పుతిన్‌కు ఒక రూల్.. నెతన్యాహుకు మరో రూల్? ఐక్యరాజ్యసమితిపై మళ్లీ ప్రశ్నలు
ముఖ్యంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు విషయంలో వ్యక్తమవుతున్న అంతర్జాతీయ వైఖరులు గ్లోబల్ జస్టిస్ లోని అసమానతలను స్పష్టంగా ఎత్తిచూపుతున్నాయి.
ప్రపంచంలో అంతర్జాతీయ చట్టాలు అందరికీ సమానంగా వర్తిస్తాయా? లేక ఒక దేశం యొక్క ఆర్థిక, సైనిక, దౌత్య శక్తులను బట్టి ఆ నిబంధనలు మారిపోతాయా? ఇటీవల ఐక్యరాజ్యసమితి (యూఎన్) వేదికగా చోటుచేసుకుంటున్న పరిణామాలు ఈ ప్రశ్నలను మళ్లీ తీవ్రంగా తెరపైకి తీసుకొచ్చాయి. ముఖ్యంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు విషయంలో వ్యక్తమవుతున్న అంతర్జాతీయ వైఖరులు గ్లోబల్ జస్టిస్ లోని అసమానతలను స్పష్టంగా ఎత్తిచూపుతున్నాయి.
రెండు వారెంట్లు.. భిన్నమైన పరిస్థితులు
అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ఐసీసీ) 2023లో ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఆ తర్వాత 2024 నవంబర్‌లో గాజా యుద్ధంలో మానవత్వానికి వ్యతిరేకంగా సాగిన నేరాల ఆరోపణలపై ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, అప్పటి రక్షణ మంత్రి యోవ్ గాలంట్‌లపై కూడా ఐసీసీ అరెస్ట్ వారెంట్లు ఇచ్చింది.
చట్టపరంగా ఇద్దరిపై ఒకే తరహా చర్యలు ఉన్నప్పటికీ వారి పట్ల అంతర్జాతీయ సమాజం స్పందిస్తున్న తీరు మాత్రం పూర్తి భిన్నంగా ఉంది. పాశ్చాత్య దేశాలు రష్యాపై కఠిన ఆంక్షలు విధించడంతో పాటు.. పుతిన్ ప్రయాణాలను పరిమితం చేశాయి. కానీ నెతన్యాహుపై వారెంట్ ఉన్నప్పటికీ ఆయన అమెరికా వంటి అగ్రరాజ్యాల్లో పర్యటించడం, ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాల్లో ప్రసంగించడం సాధ్యమవుతోంది.
అధికార పరిమితులు.. అమెరికా వ్యూహాత్మక పాత్ర
ఐసీసీకి నేరుగా తమ నిర్ణయాలను అమలు చేసే సొంత పోలీస్ వ్యవస్థ లేదు. వారెంట్ల అమలు పూర్తిగా సభ్య దేశాల సహకారంపైనే ఆధారపడి ఉంటుంది. అమెరికా ఐసీసీ రోమ్ స్టాట్యూట్‌లో సభ్య దేశం కాకపోవడమే కాకుండా చాలా కాలంగా దాని అధికార పరిధిని వ్యతిరేకిస్తోంది. దానికి తోడు ఇజ్రాయెల్‌తో అమెరికాకు దశాబ్దాలుగా ఉన్న సైనిక, రాజకీయ, ఆర్థిక సంబంధాలు నెతన్యాహుకు ఒక రక్షణ కవచంగా నిలుస్తున్నాయి.
యూఎన్ వేదికగా ప్రసంగించడానికి ఐసీసీ అనుమతి అవసరం లేదన్నది సాంకేతిక సత్యమే అయినా ఒక నాయకుడికి లభిస్తున్న దౌత్యపరమైన మద్దతు, మరొకరికి ఎదురవుతున్న అంతర్జాతీయ బహిష్కరణ వెనుక భౌగోళిక రాజకీయాలు ఎంతగా పనిచేస్తున్నాయో తేటతెల్లమవుతోంది. యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్‌లో అమెరికాకు ఉన్న వీటో అధికారం ఈ వ్యత్యాసాన్ని మరింత స్పష్టం చేస్తోంది.
విశ్వసనీయత కోల్పోతున్న అంతర్జాతీయ వ్యవస్థ?
ఒక దేశంపై తీవ్రమైన ఆంక్షలు, మరొక దేశానికి పూర్తిస్థాయి దౌత్య రక్షణ లభించడం వల్ల అంతర్జాతీయ వ్యవస్థల విశ్వసనీయత దెబ్బతింటోంది. అంతర్జాతీయ న్యాయం అనేది కేవలం బలహీన దేశాలకు లేదా ప్రత్యర్థి రాజ్యాలకే వర్తిస్తుందా అనే సందేహాలు సామాన్య ప్రజల్లో బలపడుతున్నాయి.
అంతిమంగా ఈ పరిణామాలు ప్రపంచం ముందు ఒకే సవాలును నిలబెడుతున్నాయి. ప్రపంచం నిజంగా కోరుకునేది చట్టబద్ధమైన అంతర్జాతీయ న్యాయమైతే ఆ న్యాయం శక్తుల కూటములు లేదా రాజకీయ ప్రయోజనాల ఆధారంగా మారకూడదు. బాధితుల తరఫున నిలబడాల్సిన వ్యవస్థలు శక్తివంతుడికి ఒకలా, మిగిలిన వారికి మరోలా కనిపిస్తే.. "అంతర్జాతీయ చట్టం" అనేది కేవలం పుస్తకాలకే పరిమితమయ్యే ప్రమాదం ఉంది.