రాజమండ్రి సర్కారీ బడి నుంచి ఓపెన్ ఏఐ వరకు.. ఏఐ రంగాన్ని షేక్ చేసిన ముగ్గురు భారతీయుల్లో మన తెలుగు కుర్రాడు
ఒకప్పుడు రాజమండ్రి సంపత్‌నగరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (జడ్పీహెచ్ఎస్) తరగతి గదిలో పాఠాలు విన్న మొహన్ శ్రీరామకృష్ణ పెదపాటి పయనం ఎందరో గ్రామీణ విద్యార్థులకు ఆదర్శం.
సరిహద్దులు లేని డిజిటల్ ప్రపంచంలో.. అగ్రరాజ్యాల సాంకేతిక దిగ్గజాలకు సవాలు విసురుతూ ఒక తెలుగు యువకుడు ప్రపంచ దృష్టిని తనవైపు తిప్పుకున్నాడు. ప్రభుత్వ పాఠశాలలో చదివిన ఒక సాధారణ విద్యార్థి.. నేడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగాన్ని శాసిస్తున్న అంతర్జాతీయ సంస్థల భద్రతా వ్యవస్థలనే ప్రశ్నించే స్థాయికి ఎదిగాడు. ఆయనే ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సైబర్ సెక్యూరిటీ నిపుణుడు మొహన్ పెదపాటి.
ఆంత్రోపిక్ సంస్థకు చెందిన 'క్లాడ్ ఏఐ' సహాయంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దిగ్గజం ఓపెన్ ఏఐ (చాట్ జీపీటీ మాతృసంస్థ) సిస్టమ్స్‌లోని అత్యంత కీలకమైన భద్రతా లోపాలను రికార్డు స్థాయిలో ఛేదించి 'హ్యాక్ ట్రాన్ ఏఐ' బృందం టెక్ ప్రపంచంలో సరికొత్త చరిత్ర సృష్టించింది.
రాజమండ్రి నుంచి సైబర్ ప్రపంచ శిఖరాలకు...
ఒకప్పుడు రాజమండ్రి సంపత్‌నగరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (జడ్పీహెచ్ఎస్) తరగతి గదిలో పాఠాలు విన్న మొహన్ శ్రీరామకృష్ణ పెదపాటి పయనం ఎందరో గ్రామీణ విద్యార్థులకు ఆదర్శం. నూజివీడు ఆర్జీయూకేటీ (ఐఐఐటీ) లో బి.టెక్ (కంప్యూటర్ సైన్స్) పూర్తి చేసిన మోహన్.. సాంకేతికతపై ఉన్న అపారమైన అభిరుచితో సైబర్ సెక్యూరిటీ రంగాన్ని ఎంచుకున్నారు. రాజానగరం కేంద్రంగా 'ఎలక్ట్రోవోల్ట్ సెక్యూరిటీ' అనే సంస్థను స్థాపించడమే కాకుండా ప్రస్తుతం 'హ్యాక్ ట్రాన్ ఏఐ' సంస్థకు సీటీఓ, కో-ఫౌండర్‌గా వ్యవహరిస్తూ డిజిటల్ రక్షణ రంగంలో సత్తా చాటుతున్నారు.
72 గంటలు.. $3,000 ఖర్చు.. ఒక సంచలనాత్మక పరిశోధన
మొహన్ పెదపాటితో పాటు ఆయన సహచరులు హర్ష్ జైస్వాల్, రాహుల్ మైనిలతో కూడిన 'హ్యాక్ ట్రాన్ ఏఐ’ బృందం ఒక అసాధ్యమైన రికార్డును నెలకొల్పింది. ఓపెన్ ఏఐకి చెందిన కమ్యూనిటీ ఫోరమ్స్, ఉద్యోగుల ఖాతాలలో ఉన్న తీవ్రమైన భద్రతా లోపాలను ఈ బృందం గుర్తించింది. ఈ రక్షణ కవచాలను దాటడానికి వీరు మరొక శక్తివంతమైన ఏఐ మోడల్ క్లాడ్ ని ఒక డిజిటల్ అసిస్టెంట్‌గా ఉపయోగించుకున్నారు. ఎక్స్‌ప్లాయిట్ డెవలప్‌మెంట్, కోడ్ డీబగ్గింగ్, టెస్టింగ్ వంటి సాంకేతిక ప్రక్రియలను క్లాడ్ సాయంతో వేగవంతం చేశారు. కేవలం 72 గంటల వ్యవధిలో ఏఐ టోకెన్ల కోసం $3,000 కంటే తక్కువ ఖర్చుతోనే ఓపెన్ ఏఐ అంతర్గత గిట్ హబ్ ప్రైవేట్ రిపాజిటరీ వరకు యాక్సెస్ సాధించగలిగే మార్గాన్ని నిరూపించారు. సాధించిన యాక్సెస్‌ను నిరూపించే క్రమంలో ఎలాంటి సున్నితమైన సోర్స్ కోడ్‌ను దెబ్బతీయకుండా ఒక ఉద్యోగి కోడెక్స్ ఖాతా ద్వారా హానికరం కాని 'పుల్ రిక్వెస్ట్ ’ను మాత్రమే పంపి తమ నైతిక ఎథికల్ హ్యాకింగ్ చాటుకున్నారు.
ఓపెన్ ఏఐ ప్రశంసలు.. బగ్ బౌంటీ రివార్డ్
ఇది ఎవరికీ హాని కలిగించే హ్యాకింగ్ కాదు. ఓపెన్ ఏఐ నిర్వహించే 'బగ్-బౌంటీ' ప్రోగ్రామ్‌లో భాగంగా జరిగిన బాధ్యతాయుతమైన పరిశోధన. లోపాలను గుర్తించిన వెంటనే ఈ బృందం ఓపెన్ ఏఐ ప్రతినిధులను హెచ్చరించింది. దాంతో కంపెనీ తక్షణమే స్పందించి ఆ భద్రతా లోపాలను సరిదిద్ది ప్రభావిత సెషన్లను రద్దు చేసుకుంది. బృందం అందించిన అత్యుత్తమ సేవలకు గాను ఓపెన్ ఏఐ వీరికి $6,500 బగ్ బౌంటీ రివార్డును అందజేసి అభినందించింది.
విప్లవాత్మక మార్పుకు నాంది.. ఏఐ సైబర్ సెక్యూరిటీ
ఈ ఘటన కేవలం ఒక లోపాన్ని వెలికితీయడమే కాదు.. గ్లోబల్ టెక్ రంగంలో కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. ఒక ఏఐ మోడల్ క్లాడ్ సాయంతో మరొక ఏఐ దిగ్గజం ఓపెన్ ఏఐ భద్రతను పరీక్షించడం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఏఐ టూల్స్ కోడింగ్, డీబగ్గింగ్‌లో సహాయపడినప్పటికీ... సమస్యను గుర్తించడం, వ్యూహాన్ని రచించడం.. విశ్లేషణ చేయడం వంటి కీలక రంగాలు మానవ మేధస్సుకే సాధ్యమని మొహన్, ఆయన బృందం నిరూపించారు.
పరిశోధనలో పాల్గొన్న కో-ఫౌండర్ హర్ష్ జైస్వాల్, వల్నరబిలిటీ రీసెర్చర్ రాహుల్ మైనిలతో కలిసి మొహన్ పెదపాటి సాధించిన ఈ విజయం భారతీయ సాంకేతిక నైపుణ్యానికి దక్కిన గొప్ప గౌరవం. ఒక ప్రభుత్వ పాఠశాల విద్యార్థిగా ప్రయాణం ప్రారంభించి.. గ్లోబల్ ఏఐ రంగాన్నే ఆశ్చర్యపరిచిన మొహన్ పెదపాటి కథ ప్రతి ఒక్క తెలుగు యువతకు గొప్ప స్ఫూర్తిదాయకం..