31 ఏళ్ల నాటి కేసులో ప్రస్తుత ఎంపీ అరెస్టు.. ఏమిటా కేసు?
అరెస్టు చేసేందుకు వచ్చిన పోలీసులకు ఆయన్ను అదుపులోకి తీసుకునేందుకు దాదాపు మూడు గంటల సమయం పట్టింది.;
బిహార్ లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. దాదాపు మూడు దశాబ్దాలు.. అంటే 31 ఏళ్ల నాటి కేసులో ప్రస్తుతం ఇండిపెండెంట్ ఎంపీగా వ్యవహరిస్తున్న పూర్ణియా లోక్ సభ ఎంపీ రాజేశ్ రంజన్ అలియాస్ పప్పు యాదవ్ ను బిహార్ పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం అర్థరాత్రి వేళ దాదాపు మూడు గంటల హైడ్రామా అనంతరం ఈ అరెస్టు చోటు చేసుకోవటం సంచలనంగా మారింది.
ఇంతకూ 31 ఏళ్ల నాటి కేసుకు సంబంధించి ఇప్పుడు అరెస్టు జరగటం ఏమిటి? ఇంతకూ ఆ కేసేంటి? అసలేం జరిగింది? అన్న వివరాల్లోకి వెళితే.. 1995లో వినోద్ బిహారి అనే వ్యక్తికి చెందిన ఇంటిని అద్దెకు తీసుకున్నారు పప్పు యాదవ్. తర్వాత దాన్ని కబ్జా చేశారన్నది ఆరోపణ. దీంతో ఇంటి యజమాని వినోద్ పోలీసుల్ని ఆశ్రయించారు. దీంతో ఆయనపై ఫోర్జరీ, మోసం, బెదిరింపులు తదితర సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేశారు. తాజాగా కోర్టు వారెంట్ జారీ చేశారు. దీంతో అర్థరాత్రి వేళ పప్పు యాదవ్ ఇంటికి వచ్చి అరెస్టు చేశారు.
అరెస్టు చేసేందుకు వచ్చిన పోలీసులకు ఆయన్ను అదుపులోకి తీసుకునేందుకు దాదాపు మూడు గంటల సమయం పట్టింది. అరెస్టు వేళ హైడ్రామా చోటు చేసుకుంది. అయితే.. రాజకీయ కక్ష సాధింపు చర్యలోనే తనను ప్రభుత్వం వేధిస్తుందని పప్పు యాదవ్ ఆరోపిస్తున్నారు. ఆసక్తికరమైన అంశం ఏమంటే.. అప్పుడెప్పుడో 31 ఏళ్ల క్రితం ఫిర్యాదు చేస్తే.. ఇప్పుడు అరెస్టు చేయటం.. అది అర్థరాత్రి వేళలో కావటం రాజకీయ రగడగా మారింది. రానున్న రోజుల్లో ఇంకేం జరుగుతుందో చూడాలి.