తమ్మినేని కి జగన్ ఇచ్చిన హామీ ఓకేనా ?
శ్రీకాకుళం జిల్లా రాజకీయాల గురించి జగన్ కి తెలియనిది ఏమీ లేదని అంటున్నారు. అక్కడ వర్గ పోరు ఉంది.
శ్రీకాకుళం జిల్లాలో ఇటీవల రాజకీయ రచ్చ రేగింది. అది కూడా విపక్ష వైసీపీలోనే. సీనియర్ నేత, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కుమారుడు తమ్మినేని చిరంజీవి నాగ్ అయితే సొంత పార్టీలో ప్రత్యర్ధుల గురించి మాట్లాడుతూ వారి మీద విమర్శలు చేస్తూ ఒక దశలో వైసీపీ మీద కూడా హాట్ కామెంట్స్ చేసేశారు. జిల్లాలో వైసీపీ ఒక్క సీటు కూడా వచ్చే ఎన్నికల్లో గెలవదు అని ఆయన ఒక బిగ్ స్టేట్మెంట్ ఇచ్చారు. అది ఆయన ధర్మాన సోదరుల మీద ఆగ్రహంతో అన్న మాట అయినప్పటికీ మొత్తం పార్టీ మీదనే విమర్శలు చేసినట్లు అయింది. అది కాస్తా టీడీపీ కూటమికి ఆయుధంగా మారింది. ఇంకేముందు సొంత పార్టీ వారే చెబుతున్నారుగా, వైసీపీ ఓటమి గురించి అని ఎద్దేవా చేయడం మొదలైంది. ఇది కాస్తా మరింతగా రాజుకుంటున్న వేళ తమ్మినేని సీతారాం వెళ్ళి జగన్ ని కలిశారు అని అంటున్నారు.
మొత్తం విప్పి చెప్పారా :
శ్రీకాకుళం జిల్లా రాజకీయాల గురించి జగన్ కి తెలియనిది ఏమీ లేదని అంటున్నారు. అక్కడ వర్గ పోరు ఉంది. దానితో పాటు సామాజిక సమీకరణ విషయంలో కూడా ఆధిపత్య ఆరాటాలు ఉన్నాయి. మొత్తం ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలను లీడ్ చేసే విషయంలో మెజారిటీ అభిప్రాయం బట్టి పార్టీ ముందుకు సాగుతోంది. అదే సమయంలో జిల్లాలో సీనియర్ నేతలకు గతంలోనే జగన్ హామీ ఇచ్చారు. అయినా సరే వర్గ పోరు ఆగడం లేదు, అదిపుడు ఇంకా బాహాటం అయింది. దాని మీద జగన్ ఏమి అడిగారు తమ్మినేని ఏమి చెప్పి ఉంటారు అన్నది చూస్తే ఇందులో అంతా తెలిసిందే అని అంటున్నారు. తమ్మినేని తీవ్ర అసంతృప్తితో ఉన్నారు అన్నది వాస్తవం. తన సొంత ఇలాకా ఆముదాలవలసలో తనకు పట్టు ఉన్న చోట తమ కుటుంబానికే ఆముదాలవలస సీటు వదిలేయమన్నది ఆయన కోరిక. అయితే అక్కడ వేరే నేతకు పార్టీ ఇంచార్జి బాధ్యతలు ఇచ్చింది. మరి ఈ విషయం మీద ఆయన అధినాయకత్వం దృష్టికి తెచ్చారా అన్నది అయితే పార్టీ వర్గాలే చెప్పాల్సి ఉందని అంటున్నారు.
ఎంపీగానే చాన్స్ అంటూ :
అయితే జగన్ గతంలోనే చెప్పారు. తమ్మినేని సీనియారిటీకి తగిన విధంగా ఎంపీగా పోటీ చేసేందుకు అవకాశం ఇస్తామని. ఆ విధంగా ఆయన్ని పార్లమెంట్ నియోజకవర్గం ఇంచార్జిగా నియమించారు. మరి దానికి తగినట్లుగా తమ్మినేని పనిచేస్తున్నారా లేదా అన్నది కూడా అధినాయకత్వం దగ్గర నివేదికలు ఉంటాయి కదా అని అంటున్నారు. ఇక చూస్తే శ్రీకాకుళం పార్లమెంట్ సీటుకు ఇప్పటికి మూడు సార్లు ఎన్నికలు జరిగితే ఒకసారి తూర్పు కాపులకు రెండు సార్లు కాళింగులకు ఇచ్చి వైసీపీ సమన్యాయం చేసింది. మరో సారి కాళింగులకే ఇస్తామని హామీ ఇచ్చింది అని అంటున్నారు. అది కూడా 2029 ఎన్నికల్లో డీలిమిటేషన్ లో మార్పులు జరిగితే తప్ప అని చెప్పారని అంటున్నారు. సో ఎంపీ అభ్యర్థిగా ఇప్పటి నుంచే పనిచేసుకోవాలని సూచించారు అని అంటున్నారు.
అప్పటికి ఎలా ఉంటుందో :
అయితే డీలిమిటేషన్ లో మార్పులు అని వైసీపీ అంటోంది. ఒక వేళ డీలిమిటేషన్ జరిగి ఈ సీటు మహిళలకు రిజర్వ్ అయితే చేసేది ఏమీ ఉండదని అంటున్నారు. అంతే కాదు ఆ సీటుని అపుడు అదే సామాజిక వర్గానికి చెందిన కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణికి ఇస్తారని అంటున్నారు. ఆమె ప్రస్తుతం కాంగ్రెస్ లో ఉన్నారు. వైసీపీలోకి ఆమె వస్తారు అని ప్రచారం సాగుతోంది. మొత్తం మీద చూస్తే ఎంపీ సీటు విషయంలో తమ్మినేనికి అధినాయకత్వం ఇచ్చిన హామీ ఓకేనా అన్నది చర్చగా ఉంది. ఆయన చూపు అంతా ఆముదాలవలస మీదనే ఉంది అని అంటున్నారు. ఆ సంగతి తేల్చకుండా ఎన్ని హామీలు ఇచ్చినా రచ్చ ఆగేది లేదని కూడా అంటున్నారు. చూడాలి మరి సిక్కోలు జిల్లా వైసీపీలో వర్గ పోరు ఆగేది ఎలానో.