టీడీపీ బాటలోకి వైసీపీ...వారికి గండమే ?
| వైసీపీలో యువ నాయకత్వానికి పెద్దపీట వేయాలని జగన్ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎంపీ, ఎమ్మెల్యే టికెట్ల కేటాయింపులో 50 ఏళ్లలోపు వారికి ప్రాధాన్యత ఇవ్వాలని పార్టీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. 2029 ఎన్నికలే లక్ష్యంగా 25 నుంచి 40 ఏళ్ల మధ్య ఉన్న యువతకు నాయకత్వ బాధ్యతలు అప్పగించి పార్టీని ప్రక్షాళన చేయాలని చూస్తున్నట్లు చర్చ సాగుతోంది.
వైసీపీ లేట్ గా అయినా లేటెస్ట్ గా కీలక నిర్ణయం తీసుకోబోతోంది అని అంటున్నారు. ఇంకా చెప్పాలీ అంటే ఏపీలో టీడీపీ విజయవంతంగా అమలు చేస్తున్న విధానాన్ని వైసీపీ కూడా రానున్న కాలంలో అమలు చేసేందుకు రెడీ అవుతోంది. దాంతో వైసీపీలో ఇది అతి పెద్ద చర్చగానే కాదు భారీ ప్రక్షాళనకు నాందీ ప్రస్థానం గా ఉంటుంది అని అంటున్నారు. ఎందుకంటే వైసీపీలో అత్యధికులను ప్రభావితం చేసే సంచలన నిర్ణయంగా ఇది ఉండబోతోంది అని అంటున్నారు.
జగన్ యువ నేతగానే :
భారతదేశంలో రాజకీయ పరంగా చూస్తే జగన్ యువ నేతగానే పరిగణిస్తారు. నిజానికి వైసీపీని ఏర్పాటు చేసినపుడు జగన్ 35 ఏళ్ళ యువకుడు. అలా యువ నాయకత్వంలో ఒక కొత్త పార్టీ ఏపీలో ఏర్పాటు అవుతుందని ఆనాడు అంతా అనుకున్నారు. తీరా చూస్తే అందులో అంతా సీనియర్లకే పెద్ద పీట వేస్తూ వచ్చారు. అప్పటికే యాభైలు దాటిన వారు అంతా కాంగ్రెస్ నుంచి వైసీపీలో చేరి జిల్లాల స్థాయిలో రాజకీయంగా కుదురుకున్నారు. తమ మాటే వేదం అన్నట్లుగా వారు జిల్లాలను శాసిస్తూ వచ్చారు. గత మూడు ఎన్నికల్లో కూడా వైసీపీ వారికే టికెట్లు ఇస్తూ వచ్చింది. వైసీపీ సామాజిక సమీకరణలు రాజకీయ వ్యూహాలు బాగానే ఉన్నా పార్టీలో యువ నాయకత్వాన్ని ప్రోత్సహించడంలో మాత్రం విఫలం అయింది అన్నది అయితే ఎపుడూ ఒక చర్చగా ఉంది.
టీడీపీ ఫ్రెష్ లుక్ :
ఇక తెలుగుదేశం పార్టీ చూస్తే నాలుగున్నర దశాబ్దాలు చూసిన పార్టీ. ఒక విధంగా చెప్పాలంటే టీడీపీలోనే ఎక్కువ సీనియర్ నేతలు ఉన్నారు. వైసీపీ కోరి ఆ భారాన్ని తగిలించుకుంటే టీడీపీ నెమ్మదిగా వదిలించుకుంటూ వస్తోంది. ఆ పార్టీ 2024 ఎన్నికల నుంచి ఈ ప్రయోగాన్ని అమలు చేస్తూ వస్తోంది. దాంతో టీడీపీ ఎమ్మెల్యేలలో సగానికి సగం మంది యువతే కనిపిస్తున్నారు. అలాగే మంత్రులలో కూడా యంగ్ బ్యాచ్ ఎక్కువగా ఉంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం ఏరి కోరి యువతకే టీడీపీ పట్టం కట్టింది. అది మంచి ఫలితాలను ఇచ్చింది. వైసీపీ విషయానికి వస్తే ఈ విషయంలో పూర్తిగా వెనుకబడి ఉందని అంటున్నారు.
రూట్ మార్చాల్సిందే :
దాంతో వైసీపీ ఇపుడు రూట్ మార్చి అయినా కొత్త తరానికి యువతకు చాన్స్ ఇవ్వాలని చూస్తోంది. ఈ మధ్య కాలంలో జగన్ నోట పదే పదే జెన్ జీ అన్న మాట వస్తోంది. జెన్ జీ తరాన్ని ఆకట్టుకోవాలంటే కచ్చితంగా యువతకే పెద్ద పీట వేయాల్సి ఉంటుందని అధినాయకత్వం ఆలోచనలు చేస్తోంది అని అంటున్నారు. దాని కోసం వైసీపీ భారీ ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తోంది అని చెబుతున్నారు. సగానికి పైగా ఇంచార్జిల పనితీరు బాగు లేదని ప్రచారం సాగుతున్న నేపధ్యంలో ఇదే అదనుగా పార్టీలో యువ రక్తాన్ని కూడా ఎక్కించాలని అనుకుంటున్నట్లుగా చెబుతున్నారు.
వారే కనిపించేలా :
వైసీపీలో ఇక మీదట ఎంపీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినపుడు ఏజ్ 50 లోపు ఉండేలా చర్యలు తీసుకుంటుందని ప్రచారం అయితే సాగుతోంది. ఇంకా గట్టిగా చెప్పాలీ అంటే పార్టీలో పాతిక నుంచి నలభై మధ్యలో ఉన్న వారికే నాయకత్వ పగ్గాలు అప్పగించాలని చూస్తోంది అని అంటున్నారు. అదే కనుక జరిగితే వైసీపీలో అత్యధికులు గా ఉన్న సీనియర్లకు గండం తప్పదని అంటున్నారు. అయితే చాలా మంది ఇప్పటికే దీని మీద ఆలోచిస్తున్నారని తాము కనుక కాకపోతే తమ వారసులను బరిలోకి దింపి 2029 లో పోటీకి ఉంచాలని ప్లాన్స్ చేస్తున్నారు అని అంటున్నారు. మరి వారసులకే టికెట్లు ఇచ్చుకుంటూ పోతే కనుక వైసీపీ అనుకుంటున్న కొత్త నెత్తురు, ఫ్రెష్ లుక్ వస్తుందా అన్నది కూడా చర్చగా ఉంది. అయితే సమర్ధులైన వారసులకు ప్రాధాన్యత ఇస్తూనే ఎక్కువగా కొత్త వారికి ప్రోత్సాహం అందిస్తేనే పార్టీకి సుదీర్ఘ కాలంలో ప్రయోజనం ఉంటుందని ఫ్యాన్ పార్టీలో చర్చ అయితే సాగుతోంది అంటున్నారు.