కొనేదంతా బంగారం కాదు...బిగ్ అలర్ట్ !
| బంగారం కొనుగోలులో అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆభరణాల బరువు పెంచేందుకు రేనియం లోహపు పొడిని కలుపుతున్నట్లు వెల్లడైంది. సాధారణ హాల్‌మార్క్ పరీక్షల్లో ఈ కల్తీని గుర్తించడం కష్టమని చెబుతున్నారు. అందుకే బీఐఎస్ హాల్‌మార్క్‌తో పాటు ఆరు అంకెల HUID నంబర్‌ను తప్పనిసరిగా పరిశీలించాలని సూచిస్తున్నారు.
కొనేదంతా బంగారం కదా అని మురిసిపోతే బోల్తా పడినట్లే అని అంటున్నారు బిలియన్ మార్కెట్ నిపుణులు. బంగారం ఎపుడూ మోజే. దానిని కొనాలని ప్రతీ ఒక్కరికీ ఆశగానే ఉంటుంది. తులం లక్షన్నరకు ఎగబాకినపుడు కూడా బంగారాన్ని కొనుగోలు చేశారు. అలాంటిది ఇపుడు భారీగా ధరల పతనం ఉంది. తొందరలోనే లక్షకు తులం బంగారం దిగివచ్చే గోల్డెన్ చాన్స్ కూడా ఉంది అని అంటున్నారు. దాంతో రానున్న కాలంలో బంగారం దుకాణాలు కిటకిటలాడే సీన్ ని అంతా చూస్తారు అంటున్నారు. అయితే ఇక్కడే తగిన జాగ్రత్తతో వ్యవహరించాలని నిపుణులు సూచిస్తున్నారు.
పుత్తడి బరువు వెనక :
ఇక బంగారం బరువుని పెంచేందుకు రేనియం అనే లోహపు పొడిని కలుపుతున్నారని తాజాగా తేలడం బంగారం ప్రియులను తీవ్రంగానే ఆందోళనకు గురి చేస్తోంది. చిత్రమేంటి అంటే ఇది హాల్ మార్కింగ్ టెస్టింగ్ లో సైతం దీన్ని గుర్తించడం కష్టమని అంటున్నారు. దీంతో ఈ నేపథ్యంలో బంగారం కొనేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు గట్టిగానే హెచ్చరిస్తునారు. అయితే ఈ రకమైన కల్తీని మాత్రం ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ పరీక్షతో కచ్చితంగా గుర్తించవచ్చంటున్నారు. బీఐఎస్ హాల్ మార్క్ తో పాటు ఆరు అంకెల హెచ్ యూఐడీఎ నంబర్ ని తప్పనిసరిగా చూసుకోవాలని వినియోగదారులకు నిపుణులు సూచిస్తున్నారు.
పసిడి కల్తీ ఎలా జరుగుతోంది :
ఇంతకీ పసిడిలో ఈ కల్తీ ఎలా జరుగుతోంది అన్నది ఇపుడు అంతా ఆలోచిస్తున్నారు. నిజానికి స్వచ్ఛమైన బంగారం సాంద్రత ఘనపు సెంటీమీటర్‌కు సుమారు 19.3 గ్రాములు ఉంటుంది. అయితే రేనియం సాంద్రత అంత కంటే ఎక్కువగా అంటే దాదాపు 21.02 గ్రాములు ఉంటుంది. దీనివల్ల తక్కువ బంగారంతోనే ఆభరణం బరువును అచ్చం స్వచ్ఛమైన బంగారం లాగే ఉండేలా చేయవచ్చు అని నిపుణులు చెబుతున్నారు. బంగారం 1,064 డిగ్రీల సెల్సియస్ వద్ద కరిగితే రేనియం కరగడానికి ఏకంగా 3,186 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత అవసరం అవుతుంది. ఇక సాధారణ కొలిమిలో బంగారాన్ని కరిగించినప్పుడు రేనియం కరగకుండా లోపలే కణాలుగా అలాగే మిగిలిపోతుంది.
పరీక్షలకు చిక్కదు :
ఇక బంగారం స్వచ్చతను పరీక్షించినపుడు పైభాగంలో స్వచ్ఛమైన బంగారం పూత ఉంటుంది. అయితే లోపల రేనియం పొడి మిశ్రమం ఉన్నప్పుడు దుకాణాల్లో ఉండే సాధారణ ఎక్స్ రే ఫ్లోరో సెన్స్ యంత్రాలు కేవలం ఉపరితలాన్ని మాత్రమే స్కాన్ చేస్తాయి. ఫలితంగా వాస్తవానికి 81.7 శాతంగా అంటే సుమారు 20 క్యారెట్లు మాత్రమే బంగారం ఉన్న ఆభరణానికి కూడా 22 క్యారెట్ల 916 హాల్‌మార్క్ వచ్చే ప్రమాదం ఉందని తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఈ తరహాలో బంగారం కల్తీ జరిగితే తులం లెక్కన 11.66 గ్రాములు బంగారం కొనుగోలుపై వినియోగదారులు వేల రూపాయలు నష్టపోయే అవకాశం ఉందని తాజా నివేదికలతో పాటు మార్కెట్ విశ్లేషకులు సైతం హెచ్చరిస్తున్నారు.
ఇదిలా ఉంటే ఈ మొత్త కల్తీ వ్యవహారంపై ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ కు ఫిర్యాదు చేసింది. దీనిపై చర్చించి, తనిఖీ విధానాలను మరింత కఠినతరం చేసేందుకు బీఐఎస్ ఉన్నత స్థాయి సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసినట్లుగా చెబుతున్నారు.