జ‌గ‌న్ బ్యాచ్‌: పార్ల‌మెంటును వాడేసుకుంటున్నారు..!

కేవ‌లం కూట‌మి ప్ర‌భుత్వం త‌ప్పుల‌ను ఎత్తి చూపించేందుకు.. కేంద్రం నోటి నుంచే చెప్పించేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. ఇది ఒక‌ర‌కంగా కూట‌మికి ఇబ్బందిక‌ర ప‌రిణామంగా మారింది.

Update: 2026-07-26 11:30 GMT

వైసీపీ అధినేత జ‌గ‌న్ చెప్పిన‌ట్టుగానే.. పార్ల‌మెంటు స‌భ్యులు ఉభ‌య స‌భ‌ల‌ను కూడా వాడేసుకుంటున్నారా? తద్వారా.. కీల‌క అంశాల‌పై వైసీపీ బ‌ల‌మైన గ‌ళ‌మే వినిపిస్తోందా? అంటే.. ఔన‌నే అంటున్నారు వైసీపీ నాయ‌కులు. పార్ల‌మెంటు వ‌ర్షాకాల స‌మావేశాలు.. గ‌త సోమ‌వారం ప్రారంభ‌మ‌య్యాయి. ఈ స‌మావేశాల్లో వాస్త‌వానికి కాక్రోచ్ జ‌న‌తా పార్టీ చేప‌ట్టిన ఉద్య‌మం.. పార్ల‌మెంటులో ప్ర‌తిప‌క్షాలు చేస్తున్న ఆందోళ‌న వంటివి ప్ర‌ధానంగా చ‌ర్చ‌కు వ‌స్తున్నాయి. దీంతో అస‌లు స‌భ‌లే జ‌ర‌గ‌డం లేదు.

అయిన‌ప్ప‌టికీ.. వైసీపీ స‌భ్యులు మాత్రం త‌మ గ‌ళాన్ని వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. అయితే.. ఇక్క‌డ చిత్రం ఏంటంటే.. జాతీయ‌స్థాయిలో జరుగుతున్న విద్యార్థుల ఆందోళ‌న‌ల‌ను వైసీపీ ఓన్ చేసుకోలేదు. పైగా స్పందించ‌డం కూడా లేదు. పార్ల‌మెంటులో ఇత‌ర ప‌క్షాలు ఈ విష‌యాన్ని ప్ర‌ధానంగా చ‌ర్చ‌కు పెడుతుండగా.. వైసీపీ మాత్రం దీనికి భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. పోనీ.. రాష్ట్రంలో ఉన్న స‌మ‌స్య‌ల‌నైనా ప్ర‌స్తావిస్తోందా? అంటే అది కూడా లేదు.

కేవ‌లం కూట‌మి ప్ర‌భుత్వం త‌ప్పుల‌ను ఎత్తి చూపించేందుకు.. కేంద్రం నోటి నుంచే చెప్పించేందుకు ప్ర‌య‌త్నిస్తోంది. ఇది ఒక‌ర‌కంగా కూట‌మికి ఇబ్బందిక‌ర ప‌రిణామంగా మారింది. లోక్‌స‌భ‌, రాజ్య‌స‌భ‌ల్లో జ‌రుగుతున్న ప్ర‌శ్నోత్త‌రాల స‌మ‌యంలో ఏపీకి సంబంధించి.. ముఖ్యంగా గ‌త రెండేళ్ల కాలంలో కూట‌మి ప్ర‌భుత్వం చేస్తున్న ప‌నుల‌కు సంబంధించిన ప్ర‌శ్న‌లు అడుగుతున్న వైసీపీ స‌భ్యులు.. వాటిపై కేంద్రం నుంచే స‌మాధానాలు రాబ‌డుతున్నారు. త‌ద్వారా.. త‌మ గ్రాఫ్ పెరుగుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.

కానీ వాస్త‌వం ఏంటి..?

పార్ల‌మెంటు ద్వారా వైసీపీ చేస్తున్న ఈ ప్ర‌యోగం.. పార్టీప‌రంగా నేత‌ల‌కు సంతోషాన్ని ఇచ్చే విష‌యం అయితే కావొచ్చు. కానీ, ప్ర‌జ‌లు వీటిని పెద్ద‌గా ప‌ట్టించుకోవ‌డం లేదు. పైగా వైసీపీపై ఏర్ప‌డిన వ్య‌తిరేక భావ‌న ప్ర‌జ‌ల్లో ఇప్ప‌టికీ అలానే ఉంది. దీంతో వైసీపీ చేస్తున్న పార్ల‌మెంటు ప్ర‌యోగం పెద్ద గా ఫ‌లించే అవ‌కాశం లేద‌ని కూట‌మి నాయ‌కులు అంచ‌నా వేస్తున్నారు. దీంతో కూట‌మి ఎదురు దాడి చేయ‌డం దాదాపు త‌గ్గించేసింది. పార్ల‌మెంటు ప్ర‌శ్న‌ల స‌మ‌యంలో మౌనంగా ఉంటోంది. మ‌రి వైసీపీ దీనినే మైలేజీ అనుకుంటుందా? అనేది చూడాలి.

Tags:    

Similar News