హెచ్-1బీ కన్సల్టెన్సీలపై యూట్యూబర్ల దాడి: బాధితులకు న్యాయమా? వ్యూస్ కోసం సంచలనమా?

అమెరికాలో ఉద్యోగం సాధించాలనేది ప్రతిభావంతులైన వేలాది మంది భారతీయ టెక్కీల డ్రీమ్.

Update: 2026-09-25 12:30 GMT

అమెరికాలో ఉద్యోగం సాధించాలనేది ప్రతిభావంతులైన వేలాది మంది భారతీయ టెక్కీల డ్రీమ్. ముఖ్యంగా ఐటీ రంగానికి చెందిన నిపుణులకు హెచ్1బీ వీసా కేవలం ఒక పని అనుమతి పత్రం మాత్రమే కాదు.. మెరుగైన జీవితం, ఆకర్షణీయమైన వేతనం, భవిష్యత్తులో గ్రీన్‌కార్డ్ సాధనకు అది ఒక ప్రధాన ద్వారం. అయితే, కొందరు యజమానులు, లేబర్ బ్రోకర్లు ఈ వ్యవస్థలోని సవాళ్లను ఆసరాగా చేసుకుని అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు పెరగడంతో ఇటీవల అమెరికా ప్రభుత్వం దీనిపై దృష్టి సారించింది.

అమెరికా కార్మిక శాఖ (డీఓఎల్) ఇన్‌స్పెక్టర్ జనరల్ కార్యాలయం హెచ్1బీ పీఈఆర్ఎం కార్యక్రమాల్లో జరుగుతున్న మోసాలు, తక్కువ వేతనాల చెల్లింపు.. అనధికారిక కోతలు.. విదేశీ ఉద్యోగుల దోపిడీపై ప్రత్యేక దర్యాప్తులను ముమ్మరం చేసింది.

ఈ క్రమంలోనే సరికొత్త ధోరణి వెలుగులోకి వచ్చింది. అమెరికాలోని కొందరు యూట్యూబర్లు హెచ్1బీ కన్సల్టెన్సీలను లక్ష్యంగా చేసుకుని వరుస వీడియోలు చేయడం.. కొన్ని సంస్థలపై తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించడం చర్చనీయాంశంగా మారింది.

వ్యూస్ వేటలో ప్రాథమిక ఆధారాలు మరుగునపడుతున్నాయా?

సమాజంలో లేదా ఒక వ్యవస్థలో జరుగుతున్న అక్రమాలను వెలుగులోకి తీసుకురావడం బాధ్యతాయుతమైన డిజిటల్ మీడియా విధి. అయితే అధికారిక విచారణ అధికారులు లేదా న్యాయస్థానాలు నిర్ధారించకముందే వ్యక్తులను, సంస్థలను నేరుగా లక్ష్యంగా చేసుకోవడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సంచలనాత్మక థంబ్‌నెయిల్స్, అతిశయోక్తి వ్యాఖ్యానాలు, వ్యక్తిగత దూషణలతో కూడిన కంటెంట్ వల్ల అసలు సమస్య పక్కదారి పట్టే ప్రమాదం ఉంది. అన్ని కన్సల్టెన్సీలు మోసపూరితమైనవే అనే భావన కలిగించేలా వ్యాఖ్యానించడం వల్ల నిబంధనలకు లోబడి చట్టబద్ధంగా సేవలందిస్తున్న వేలాది సంస్థల ప్రతిష్ట కూడా దెబ్బతింటుంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రతి సంస్థను ముందే దోషిగా చిత్రీకరించడం సరైన విధానం కాదు. విమర్శలు ఆధారాలతో కూడి ఉండాలి తప్ప.. వ్యూస్ కోసం సంచలనంగా మారకూడదు.

అధికారిక దర్యాప్తులు.. డిజిటల్ విచారణలు

హెచ్1బీ వ్యవస్థలో మోసాలను నిరోధించేందుకు అమెరికా చట్టాల్లో పటిష్టమైన యంత్రాంగం ఉంది. లేబర్ కండిషన్ అప్లికేషన్ (ఎల్సీఏ) ఉల్లంఘనలు, వేతన వ్యత్యాసాలపై ఉద్యోగులు ఫిర్యాదు చేసినప్పుడు ప్రభుత్వ అధికారులు నేరుగా రంగంలోకి దిగుతారు. డల్లాస్ వంటి ప్రధాన సాంకేతిక కేంద్రాల్లో ఇటీవల అధికారులు కొన్ని కార్యాలయాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కొన్ని చోట్ల తలుపులు మూసి ఉండటం నమోదు చేశారు. క్షేత్రస్థాయి పరిశీలనలు ఒక ప్రాథమిక ప్రక్రియ మాత్రమే. ఇవే తుది తీర్పులు కావు.. అధికారిక విచారణ నివేదికలు, కోర్టు ఆదేశాల ఆధారంగానే అక్రమాలను నిర్ధారించాల్సి ఉంటుంది.

టెక్కీల భవిష్యత్తు కోసమైనా బాధ్యతాయుతమైన జర్నలిజం అవసరం

అప్పులు చేసి, న్యాయవాదుల రుసుములు చెల్లించి.. అమెరికా ఇమ్మిగ్రేషన్ కఠిన నిబంధనలతో ఏళ్ల తరబడి శ్రమించి అమెరికా చేరుకునే సగటు టెక్కీకి ఉద్యోగం ఊడిపోవడం లేదా జీతాలు అందకపోవడం అనేది జీవన్మరణ సమస్య. అయితే ఈ ప్రక్రియలో వాస్తవాలు, రికార్డులు, అధికారిక ఆధారాలను పునఃపరిశీలించకుండా ఇచ్చే తీర్పులు నిజమైన బాధితులకు న్యాయం చేయకపోగా అనవసరమైన భయాందోళనలను సృష్టిస్తాయి.

హెచ్1బీ వ్యవస్థ పారదర్శకంగా మారాలి.. దోషులకు శిక్ష పడాలి. అయితే ఆ పని చేయాల్సింది చట్టబద్ధమైన విచారణ సంస్థలు మాత్రమే.. యూట్యూబ్ వేదికలు కాదు.అమెరికన్ యూట్యూబర్లు ఇప్పటికై భారతీయ టెకీలు, సంస్థలపై పడి ఇలా పీక్కుతినకుండా వారి న్యాయమైన ప్రక్రియలు, వారి బాధలు అర్థం చేసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

Tags:    

Similar News