రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ వ‌ర్సెస్ టీడీపీ.. ఏం జ‌రుగుతోంది?

దీనిపై కేసు న‌మోదు చేసిన పోలీసులు.. వైసీపీ ఆముదాల‌వ‌ల‌స నియోజ‌క‌వ‌ర్గం ఇంచార్జ్ చింతాడ రవికుమార్‌ కోసం గాలింపును ముమ్మ‌రం చేశారు.

Update: 2026-08-08 10:30 GMT

ఏపీలో శ‌నివారం ఉద‌యం నుంచి టీడీపీ వ‌ర్సెస్ వైసీపీ నాయ‌కుల మ‌ధ్య పోటా పోటీ నిర‌స‌న‌లు, ధ‌ర్నాల‌తో ప‌రిస్థితి ఉద్రిక్తంగా మారింది. డీఎస్సీ-2025 ఉద్యోగాల విష‌యంలో కూట‌మి ప్ర‌భుత్వం అక్ర‌మాలు చేసింద‌ని ఆరోపిస్తూ.. వైసీపీ నేత‌లు రాష్ట్ర వ్యాప్తంగా ధ‌ర్నాలు చేప‌ట్టారు. అయితే. ఆయా ధ‌ర్నాల‌కు అనుమ‌తులు ఇవ్వ‌లేద‌ని పేర్కొంటూ.. పోలీసులు కొన్ని ప్రాంతాల్లో ధ‌ర్నా ప్రాంతాల వ‌ద్ద టెంట్ల‌ను, మైకుల‌ను తొల‌గించారు.

ఇదే స‌మ‌యంలో ఆయా ప్రాంతాల్లో టీడీపీ నాయ‌కులు సైతం ఎదురు ధ‌ర్నాలు చేయ‌డం గ‌మ‌నార్హం. డీఎస్సీ వేయ‌డం చేత‌కాని వైసీపీ ప్ర‌భుత్వానికి.. కూట‌మి ప్ర‌భుత్వాన్ని విమ‌ర్శించే అర్హ‌త లేద‌ని విమ‌ర్శిస్తూ.. ప‌లు ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు,ప్ర‌స్తుత మంత్రులు కూడా కౌంట‌ర్ ధ‌ర్నాల కు దిగారు. దీంతో ప‌రిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. మ‌రోవైపు జ‌గ‌న్ సొంత జిల్లా క‌డ‌ప‌లోని జ‌మ్మలమడుగు నియోజ‌క‌వ‌ర్గంలో ప‌రిస్థితి మ‌రింత ఉద్రిక్తంగా మారింది.

వైసీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి స‌హా కొందరు వైసీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్ర‌మంలో వైసీపీ నేత‌లు పోలీసుల‌కు మ‌ధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అయిన‌ప్ప‌టికీ.. వైసీపీ దీక్షా శిబిరాన్ని ఖాళీ చేయించిన పోలీసులు.. దీక్షా శిబిరం వద్ద వైసీపీ శ్రేణులను త‌రిమికొట్టారు. దీంతో వైసీపీ నాయ‌కులు రాళ్లు రువ్వేందుకు ప్ర‌య‌త్నించారు. దీంతో పోలీసులు అద‌న‌పు బ‌ల‌గాల‌ను రంగంలోకి దింపాల్సి వ‌చ్చింది.

శ్రీకాకుళంలో మ‌రో ర‌గ‌డ‌..

ఇటీవ‌ల వైసీపీ నేత జ‌గ‌న్‌.. శ్రీకాకుళం ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన స‌మ‌యంలో మ‌హిళా ఎస్సైపై కొంద‌రు వైసీపీ నాయ‌కులు గ‌లీజుగా వ్య‌వ‌హ‌రించార‌న్న ఫిర్యాదులు అందాయి. దీనిపై కేసు న‌మోదు చేసిన పోలీసులు.. వైసీపీ ఆముదాల‌వ‌ల‌స నియోజ‌క‌వ‌ర్గం ఇంచార్జ్ చింతాడ రవికుమార్‌ కోసం గాలింపును ముమ్మ‌రం చేశారు. ఇదేస‌మ‌యంలో ఆయ‌న అనుచ‌రుల‌ను శ‌నివారం ఉద‌యం అరెస్టు చేసి స్టేష‌న్‌కు త‌ర‌లించారు. అయితే.. ఈ అరెస్టుల‌ను ఖండిస్తూ.. వైసీపీ శ్రేణులు వంద‌లాదిగా శ్రీకాకుళంలో ధ‌ర్నాకు దిగారు. విజ‌య‌వాడ‌లోనూ ఇదే ప‌రిస్థితి నెల‌కొంది. ఇలా.. రాష్ట్ర వ్యాప్తంగా ప‌రిస్థితి ఉద్రిక్తంగా మార‌డం గ‌మ‌నార్హం.

Tags:    

Similar News