రోసాఫ్ట్ 365 కనెక్టర్లపై ఆధారపడే కొన్ని సేవల్లోనూ అంతరాయాలు ఏర్పడ్డాయి.
సేవలను సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు మైక్రోసాఫ్ట్ చర్యలు ప్రారంభించింది. ప్రభావిత సర్వర్లను పునఃప్రారంభించడం, ట్రాఫిక్‌ను ఇతర సర్వర్లకు మళ్లించడం, సాంకేతిక పరిష్కారాలను పరీక్షించడం వంటి చర్యలు చేపట్టింది. పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తూ సేవలను పూర్తిస్థాయిలో పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తోంది.