వీడియో కాల్ చేసి మరీ లొంగిపోమన్నారు.. వినని లష్కరే కమాండర్ ను లేపేశారిలా..
| జమ్మూకశ్మీర్‌లో లష్కరే తోయిబా కమాండర్ లతీఫ్ భట్‌ను చుట్టుముట్టిన భద్రతా బలగాలు తొలుత వీడియో కాల్ చేసి లొంగిపోవాలని కోరాయి. ఆయుధాలు విడిచిపెట్టి బయటకు వస్తే ప్రాణాలతో వదిలేస్తామని హామీ ఇచ్చినా అతడు నిరాకరించాడు. దీంతో కుల్గాంలో గంటలపాటు జరిగిన ఎదురుకాల్పుల్లో ఓ ప్రార్థనా మందిరంలో దాక్కున్న లతీఫ్‌ను బలగాలు హతమార్చాయి. పోలీసు కానిస్టేబుల్, ఇద్దరు వలస కార్మికుల హత్యల్లోనూ అతడికి సంబంధం ఉన్నట్లు భద్రతా వర్గాలు తెలిపాయి. అతడిపై రూ.15 లక్షల రివార్డు ఉంది.
ఉగ్రవాదంపై పోరాటం అంటే కేవలం తుపాకులతో ఎదురుదాడి చేయడం మాత్రమే కాదు.. అవకాశం ఉంటే ప్రాణాలను కాపాడేందుకు ప్రయత్నించడం కూడా భద్రతా బలగాల బాధ్యతే.. జమ్మూకశ్మీర్‌లో తాజాగా జరిగిన ఓ ఆపరేషన్‌లో మన సైన్యం మరోసారి ఈ విషయాన్ని చాటిచెప్పింది. ప్రాణాలు తీసే బుల్లెట్లు పేల్చడానికి ముందే.. లొంగిపోతే ప్రాణాలతో వదిలేస్తామని ఓ ఉగ్రవాదికి స్వయంగా వీడియో కాల్ చేసి మరీ జవాన్లు విజ్ఞప్తి చేశారు. కానీ ఆ దారినే ఎంచుకున్న అతడు చివరకు భద్రతా బలగాల ఎదురుకాల్పుల్లో హతమయ్యాడు.
జమ్మూకశ్మీర్‌లో లష్కరే తోయిబా మోస్ట్ వాంటెడ్ కమాండర్‌గా పనిచేస్తున్న లతీఫ్ భట్ కోసం భద్రతా బలగాలు కొంతకాలంగా తీవ్రంగా గాలిస్తున్నాయి. ఇటీవల కుల్గాంలోని సీఆర్పీఎఫ్ క్యాంపుపై జరిగిన దాడిలో అతడి ప్రమేయం ఉన్నట్లు తేలింది. ఈ క్రమంలో లతీఫ్ ఆచూకీ తెలుసుకున్న సైన్యం.. సీఆర్పీఎఫ్ సంయుక్త బలగాలు అతడిని చుట్టుముట్టాయి. అయితే వెంటనే కాల్పులు ప్రారంభించకుండా ఓ మానవీయ మార్గాన్ని ఎంచుకున్నాయి. అతడికి వీడియో కాల్ చేసి లొంగిపోవాలని కోరాయి. ఆయుధాలు విడిచిపెట్టి బయటకు వస్తే ప్రాణాలతో వదిలేస్తామని భరోసా ఇచ్చాయి.
భద్రతా బలగాలు ఎంతగా నచ్చజెప్పినా లతీఫ్ తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. 'నాకు అల్లా మాత్రమే తోడుగా ఉన్నాడు. నేను అల్లాకే భయపడతా' అంటూ లొంగిపోయేందుకు మొండికేశాడు. దీంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. తెల్లవారుజామున ఇరువర్గాల మధ్య కాల్పులు తీవ్రరూపం దాల్చాయి. చివరకు ఓ ప్రార్థనా మందిరంలో దాక్కున్న లతీఫ్‌ను గంటలపాటు సాగిన ఉత్కంఠభరిత ఆపరేషన్ అనంతరం భద్రతా బలగాలు మట్టుబెట్టాయి.
లతీఫ్ భట్ సాధారణ ఉగ్రవాది కాదు. భద్రతా బలగాల నుంచి తప్పించుకోవడంలో ఆరితేరిన వ్యక్తి. గతంలోనూ పలుమార్లు పోలీసుల కళ్లుగప్పిన అనుభవం అతడికుంది. అనంత్‌నాగ్‌లో పోలీసు కానిస్టేబుల్.. కుల్గాంలో ఇద్దరు వలస కార్మికుల హత్యలతోనూ అతడికి సంబంధం ఉన్నట్లు భద్రతా వర్గాలు తెలిపాయి. అత్యంత క్రూరుడైన ఈ ఉగ్రవాదిపై రూ.15 లక్షల రివార్డు కూడా ఉంది.
ఒకవైపు ఉగ్రవాదాన్ని అణచివేసే అత్యంత కఠిన వైఖరి.. మరోవైపు లొంగిపోయేందుకు చివరి అవకాశం ఇచ్చే గొప్ప మానవీయ కోణం.. ఈ రెండూ కుల్గాం ఆపరేషన్‌లో స్పష్టంగా కనిపించాయి. శత్రువు అయినప్పటికీ ప్రాణం విలువ తెలిసి మానవత్వంతో జవాన్లు చేసిన ఈ ప్రయత్నం ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశమైంది. దేశ రక్షణ కోసం ప్రాణాలను సైతం లెక్కచేయని మన సైనికుల తెగువకు.. వారి ఉన్నతమైన మానవత్వానికి ఈ ఘటనే నిదర్శనం...