అక్కినేనికి పాడేందుకు బాలుకు నో...ఏం చేశారంటే ?
అయితే 1970 దశకం వచ్చేసరికి ఘంటసాలకు ఆరోగ్యం సరిగ్గా సహకరించకపోవడంతో పాటలు తగ్గించుకోవాల్సి వచ్చింది. దాంతో అక్కినేనికి వేరే గొంతుక అవసరం పడింది.
పాత రోజులలో ఒక హీరోకు నేపధ్య గానం చేయాలి అంటే కచ్చితంగా కొన్ని విధానాలు ఉండేవి. దర్శకులు నిర్మాతలు హీరోలు సైతం ఆమోదముద్ర వేయాలి. కేవలం సంగీత దర్శకుడు ఓకే చేస్తే సరిపోదు, దానికి మించి ఆయా హీరో అభిమానులు కూడా దానిని మెచ్చుకోవాలి. ఇలా అన్నీ కుదిరితేనే అక్కినేని నందమూరి లాంటి అగ్ర హీరోలకు ఏ కొత్త గాయకుడు అయినా పాటలు పాడే చాన్స్ దక్కించుకునేవారు. ఇక అక్కినేనిది తెలుగు సినీ పరిశ్రమలో సువర్ణ అధ్యాయం. ఆయన తొలి మూడు దశాబ్దాల సినీ జీవితం అమర గాయకుడు ఘంటసాల నేపధ్య గానం తోనే హాయిగా గడిచిపోయింది. ఘంటసాల పాట రేడియోలో వింటే అక్కినేని కళ్లకు కనిపించేవారు. అలాగే వెండి తెర మీద అక్కినేని పాడుతూంటే ఆయనే పాడారా అనిపించేది. అంతలా ఈ గాన బంధం పెనవేసుకుని పోయింది.
అనివార్యమైన స్థితి :
అయితే 1970 దశకం వచ్చేసరికి ఘంటసాలకు ఆరోగ్యం సరిగ్గా సహకరించకపోవడంతో పాటలు తగ్గించుకోవాల్సి వచ్చింది. దాంతో అక్కినేనికి వేరే గొంతుక అవసరం పడింది. అప్పటికి సినీ పరిశ్రమలో వర్ధమాన గాయకుడిగా ఎదుగుతున్న ఎస్పీ బాలుతో ఒక ప్రయత్నం చేశారు. అదే ఇద్దరు అమ్మాయిలు సినిమాలో అక్కినేనికి డ్యూయెట్ పాడించారు. నా హృదయపు కోవెలలో అంటూ సాగే ఈ పాటలో బాలు అద్భుతంగా పాడినా అది అక్కినేనికి సెట్ కాలేదు అన్న విమర్శలు వచ్చాయి. థియేటర్లలో ఆ సాంగ్ వచ్చినపుడు అక్కినేనికి ఎవరో పాడుతున్నారు అని తెలిసిపోయింది. ఘంటసాల వంటి గంభీరం అయిన గొంతుకకు అలవాటు పడిన జనాలు బాలు లేత గొంతుకను మెచ్చలేకపోయారు. దాంతో అక్కినేనికి బాలు గొంతుక సూట్ కాదు అన్న భావన అయితే వ్యాప్తి చెందింది.
మధ్యలో రామకృష్ణ :
సరిగ్గా ఇదే సమయంలో ప్రసిద్ధ గాయని పి సుశీల అక్క కొడుకు అయిన వి రామకృష్ణ గొంతు ఘంటసాలకు అనుకరిస్తూ దగ్గరగా ఉండడంతో ఆయన్ని అక్కినేని ప్రోత్సహించారు. తమ సొంత నిర్మాణ సంస్థ అన్నపూర్ణ ద్వారా విచిత్ర బంధం సినిమాలో రామకృష్ణను పరిచయం చేశారు. అలా ఘంటసాలకు బదులుగా రామక్రిష్ణకు అవకాశాలు ఎక్కువగా వచ్చాయి. బాలు విషయం తీసుకుంటే అప్పటి టాప్ హీరో అక్కినేనికి పాడలేకపోవడంతో ఇతర హీరోలతో కూడా పాడేందుకు అవకాశాలు తగ్గిపోయాయి. ఒక విధంగా బాలు మొత్తం కెరీర్ లో అది సంధి యుగం గా చెబుతారు.
ఆ ఒక్క సాంగ్ తో :
బాలు ఈ విషయాన్ని పట్టుదలగా తీసుకున్నారు. తాను గాయకుడిగా ఫెయిల్ కాదు, కానీ అక్కినేనికి సూట్ అయ్యేలా ఎలా పాడాలి అని ఆలోచించి ఆయన ఒక మార్గం ఎంచుకున్నారు. అది ఘంటసాలను అనుకరించకుండా అక్కినేని గొంతుకను అనుకరించి పాడడం. అలా ఆలూ మగలు సినిమాలో టీ చలపతిరావు సంగీత దర్శకత్వంలో ఆయన ప్రోత్సాహంతో అక్కినేనికి బాలు పాడి మెప్పించారు. అదే ఎరక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయాను. ఈ పాట వింటే అచ్చం అక్కినేని పాడినట్లుగా ఉంటుంది. అలా అక్కినేని వారి గొంతుకలో మ్యాజిక్ ని బాలు పట్టేశారు. అది సూపర్ హిట్ కావడంతో ఇక బాలు వెనక్కి తిరిగి చూసుకోలేదు. అక్కినేనికి అప్పటి నుంచి చివరి దాకా బాలూయే పాడారు. ఈ ఇద్దరి కాంబోలో ఎన్నో సూపర్ డూపర్ హిట్ మూవీస్ వచ్చాయి. ఇక ప్రేమాభిషేకం అయితే ఎవర్ గ్రీన్ అని చెప్పాలి. మొత్తానికి అక్కినేనికి బాలు పాడి మెప్పించడం అన్నది ఇప్పటికీ ఒక గొప్ప ప్రయత్నంగా చెప్పుకుంటారు.