ఇక రాత్రిపూట కూడా సూర్యుడి వెలుగులు.. ప్రకృతి నియమాలకు విరుద్ధంగా వెళుతున్నామా?
| సూర్యాస్తమయం కాగానే ధరణిపై చీకటి ముసురుకోవడం.. వెలుతురు కోసం మనం మనం విద్యుత్ లైట్ల పై ఆధారపడటం సహజ సూత్రం.
సూర్యాస్తమయం కాగానే ధరణిపై చీకటి ముసురుకోవడం.. వెలుతురు కోసం మనం మనం విద్యుత్ లైట్ల పై ఆధారపడటం సహజ సూత్రం. అయితే భవిష్యత్తులో ఈ నియమం మారబోతోంది. రాత్రి సమయాల్లోనూ ఆకాశం నుంచి పగటి సూర్యరశ్మిని భూమిపైకి ప్రసరింపజేసేందుకు అంతరిక్ష రంగంలో ఒక విప్లవాత్మక ప్రయోగానికి శ్రీకారం చుడుతున్నారు. అమెరికాకు చెందిన ప్రముఖ స్పేస్ స్టార్టప్ ‘రిఫ్లెక్ట్ ఆర్బిటాల్’ ఈ అద్భుత ప్రాజెక్టును చేపడుతుండగా భారతీయ ప్రైవేట్ అంతరిక్ష సంస్థ ‘స్కైరూట్ ఏరోస్పేస్’ కీలక భాగస్వామిగా చేతులు కలిపినట్లు సమాచారం.
ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కోసం అంతరిక్షంలోకి ప్రత్యేకంగా రూపొందించిన భారీ అద్దాలు కలిగిన ఉపగ్రహాలను ప్రవేశపెడతారు. ఇవి కక్ష్యలో తిరుగుతూ సూర్యకాంతిని గ్రహించి.. భూమిపై అవసరమైన నిర్దేశిత ప్రాంతాల వైపు సూర్యరశ్మిని ప్రతిబింబించేలా పనిచేస్తాయి. దీనివల్ల సూర్యుడు అస్తమించిన తర్వాత కూడా భూమిపై కొన్ని ప్రాంతాలలో పగటి తరహా వెలుతురును నిరంతరాయంగా అందించవచ్చు. ఈ ప్రణాళికలో భాగంగా 2035 నాటికి ఏకంగా 50,000 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపాలని రిఫ్లెక్ట్ ఆర్బిటాల్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకోసం సాంకేతిక సహకారం, రాకెట్ ప్రయోగ సేవల కోసం భారత్‌కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ నెట్‌వర్క్‌ను వినియోగించుకోనున్నారు.
ఈ సాంకేతికత ద్వారా పలు ప్రయోజనాలు చేకూరే అవకాశం ఉంది. ప్రకృతి వైపరీత్యాలు సంభవించి విద్యుత్ వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయినప్పుడు అత్యవసర సహాయక చర్యలు చేపట్టడానికి ఈ వెలుతురు ఎంతో సహాయపడుతుంది. రాత్రిపూట కూడా పనులు సాగించే పరిశ్రమలకు.. మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో రాత్రి సమయాల్లో సాగే వ్యవసాయ కార్యకలాపాలకు ఇది వరంగా మారనుంది. అంతేకాకుండా రాత్రి వేళల్లో సౌర ప్యానెళ్లపై ఈ కాంతిని ప్రసరింపజేయడం ద్వారా నిరంతరాయంగా క్లీన్ ఎనర్జీని ఉత్పత్తి చేసే వీలుంది.
అయితే ఈ ఆలోచన సాంకేతికంగా వినడానికి ఎంతో అద్భుతంగా ఉన్నప్పటికీ ప్రకృతి, పర్యావరణ వ్యవస్థపై ఇది చూపే దుష్ప్రభావాలపై శాస్త్రవేత్తలు, ఖగోళ నిపుణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి వేళలు జీవకోటికి సహజమైన విశ్రాంతి సమయం. కృత్రిమ కాంతి వల్ల పక్షులు, కీటకాలు, వన్యప్రాణుల జీవన చక్రాలు దెబ్బతింటాయి. వలస పక్షులు ప్రధానంగా నక్షత్రాల వెలుగు ఆధారంగా ప్రయాణిస్తాయి కాబట్టి రాత్రిపూట ఈ అదనపు కాంతి వల్ల అవి దారి తప్పే ప్రమాదముంది. అలాగే రాత్రివేళల్లో కృత్రిమ కాంతి పెరిగితే ఆకాశం ప్రకాశవంతంగా మారి.. టెలిస్కోప్‌ల ద్వారా ఖగోళ పరిశోధనలు చేసే శాస్త్రవేత్తలకు స్పష్టత కరువవుతుంది. ఒకేసారి 50 వేల ఉపగ్రహాలను ప్రవేశపెట్టడం వల్ల అంతరిక్షంలో వ్యర్థాలు పెరిగి, ఇతర సమాచార ఉపగ్రహాల ప్రయాణానికి ప్రమాదం పొంచి ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మానవాళి అవసరాల కోసం సాంకేతికతను సరికొత్త శిఖరాలకు తీసుకెళ్లడం ఎంత ముఖ్యమో సహజమైన పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవడం కూడా అంతే అత్యవసరం. ఉపగ్రహాలు ప్రసరించే కాంతి తీవ్రత ఎంత ఉంటుంది..? జీవవైవిధ్యంపై దాని ప్రభావం ఏ స్థాయిలో ఉంటుందనే ప్రశ్నలకు రాబోయే ప్రయోగాల ఫలితాలే సమాధానం చెప్పాలి. సాంకేతిక రంగానికి పర్యావరణానికి నడుమ సాగుతున్న ఈ ప్రయోగం భవిష్యత్తులో ఎంతవరకు విజయవంతమవుతుందో వేచి చూడాలి.