ఒడిశా కోటపై ఎగిరే జెండా ఎవరిది ?

ఈ సారి రాష్ట్రంలో మరోసారి అధికారంలోకి రావడంతో పాటు అత్యధిక ఎంపీ స్థానాలను సాధించాలన్న ఉద్దేశంతో బీజేడీ ముందుకు కదులుతున్నది

Update: 2024-05-10 06:36 GMT

24 ఏళ్లుగా నిరంతరాయంగా ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నాయకత్వంలోని బీజేడీ మరోసారి అధికారంలోకి వస్తుందా ? ఈసారి ఎలాగయినా బీజేడీ చేతి నుండి అధికార పగ్గాలు లాక్కోవాలన్న బీజేపీ ప్రయత్నాలు ఫలిస్తాయా ? ఎలాగైనా పూర్వవైభవం సాధించాలన్న కాంగ్రెస్ కలలు నెరవేరతాయా ? ప్రధానంగా ఒడిశాలో ఇప్పుడు ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ల ఛరీష్మా మధ్య పోటీ నడుస్తున్నది. ఈ సారి రాష్ట్రంలో మరోసారి అధికారంలోకి రావడంతో పాటు అత్యధిక ఎంపీ స్థానాలను సాధించాలన్న ఉద్దేశంతో బీజేడీ ముందుకు కదులుతున్నది.

ఒడిశాలొ మే 13, 20, 25, జూన్‌ 1న నాలుగు విడతల్లో 21 లోక్‌సభ స్థానాలకు, 147 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మొదటి నుండి బీజేపీ - బీజేడీల మధ్య స్నేహం ఉంది. 2009 ఎన్నికల తరువాత బీజేపీకి బీజేడీ దూరంగా ఉంటున్నా స్నేహపూర్వక వైఖరినే కొనసాగిస్తూ వస్తున్నది. ఈ సానిహిత్యన్నే సాక్ష్యంగా చూపిస్తూ కాంగ్రెస్ పార్టీ బీజేపీ - బీజేడీ రెండూ ఒకటే అని ఎన్నికల ప్రచారంలో ఆరోపణలు చేస్తున్నది.

ఒకప్పుడు రాష్ట్రంలో బీజేడీ – కాంగ్రెస్‌ మధ్య పోటీ ఉండేది. 2019లో కాంగ్రెస్‌ను వెనక్కు నెట్టేసి బీజేపీ రేసులోకి వచ్చింది. 2019లో బీజేడీ 12 లోక్‌సభ, 112 అసెంబ్లీ స్థానాలను దక్కించుకోగా, బీజేపీ ఎనిమిది లోక్‌సభ, 23 అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. కాంగ్రెస్‌ ఒక లోక్‌సభ సీటును, 9 అసెంబ్లీ స్థానాలకు పరిమితం అయింది. బీజేీడీని ఓడించి అధికారం దక్కించుకునేందుకు బీజేపీ ప్రధానంగా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సన్నిహితుడు, మాజీ ఐఏఎస్ అధికారి కార్తీక్ పాండియన్ మీద ఆరోపణలు చేస్తున్నది. తమిళనాడు వ్యక్తికి ఇక్కడ ఏం పని అని ప్రచారం చేస్తున్నది. దేశమంతా ఒక్కటే అనే బీజేపీ ఇక్కడ వింత వాదన తేవడం ఆసక్తి రేపుతున్నది.

Read more!

గతంలో 23 శాసనసభ స్థానాలకు పరిమితం అయిన బీజేపీ ఈసారి ఏకంగా అధికారం పీఠం మీదనే గురిపెట్టింది. గతంలో 8 లోక్ సభ స్థానాలను గెలుచుకున్న ఆ పార్టీ ఈ సారి 16 స్థానాలు లక్ష్యంగా పెట్టుకున్నది. 2019 ఎన్నికల్లో బలహీనపడి, మూడో స్థానానికి పరిమితమైన కాంగ్రెస్‌ ఈసారి గణనీయంగా ఓట్లు సాధించి పూర్వవైభవం సంతరించుకోవాలని ఆరాటపడుతున్నది. కాంగ్రెస్ పుంజుకోవడం మూలంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయి తమకు లాభం చేకూరుతుందని బీజేడీ భావిస్తున్నది.

పాతికేళ్లుగా అధికారంలో ఉండడం మూలంగా బీజేడీకి క్షేత్రస్థాయిలో బలమైన కార్యకర్తలు, నేతలు ఉండడంతో ఆ పార్టీ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో పోలిస్తే పోల్ మేనేజ్ మెంట్ లో ముందున్నది. ఇదే సమయంలో కాంగ్రె్‌సకు బలమైన కేడర్‌ లేకపోవడంతో ప్రభుత్వ వ్యతిరేకతను అందిపుచ్చుకోవడంలో వెనుకబడింది. గత పదేళ్లుగా ఒడిశా మీద ప్రత్యేక దృష్టి పెట్టిన బీజేపీ ఈసారి మరింత బలాన్ని పెంచుకునే ప్రయత్నాలలలో కొనసాగుతున్నది. కేవలం 147 శాసనసభ, 21 లోక్ సభ స్థానాలు మాత్రమే ఉన్న ఒడిశాలో నాలుగు విడతలు ఎన్నికలు నిర్వహించడం మూలంగా ఎవరికి లబ్ది చేకూరుతుంది అన్నది వేచిచూడాలి.

Tags:    

Similar News