పవన్ ప్రకటన ఫలిస్తుందా? సందిగ్ధంలోనే శ్రేణులు!
స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ ఎక్కడెక్క పోటీ చేయాలి? ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలన్న విషయంపై ఆ పార్టీలో తీవ్రస్థాయి చర్చ నెలకొన్న విషయం తెలిసిందే.
స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ ఎక్కడెక్క పోటీ చేయాలి? ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలన్న విషయంపై ఆ పార్టీలో తీవ్రస్థాయి చర్చ నెలకొన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా పలు కార్పొరేషన్ సీట్లపై పార్టీ నాయకులు ఆశలు పెట్టుకున్నారు. కొన్ని చోట్ల తమ వారసులను కూడా రంగంలోకి దింపాలని నిర్ణయించుకున్నారు. విజయవాడ, విశాఖ, తిరుపతి, కర్నూలు, అనంతపురం వంటి నగర పాలక సంస్థల మేయర్లు, మునిసిపల్ చైర్మన్ పదవులపై ఆశలు పెద్దగానే ఉన్నాయి. ఇవి ప్రత్యక్ష ఎన్నికలు కావడంతో పార్టీలో నేతలు ఆశలు ఎక్కువగానే పెట్టుకున్నారు.
అయితే, క్షేత్రస్థాయిలో టీడీపీ నేతలు కూడా ఆయా స్థానాలపై పట్టుబిగించారు. ఎప్పటి నుంచో తమ ప్రభావం ఉందని.. సో.. తామే బరిలోకి దిగుతామని చెబుతున్నారు. దీంతో ఈ వ్యవహారం జనసేన-టీడీపీలో చర్చకు దారి తీసింది. ఈ వ్యవహారం ముదురుతున్న నేపథ్యంలో జనసేన పార్టీ సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసింది. ప్రతి జిల్లాకు ఒక కమిటీ.. రాష్ట్ర స్థాయిలో మరో కమిటీని ఏర్పాటు చేసింది. ఆయా కమిటీలు తమ తమ నివేదికలు అందించాయి. వీటిపై ఎలాంటి నిర్నయం తీసుకుంటారన్నది చూడాలి.
ఈలోగా.. జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తాజాగా కీలక ప్రకటన చేశారు. పిఠాపురంలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. ``గెలుస్తామని అనుకుంటేనే పోటీ చేస్దామని`` చెప్పారు. సమన్వయానికి ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. అదేసమయంలో కూటమి గౌరవానికి, ఐక్యతకు ఎనలేని ప్రాధాన్యం ఉంటుందన్నారు. ఎట్టి పరిస్థితిలోనూ వైసీపీ తిరిగి అధికారంలోకి రాకూడదన్నదే తమ ఉద్దేశంగా చెప్పుకొచ్చారు. అయితే.. పక్కాగా ఇన్ని స్థానాలు మనం తీసుకుందామని పవన్ ఎక్కడా చెప్పలేదు.
ప్రజల్లో బలం ఉన్న స్థానాల్లో జనసేన పోటీ చేయాలన్నారు. ఈ దఫా కూడా.. 100 శాతం స్ట్రయిక్ రేట్ సాధించాల న్నారు. దీంతో మళ్లీ అదే సందేహం పార్టీ నాయకుల్లో తచ్చాడుతోంది. తమకు క్లారిటీ కావాలంటూ.. నాయకులు పార్టీకి మెయిళ్లు పెడుతున్నారు. అంతేకాదు.. సమన్వయ కమిటీలకు మరోసారి అర్జీలు సమర్పిస్తున్నారు. ఏదో ఒకటి తేల్చాలని.. పోటీ చేసే కార్పొరేషన్లు.. జిల్లా పరిషత్, మండల పరిషత్‌లపై క్లారిటీ ఇవ్వాలని కోరుతున్నారు. దీంతో పవన్ ప్రకటన చేసినా.. జనసేనలో ఇదే సందేహం.. కొనసాగుతుండడం గమనార్హం.