ఆ వీడియో 'గుట్టు'రట్టయింది !

హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలోని బహదూర్ పూరలో ఈ నెల 13న జరిగిన పోలింగ్ సంధర్భంగా ఒక పోలింగ్ బూతులో రిగ్గింగ్ జరిగినట్లుగా ఉన్న వీడియో అది.

Update: 2024-05-17 07:49 GMT

తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు ముగిశాక గత నాలుగు రోజులుగా అందరి వాట్సప్ లతో పాటు వివిధ సామాజిక మాధ్యమాలలో ఒక వీడియో దర్శనమిస్తుంది. హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలోని బహదూర్ పూరలో ఈ నెల 13న జరిగిన పోలింగ్ సంధర్భంగా ఒక పోలింగ్ బూతులో రిగ్గింగ్ జరిగినట్లుగా ఉన్న వీడియో అది. దీనిని అందరూ షేర్ చేయాలని, హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో రీపోలింగ్ జరిగేదాకా దీన్ని షేర్ చేయాలని సందేశాలు పంపుతున్నారు.

ఈ వీడియోకు సంబంధించి హైదరాబాద్‌ సైబర్‌క్రైమ్‌లో కేసు నమోదయింది. అయితే ఈ వీడియో 2022లో పశ్చిమ బెంగాల్‌ ఎన్నికల సందర్భంగా బహదూర్‌పుర అనే ప్రాంతంలో జరిగిన రిగ్గింగ్‌కు సంబంధించిన పాత వీడియోగా ఎన్నికల సంఘం దృవీకరించి ప్రకటించింది. మరి ఈ వీడియోను ఎవరు వైరల్ చేస్తున్నారు అన్న దాని మీద సైబర్ క్రైమ్ పోలీసులు దృష్టి సారించి నిగ్గు తేల్చారు.

మల్కాజిగిరి బీజేపీ కార్పొరేటర్‌ శ్రవణ్‌కుమార్‌తో పాటు మరో ముగ్గుర్ని హైదరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు గురువారం అరెస్ట్‌ చేశారు. కార్పొరేటర్‌ శ్రవణ్‌కుమార్‌, నాంపల్లి వాసి మహ్మద్‌ బిన్‌ అలీ, చాదర్‌ఘాట్‌కు చెందిన కాశీ, ముషీరాబాద్‌కు చెందిన మితిలేష్‌ వీడియో వైరల్‌ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే బీజేపీ కార్పోరేటర్ అరెస్టు వ్యవహారం కాస్తా కలకలం రేపింది.

గురువారం సాయంత్రం సాధారణ దుస్తుల్లో వచ్చిన పోలీసులు మల్కాజ్‌గిరి ఆనంద్‌బాగ్‌ సమీపంలోని తన కార్యాలయంలో ఉన్న శ్రవణ్‌ను బలవంతంగా కారులోకి ఎక్కించుకుని తీసుకెళ్లారు. మిగిలిన వారిని కూడా వేర్వేరు చోట్ల అదుపులోకి తీసుకున్నారు. అయితే వీరిని ఎక్కడికి తీసుకెళ్తున్నారో కుటుంబ సభ్యులకూ సమాచారం ఇవ్వలేదు. దీంతో కిడ్నాప్‌ జరిగినట్లు ప్రచారం జరిగింది.

ఈ వ్యవహారంలో దాదాపు 2 గంటలపాటు మల్కాజ్‌గిరిలో హైడ్రామా నడిచింది. తన కుమారుడు శ్రవణ్‌ను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్‌ చేశారని ఆయన తండ్రి రాంబాబు మల్కాజ్‌గిరి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత రాత్రి 8 గంటలకు శ్రవణ్‌తో సహా నలుగురి అరెస్టు చేసినట్లు సైబర్‌క్రైమ్‌ పోలీసులు ధ్రువీకరించారు.

Tags:    

Similar News