'నగర' వైసీపీ డీలా పడుతోందా...?
వైసీపీ అధినేత సొంత జిల్లా కడపలోని కడప నగరంలో ఒకప్పుడు అంజాద్ బాషా రాజకీయాలు చేసేవారు. ఆయన ఫ్యామిలీపై కేసులు నమోదు కావడంతో సైలెంట్ అయ్యారు.
రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పుంజుకుంటోంది.. ఎప్పుడు ఎన్నికలు జరిగినా.. మా పార్టీదే ఘన విజయం అంటూ.. ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు. అయితే.. వాస్తవం ఏంటి? నిజంగానే పార్టీ పుంజుకుందా? అనేది కీలక అంశం. ఎన్నికలు జరిగి రెండేళ్లు దాటిపోయిన దరిమిలా.. పార్టీ పరిస్థితిని అంచనా వేసుకునే మెకానిజం ఇప్పటికీ వైసీపీలో కనిపించడం లేదు. ఇది ప్రధానంగా పార్టీని ఇబ్బందిలోకి నెడుతోంది. ఇక, ఇప్పటి వరకు ఉన్న అంచనాల ప్రకారం.. జిల్లాల స్థాయిని పక్కన పెడితే.. నగరాల్లో వైసీపీ పరిస్థితి ఇబ్బందుల్లోనే ఉంది.
థర్డ్ పార్టీ చేస్తున్న సర్వేల్లో నగరాల్లో వైసీపీ పరిస్థితి దారుణంగానే ఉందని స్పష్టమవుతోంది. ప్రతి జిల్లాకు ఒక కీలక నగరం ఉంటుంది. ఇలా చూసుకుంటే.. ఆయా నగరాల్లో ప్రతిఫలించే రాజకీయమే జిల్లా వ్యాప్తంగా ప్రభావం చూపుతుంది. పైగా కీలక నాయకులు అందరూ నగరాల్లోనే ఉంటారు. నియోజకవర్గాలు ఏవై నా కూడా నగరాల్లోనే రాజకీయాలు సాగుతాయి. కానీ, నగరాల్లోనే వైసీపీ వీక్‌గా ఉందని లెక్కలు వస్తున్నా యి. ఒకటి రెండు కాదు.. దాదాపు అన్ని నగరాల్లోనూ పార్టీ పెద్దగా యాక్టివ్ పాలిటిక్స్ చేయడం లేదు.
వైసీపీ అధినేత సొంత జిల్లా కడపలోని కడప నగరంలో ఒకప్పుడు అంజాద్ బాషా రాజకీయాలు చేసేవారు. ఆయన ఫ్యామిలీపై కేసులు నమోదు కావడంతో సైలెంట్ అయ్యారు. ఎన్టీఆర్ జిల్లాలో కీలకమైన విజయ వాడలో కూడా ఇలాంటి పరిస్థితే ఉంది. ఇక, ఉమ్మడి కృష్ణాజిల్లాలోని మచిలీపట్నంలో మాత్రమే మాజీ మంత్రి పేర్ని వాయిస్ వినిపిస్తోంది. గుంటూరు నగరంలోనూ ఒకరిద్దరు నాయకులు మాత్రమే మాట్లాడుతున్నారు. తిరుపతి, కర్నూలు, విజయనగరం, విశాఖపట్నం వంటి కీలక నగరాల్లోనూ పార్టీ సుప్తచేతనావస్థలో ఉంది.
ఒక్క రాజమండ్రిలో మాత్రం మాజీ ఎంపీ భరత్ పార్టీని జాగ్రత్తగా లీడ్ చేస్తున్నారు. ఇక, ఏలూరు వంటి కీ లక నగరంలో నాయకుల లేమి పార్టీకి ఇబ్బందిగా మారింది. అలాగే, అనంతపురంలో నాయకులు ఆత్మర క్షణంలో పడ్డారు. శ్రీకాకుళంలో వివాదాలు కొంప ముంచుతున్నాయి. నెల్లూరు నగరంలో రాజకీయాలు ఎవరికి వారివే అన్నట్టుగా కొనసాగుతున్నాయి. ఇలా.. నగరాల్లోనే పార్టీ పరిస్థితి దారుణంగా ఉంటే.. ఇతర ప్రాంతాల్లో పరిస్థితి ఏంటన్నది చూడాలి.