బిహార్‌లో ఘోరం: పదో తరగతి విద్యార్థినిపై మూకుమ్మడి వేధింపులు.. తీవ్రంగా స్పందించిన రాహుల్ గాంధీ

బిహార్‌లోని జముయ్ జిల్లాలో అత్యంత దారుణమైన ఘటన వెలుగు చూసింది. ట్యూషన్ ముగించుకుని ఇంటికి తిరుగుపయనమైన ఇద్దరు పదో తరగతి మైనర్ విద్యార్థులపై కొందరు రౌడీ మూకలు మూకుమ్మడి వేధింపులకు పాల్పడ్డారు.

Update: 2026-09-21 13:33 GMT

బిహార్‌లోని జముయ్ జిల్లాలో అత్యంత దారుణమైన ఘటన వెలుగు చూసింది. ట్యూషన్ ముగించుకుని ఇంటికి తిరుగుపయనమైన ఇద్దరు పదో తరగతి మైనర్ విద్యార్థులపై కొందరు రౌడీ మూకలు మూకుమ్మడి వేధింపులకు పాల్పడ్డారు. ఈ దారుణానికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర నిరసన జ్వాలలు వ్యక్తమవుతున్నాయి.

రహదారిపై రెచ్చిపోయిన రౌడీ మూకలు

పోలీసుల కథనం ప్రకారం.. సెప్టెంబర్ 19వ తేదీ సాయంత్రం సుమారు 7 గంటల సమయంలో కోచింగ్ క్లాస్ పూర్తయిన తర్వాత ఒక బాలుడు.. బాలిక ద్విచక్రవాహనంపై తిరిగి వెళ్తుండగా కొందరు వ్యక్తులు వారిని అడ్డుకున్నారు. బాలుడిని పక్కకు లాగి దారుణంగా కొట్టిన ఆ మూక.. బాలికను చుట్టుముట్టి అసభ్యంగా ప్రవర్తించింది. ముఖానికి ముసుగు ధరించిన ఒక వ్యక్తి బాలికను బలవంతంగా ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించడం వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఆ బాలిక భయంతో కేకలు వేస్తూ.. తమను విడిచిపెట్టాలని ఎంతగా వేడుకున్నా ఆ ఆకతాయిలు వదలకుండా వేధించారు.

రంగంలోకి దిగిన పోలీసులు.. 'పోక్సో' నమోదు

సోమవారం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం కావడంతో జముయ్ జిల్లా పోలీసులు తక్షణమే స్పందించారు. జముయ్ ఎస్పీ విశ్వజీత్ దయాల్ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేశారు. వీడియో ఆధారంగా బాధితులను గుర్తించి వారి నుంచి వాంగ్మూలం సేకరించిన అనంతరం.. నిందితులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

బాధితులు మైనర్లు కావడంతో నిందితులపై 'పిల్లలపై లైంగిక నేరాల నిరోధక చట్టం' (పోక్సో) లోని సెక్షన్ 8 (లైంగిక దాడి), సెక్షన్ 12 (లైంగిక వేధింపులు) సహా భారతీయ న్యాయ సంహితలోని పలు తీవ్రమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇప్పటివరకు ఈ ఘటనకు సంబంధించి ముగ్గురిని అరెస్టు చేసినట్లు మిగిలిన నిందితులను గుర్తించేందుకు దర్యాప్తు వేగవంతం చేసినట్లు అధికారులు వెల్లడించారు.

రాజకీయంగా కలకలం.. రాహుల్ గాంధీ డిమాండ్

ఈ ఘటనపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా రహదారిపై సాయంత్రం వేళల్లో కూడా ఒక మైనర్ బాలికకు భద్రత లేకపోవడంపై బిహార్ ప్రభుత్వాన్ని ఆయన నిలదీశారు. బాధ్యులందరిపై పోక్సో చట్టం కింద కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు బిహార్ ప్రభుత్వ వర్గాలు కూడా ఈ ఘటనను తీవ్రంగా ఖండించాయి. మంత్రి సునీల్ కుమార్ మాట్లాడుతూ.. బాధ్యులపై కఠిన చర్యలు తప్పవని హామీ ఇచ్చారు. అయితే ఒక్క ఘటనను చూపి రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని అనడం సరికాదని వ్యాఖ్యానించారు.

బాధితుల గోప్యతపై హెచ్చరికలు

మైనర్ బాధితుల గోప్యత, గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని మహిళా సంఘాలు, అధికారులు స్పష్టం చేశారు. ఈ అభ్యంతరకరమైన వీడియోను సోషల్ మీడియాలో మరింతగా షేర్ చేయవద్దని ప్రజలకు, నెటిజన్లకు పోలీసులు విజ్ఞప్తి చేశారు. కేసు దర్యాప్తును వేగవంతం చేసి.. నిందితులందరికీ చట్టప్రకారం కఠిన శిక్ష పడేలా చూస్తామని జముయ్ పోలీసులు హామీ ఇచ్చారు.

Tags:    

Similar News