నో పైలెట్.. నో ఫ్యూయల్.. విద్యుత్‌తో నడిచే విమానాన్ని కనిపెట్టిన చైనా!
| చైనా పైలట్ అవసరం లేకుండా నడిచే CE-25A అనే ఎలక్ట్రిక్ ప్రయాణికుల విమానాన్ని రూపొందించింది. 19 మంది ప్రయాణించే సామర్థ్యమున్న ఈ విమానం ఒక్కసారి ఛార్జ్ చేస్తే 400 కిలోమీటర్లు ప్రయాణించగలదని, గంటకు 300 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుందని సమాచారం. అయితే ఇలాంటి సాంకేతిక ఆవిష్కరణలు పెరుగుతున్నా పర్యావరణ సమస్యలు, ధరల భారాన్ని తగ్గించలేకపోతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.
నీటిపై తేలియాడే బ్రిడ్జ్‌లు, దీవులను నిర్మిస్తోంది.. సముద్ర గర్భంలోంచి దూసుకెళ్లే బుల్లెట్ ట్రైన్లను నడిపిస్తోంది.. సముద్రంపైనే గ్రీన్ ఎనర్జీ విప్లవం - సోలార్ విప్లవం- పవన విద్యుత్ విప్లవం! అంటూ ప్రతిదీ సంచలనమే. త్వరలోనే రోబోటిక్ ఆర్మీని బరిలో దించి శత్రుదేశాలను గడగడలాడించాలని ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. దాయాది చైనా వేసే ప్రతి అడుగు ఒక సంచలనం. ఏఐ రంగంలో.. అధునాతన సాంకేతికతలో ప్రపంచానికే సవాల్ విసురుతున్న చైనా ఇప్పుడు మరో సంచలనానికి తెర తీసింది.
ఇకపై ఏకంగా పైలెట్ అవసరం లేని ప్రయాణీకుల విమానాన్ని ఆవిష్కరించింది. విమానాన్ని నడిపే పైలెట్ అవసరం లేకుండానే ఆకాశంలో దూసుకెళ్లే అత్యాధునిక ఎలక్ట్రిక్ ఫ్లయింగ్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను చైనా ఇంజనీర్లు విజయవంతంగా రూపొందించారు. పూర్తిగా ఆటోమేటెడ్ వ్యవస్థతో పనిచేసే ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌కు CE-25A అని నామకరణం చేశారు. భవిష్యత్ రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికేలా ఈ అటానమస్ ఎలక్ట్రిక్ విమానాన్ని డిజైన్ చేయడం విశేషం.
ఈ సీఈ-25ఏ ఎలక్ట్రిక్ ఎయిర్‌క్రాఫ్ట్ ఫీచర్లు, సామర్థ్యం టెక్ నిపుణులను సైతం విస్మయానికి గురిచేస్తున్నాయి. ఒక్కసారి పూర్తిస్థాయిలో ఛార్జ్ చేస్తే ఇది ఏకధాటిగా 400 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించగలదు. అంతేకాకుండా.. గంటకు 300 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తూ.. భూమికి సుమారు 2400 మీటర్ల ఎత్తులో అత్యంత సురక్షితంగా ప్రయాణించే సామర్థ్యాన్ని కలిగి ఉంది.
సాధారణ డ్రోన్ల తరహాలో కాకుండా.. ఈ ఎలక్ట్రిక్ ఎయిర్‌క్రాఫ్ట్‌లో ఏకంగా 19 మంది ప్రయాణికులు ఒకేసారి కూర్చుని ప్రయాణించే వీలుండటం దీని ప్రత్యేకత. ఎటువంటి ఇంధన ఖర్చు లేకుండా.. కేవలం విద్యుత్ సాయంతో కాలుష్య రహితంగా.. పైలెట్ ప్రమేయం లేకుండా దానికదే ప్రయాణించే ఈ సీఈ-25ఏ మోడల్ అందుబాటులోకి వస్తే.. నగరాల మధ్య ప్రాంతీయ విమాన ప్రయాణాలు మరింత చౌకగా, వేగంగా మారనున్నాయి.
అయితే ఎన్ని రకాల ఇన్నోవేషన్స్ వచ్చినా ఈరోజుల్లో వాతావరణ కాలుష్యాన్ని, గ్రీన్ హౌస్ టెంపరేచర్ ప్రమాదాలను నివారించడం మనిషికి సాధ్యం కావడం లేదు. ఎల్.నినోని ఆపలేరు. కరుగుతున్న మంచు కొండల్ని ఆపలేరు. ఊళ్లపై పడే నదుల దండయాత్రల్ని ఆపలేరు. అంతేకాదు.. పెరుగుతున్న ధరల భారాన్ని కూడా తగ్గించలేని దుస్థితి. టెక్నాలజీ పెరుగుతోందని చంకలు గుద్దుకోవడం తప్ప ఎలాంటి ప్రయోజనం లేదనే నగ్నసత్యాన్ని ప్రజలు నెమ్మదిగా గ్రహిస్తున్నారు!