మనసు మార్చుకున్న కొడాలి.. వారసుడి విషయంలో యూటర్న్!

అయితే ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో మళ్లీ తానే సీన్ లో ఉండాలని నాని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Update: 2026-09-24 14:30 GMT

వచ్చే ఎన్నికల్లో పోటీ చేయమని గతంలో ప్రకటించిన వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా మనసు మార్చుకుంటున్నారు. ఈ విషయంలో సీనియర్ నేత, మండలిలో విపక్ష నాయకుడు బొత్స ఇప్పటికే స్పష్టమైన ప్రకటన చేయగా, ఆయన దారిలోనే మరో మాజీ మంత్రి, వైసీపీ ఫైర్ బ్రాండ్ కొడాలి నాని పేరు వినిపిస్తోంది. ఆరోగ్య కారణాలతో వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం లేదని, తన బదులుగా రాజకీయ వారసుడు, తమ్ముడు కుమారుడు కొడాలి అర్జున్ కు సహకరించాలని నాని గతంలో కేడర్ కు సూచించారు. అయితే ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో మళ్లీ తానే సీన్ లో ఉండాలని నాని నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.

గుడివాడ ఎమ్మెల్యేగా నాలుగుసార్లు ప్రాతినిధ్యం వహించిన కొడాలి నాని, గత ప్రభుత్వంలో సుమారు మూడేళ్లపాటు మంత్రిగా పనిచేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారిగా ఓటమి చెందారు. ఆ తర్వాత అనారోగ్యానికి గురైన ఆయన రాజకీయంగా విశ్రాంతి తీసుకోవాలని భావించారని చెబుతున్నారు. ఈ క్రమంలోనే నియోజకవర్గ రాజకీయాలలో అప్పుడప్పుడు కనిపిస్తూ తన మనసులో మాటను కార్యకర్తలు తెలియజేశారని చెబుతున్నారు. ఇక తన వారసుడిగా తమ్ముడు కుమారు అర్జున్ ను పరిచయం చేశారు. అప్పటి నుంచి నియోజకవర్గ వైసీపీ కార్యకలాపాల్లో అర్జున్ చురుగ్గానే ఉంటున్నారు.

అయితే, కూటమి ప్రభుత్వం దూకుడు, ఎమ్మెల్యే వెనిగండ్ల రాము హవాను యువకుడైన కొడాలి అర్జున్ తట్టుకోలేకపోతున్నారని కార్యకర్తలు భావిస్తున్నారని అంటున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో మళ్లీ కొడాలి నాని పోటీ చేయాలని కార్యకర్తలు కోరుతున్నారని చెబుతున్నారు. ఇదే సమయంలో వైసీపీ అధిష్టానం కూడా ఫైర్ బ్రాండ్ నాని పోటీ చేయాలని సూచిస్తోందని అంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో నాని పోటీకి దూరంగా ఉంటే ప్రత్యర్థులకు భయపడ్డారని ప్రచారం జరిగే అవకాశం ఉందని, ఇది జిల్లాలోని ఇతర నియోజకవర్గాలపైనా ప్రభావం చూపొచ్చునని వైసీపీ హైకమాండ్ భావిస్తోందని అంటున్నారు.

ఈ నేపథ్యంలో 2029 ఎన్నికల్లో మాజీ మంత్రి నాని మరోసారి పోటీకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. మాజీ మంత్రి కూడా ఈ విషయాన్ని సీరియస్ గానే పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. తాను పోటీ చేయకపోతే కూటమి ప్రభుత్వానికి ముఖ్యంగా మంత్రి లోకేశ్ రెడ్ బుక్ కు భయపడి వెనకడుగు వేసినట్లు టీడీపీ ప్రచారం చేసుకుంటుందని కొడాలి కూడా భావిస్తున్నారని చెబుతున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో తానే తలపడాలని, వారసుడికి తగిన శిక్షణ ఇవ్వాలని కొడాలి నిర్ణయించుకున్నారని చెబుతున్నారు. ఇక 2029 ఎన్నికలకు సెమీ ఫైనల్ గా రానున్న స్థానిక ఎన్నికల్లో తన సత్తా చూపుతానని కొడాలి తన అనుచరులతో చెబుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Tags:    

Similar News