రుషికొండ ప్యాలెస్ కూల్చేస్తారా? హైకోర్టు తీర్పు కోసం వెయిటింగ్!
అయితే.. అది కలగానే మిగిలిపోయింది. దీంతో రుషికొండ రాజకీయంగా వివాదానికి దారితీసింది.
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని రుషికొండను తొలిచేసి.. భారీ ప్యాలెస్‌ను నిర్మించిన విషయం తెలిసిందే. దీనికిగాను 450 కోట్ల రూపాయల మేరకు ప్రజాధనాన్ని ఖర్చు చేశారు. 2022-23 మధ్య జోరుగా సాగిన ఈ నిర్మాణాన్ని వైసీపీ అధినేత జగన్ మరోసారి 2024 లో ముఖ్యమంత్రి అయితే.. ఇక్కడ నుంచే పాలన సాగించాలన్న ఉద్దేశంతో చేపట్టారు.అయితే.. అది కలగానే మిగిలిపోయింది. దీంతో రుషికొండ రాజకీయంగా వివాదానికి దారితీసింది.
450 కోట్ల మేరకు ఖర్చు చేయడం.. దేనికీ వినియోగించుకునేందుకు వీలు లేని విధంగా నిర్మించడంతో కూటమి ప్రభుత్వం ఈ నిర్మాణాన్ని ఏం చేయాలన్న విషయంపై ఇప్పటి వరకు నిర్ణయం తీసుకోలేదు. దాదాపు రెండున్న రేళ్లుగా ఈ నిర్మాణంపై ప్రభుత్వం అంతర్మథనం చెందుతోంది. దీనిని అలా వదిలేస్తే.. లోపలి భాగాలు దెబ్బతింటున్నాయి. అలాగని ఎవరికైనా లీజుకు ఇవ్వాలంటే.. పెద్దగా ఎవరూ ఆసక్తి చూపని పరిస్థితి నెలకొంది. ఫలితంగా ఇప్పటికే రెండున్నరేళ్లు గడిచిపోయాయి.
తాజాగా..
ఇక, ఈ వ్యవహారంపై తాజాగా టీడీపీ నేత, విశాఖ ఎంపీ శ్రీభరత్.. ఓ ఇంటర్వ్యూలో కీలక విషయాలు చెప్పారు. రుషికొండను లీజుకు తీసుకునేందుకు ఓ ఐటీ కంపెనీ వచ్చిందని తెలిపారు. అయితే.. నాడు వైసీపీ హయాంలో దీనిని నిర్మించిన విధానమే సరిగా లేకపోవడంతో వెనక్కి తగ్గిందని.. దీనిపై ప్రభుత్వం కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేక పోవడానికి ఇదే కారణమన్నారు. నాడు పర్యావరణ అనుమతులను యథేచ్ఛగా ఉల్లంఘించడంతో పాటు.. కోర్టులు, న్యాయ నిపుణుల సూచనలను కూడా వైసీపీ సర్కారు పట్టించుకోలేదన్నారు.
ఈ నేపథ్యంలోనే రుషికొండ ప్యాలెస్‌పై హైకోర్టులో కేసు ఉందన్నారు. పర్యావరణ అనుకూలంగా కట్టి ఉంటే పరిస్థితి వేరేగా ఉండేదన్నారు. కానీ, పర్యావరణానికి ముఖ్యంగా విశాఖకు సముద్ర గాలుల నుంచి రక్షణ కల్పిస్తున్న రుషి కొండను తొలిచేయడం పట్ల అటు కేంద్ర పర్యావరణ శాఖ సహా.. న్యాయ నిపుణులు కూడా ఆగ్రహంతో ఉన్నారన్నది ఆయన మాట.
ఈ నేపథ్యంలో ఈ నిర్మాణం కూల్చివేతకు ఆదేశాలు వచ్చే అవకాశం ఉందని న్యాయనిపుణులు చెబుతున్నారు. మహారాష్ట్రలో భారీ జంట అపార్ట్ మెంట్లను పర్యావరణ అనను కూలత కారణంగానే కూల్చి వేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రుషికొండ ప్యాలెస్‌ను కూడా కూల్చేసి.. తిరిగి పచ్చదనం పెంచేందుకు కోర్టు ఆదేశాలు ఇచ్చినా ఆశ్చర్యం లేదని.. అందుకే ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతోందని చెబుతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.