సీఎం ప్రజావాణికి చేరిన నందూస్ మోసాలు!
తాజాగా వీరి మోసాలపై బేగంపేటలోని జ్యోతిబాపులే ప్రజాభవన్ లో నిర్వహించే సీఎం ప్రజావాణిలో పలువురు బాధితులు ఏకరువు పెట్టారు.
నందూస్ వరల్డ్ పేరుతో యూట్యూబ్ చానల్ ఏర్పాటు చేసి.. ఫ్యామిలీ మొత్తం చేసే వీడియోలు తెలుగునాట ఎంత పాపులర్ అన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అకట్టుకునే కంటెంట్ తో పాపులార్టీ తెచ్చుకున్న రమానందన, మధుకర్ దంపతుల మోసాలకు సంబంధించి ఏపీలో కేసులు నమోదు కావటం తెలిసిందే. తాజాగా వీరి మోసాలపై బేగంపేటలోని జ్యోతిబాపులే ప్రజాభవన్ లో నిర్వహించే సీఎం ప్రజావాణిలో పలువురు బాధితులు ఏకరువు పెట్టారు.
యూకేలో ఉద్యోగం ఇప్పిస్తామని.. వీసా ఇప్పిస్తామని తమను నమ్మించిన మధుకర్ జాగర్లమూడి, రమానందన అన్నే, మోహన్ రావు జాగర్లమూడిలు తమ వద్ద పెద్ద ఎత్తున డబ్బులు తీసుకున్నట్లుగా పలువురు బాధితులు ఆరోపించారు. ప్రభుత్వం తమకు సాయం చేయాలని వినతిపత్రాన్ని అక్కడి అధికారులకు అందజేశారు. వారు చెప్పినట్లుగా తమకు ఉద్యోగం రాలేదని.. వీసాలు కూడా మంజూరు కాలేదన్నారు. తమ వద్ద తీసుకున్న డబ్బుల్ని తిరిగి ఇవ్వలేదన్నారు. యూకే ప్రభుత్వం తమ కన్సెల్టెన్సీ కంపెనీకి అనుమతులు ఇచ్చాయని వారు అబద్ధాలు చెప్పినట్లుగా వాపోయారు.
బాధితుల సమస్యలు ఉన్న తెలంగాణ ప్లానింగ్ కమిషన్ బోర్డు వైస్ ఛైర్ పర్సన్ గద్వాల విజయలక్ష్మి నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. బాధితుల తరఫున లాయర్లు కూడా ప్రజావాణికి రావటం గమనార్హం. ఇదిలా ఉండగా ఇప్పటికే ఏపీలోని ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో రమానందన దంపతుల మీద కేసులు నమోదు కావటం తెలిసిందే. ఇంతకూ వీరెలా మోసం చేశారనే దానికి కొందరు బాధితులు ఇస్తున్న సమాచారం ప్రకారం.. విద్యార్థి వీసాల మీద యూకేకు వెళ్లి.. వీసా గడువు ముగిసే వారిని లక్ష్యంగా చేసుకున్నట్లు చెబుతున్నారు. వారి నుంచి జాబ్ వీసా ఇప్పిసతామని చెప్పి ఒక్కొక్కరి నుంచి రూ.25 లక్షల నుంచి రూ.95 లక్షల వరకు వసూలు చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి.
వీరు తమ కన్సెల్టెన్సీ సంస్థకు సంబంధించి సమర్పించిన పత్రాలు నకిలీవిగా తేలటంతో బాధితులపై యూకే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకున్నట్లుగా బాధితులు చెబుతున్నారు. ఇప్పుడు వస్తున్న సందేహం ఏమంటే.. రమానందన దంపతుల బాధితులు ఎంతమంది ఉంటారనేది. పలువురు బాధితులు చెబుతున్న వివరాల ప్రకారం ఏపీతో పాటు తెలంగాణలోని పలు జిల్లాలకు చెందిన బాధితులు ఉన్నారని.. రెండుతెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ వీరి బాధితులు ఉన్నట్లుగా చెబుతున్నారు.
తాజాగా ప్రజావాణిలో పలువురు బాధితులు వీరి మోసాల గురించి అక్కడి వారికి వివరాలు ఇవ్వగా స్పందించిన వారు.. రాష్ట్ర డీజీపీతో పాటు ఈడీకి ఫిర్యాదు చేయాలని సూచన చేశారు. బాధితులకు అండగా తాము నిలుస్తామని.. ఆయా ప్రభుత్వ విభాగాలకు తమ తరఫు నుంచి సమాచారం ఇస్తామని ప్రజావాణి సభ్యులు పేర్కొన్నారు. ఇదంతా చూస్తే.. రానున్న రోజుల్లో మరింత మంది బాధితులు బయటకు వచ్చే అవకాశం ఉందంటున్నారు. మరోవైపు ఇబ్రహీంపట్నం పోలీసులు జరిపిన విచారణకు హాజరైన రమానందన.. పోలీసు అధికారులు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు ఇవ్వలేదన్న వార్తలు వస్తున్నాయి. అదే సమయంలో.. తన పిల్లలకు తల్లిగా తన అవసరం ఉందని.. తనను యూకేకు తిరిగి పంపాలని కోరటం తెలిసిందే. తాను అక్కడకు చేరుకున్న తర్వాత తన భర్తను పంపుతానని ఆమె చెప్పారు. అయితే.. వీసా మోసాల విషయంలో భార్యాభర్తలు ఇద్దరి పాత్ర ఉందంటున్నారు.