ఎన్టీఆర్ అంటే రాజకీయ సంచలనం....జెన్ జీ తెలుసుకోవాలి !
సీనియర్ ఎన్టీఆర్ అంటే చాలా మంది ఈనాటి తరానికి ఏమి తెలియదు అన్నది ఒక కఠిన సత్యం.
సీనియర్ ఎన్టీఆర్ అంటే చాలా మంది ఈనాటి తరానికి ఏమి తెలియదు అన్నది ఒక కఠిన సత్యం. ఇంకా లోతుగా ఆలోచించేవారికి ఆయన ఒక సినిమా హీరో అన్న భావన ఉండొచ్చు. పాత కాలం బ్లాక్ అండ్ వైట్ హీరోగా భావించేవారూ ఉన్నారు. అయితే ఎన్టీఆర్ గురించి ఈనాటి తరం తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది. అది కూడా జెన్ జెడ్, జెన్ ఆల్ఫా, జెన్ బీటా ఈ తరాలకు ఎన్ టీఆర్ గురించి చెప్పాలంటే అవి కేవలం మూడు అక్షరాలు కావు. ఒక సంచలన చరిత్ర అని గట్టిగానే విప్పి చెప్పాల్సి ఉంటుంది.
తొలి కాంగ్రెసేతర సీఎం :
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎన్టీఆర్ తొలి కాంగ్రేసేతర ముఖ్యమంత్రి. అంతే కాదు అప్పటికి మూడున్నరేళ్లుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ వంటి బలమైన జాతీయ పార్టీని కూకటి వేళ్ళతో కూలదోసి బంపర్ మెజారిటీతో అధికారంలోకి వచ్చిన వారు. అంతే కాదు ఎన్టీఆర్ ఒక రాజకీయ విప్లవం, ఒక సంచలనం, ఒక ప్రభంజనం, ఒక కొత్త చరిత్ర. కేవలం పార్టీ పెట్టిన తొమ్మిది నెలలలోనే అధికారంలోకి వచ్చి గిన్నీస్ రికార్డులో పేరు నమోదు చేసుకున్న అరుదైన నేత. ఇలా ఎన్టీఆర్ గురించి ఎంతగానో చెప్పాల్సి ఉంది.
సంస్కరణ శీలిగా :
అంతే కాదు ఎన్టీఆర్ గొప్ప సంస్కరణ శీలిగా చరిత్ర పుటలలో ఉంది. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు పరిపాలనా సంస్కరణలు కూడా తీసుకుని వచ్చారు. అవన్నీ కూడా తరువాత కాలంలో సువర్ణ అక్షరాలతో లిఖించబడి చరిత్రలో పదిలంగా చోటుచేసుకున్నాయి. ఇక ఎన్టీఆర్ అంటే అందరికీ గుర్తుకు వచ్చేది కిలో రెండు రూపాయల పథకం. సంపూర్ణ మధ్య నిషేధం. పటేల్–పట్వారీ వ్యవస్థ రద్దు, బీసీలకు రిజర్వేషన్లు, మండల వ్యవస్థ ఏర్పాటు, పేదలకు పక్కా ఇళ్ల నిర్మాణం, మహిళల పేరుతో ఇళ్ల పట్టాలు, స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్లకు మార్గం ఇలా ఎన్టీఆర్ అంటేనే ఎన్నో ఎన్నెన్నో గుర్తుకు వస్తాయి.
జాతీయ స్థాయిలోనూ :
ఎన్టీఆర్ అంటే జాతీయ స్థాయి రాజకీయాల్లోనూ అతి పెద్ద రాజకీయ నాయకత్వం. ఆయన అనాడు కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ప్రతిపక్ష పార్టీలను అన్నింటినీ ఏకం చేసి నేషనల్ ఫ్రంట్ ని ఏర్పాటు చేశారు. దానికి ఆయనే చైర్మన్ గా నాయకత్వం వహించారు. 1989లో ఏపీలో తెలుగుదేశానికి కనీసం పది దాకా ఎంపీ సీట్లు దక్కినా కూడా ఎన్టీఆర్ కేంద్రంలో ప్రధాని అయ్యేవారు. అలా తృటిలో చాన్స్ ఆయనకు మిస్ అయింది అని చెప్పాలి. ఇక జాతీయ రాజకీయ తెర పైన తెలుగు వాడి వాడి వేడి చూపించిన సాహసిగా చెప్పుకోవాలి.
హీరో అంటే ఆయనే :
ఇపుడు జెన్ జీ తరం ఆలోచించాల్సింది ఒక్కటే. హీరో అంటే ఆయనే అని. హీరో అంటే కేవలం వెండి తెర మీద మాత్రమే కాదు, బయట కూడా ఎన్టీఆర్ హీరో, ఆయన ధీరోదాత్తుడు, అందుకే కధానాయకుడు అన్నా రాజకీయ నాయకుడు అన్న ఎన్టీఆర్ పేరే ముందుగా ఎవరికైనా గుర్తుకు వస్తుంది. ఎన్టీఆర్ ఒక అద్భుతం అని కూడా చెప్పాలి. ఆయన నడయాడిన ఆంధ్రావని నిజంగా గొప్పది అని కూడా అందరికీ విడమరిచి చెప్పాలి. అందుకే ఎన్టీఆర్ ఈజ్ ఆల్వేస్ గ్రేట్ అన్న ఒకే ఒక్క మాట చాలు. పూర్తిగా అర్థం అయిపోతుంది. రియల్ హీరో అన్నా ఆయనే గుర్తుకు వస్తారు.