అఫిడవిట్‌లో యాక్టివా.. రోల్స్ రాయిస్‌లో షికారు! అసలు ఈ యువ లేడి ఎమ్మెల్యే కథేంటంటే?

సంగతి ఏంటంటే.. 2025 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అలీనగర్ నుంచి బీజేపీ తరఫున గెలిచిన ఈ చిన్నమ్మ.. ఎన్నికల అఫిడవిట్‌లో తన మొత్తం ఆస్తుల విలువ కేవలం రూ. 3.82 కోట్లు అని రాసుకొచ్చారు.

Update: 2026-09-21 08:33 GMT

మన దేశంలో రాజకీయ నాయకుల అఫిడవిట్లు.. వారి రియల్ లైఫ్ లగ్జరీలు ఎప్పుడూ ఒక మిస్టరీనే.. ఎన్నికల సమయంలో కమిషన్‌కు ఇచ్చే కాగితాల్లో "మాకేమీ లేదండీ.. ఓ పాత సైకిలు, నాలుగ్గాజులు తప్ప" అన్నట్లు సీన్ క్రియేట్ చేయడం.. గెలిచాక కళ్లు బైర్లు కమ్మే లగ్జరీ కార్లలో ఊరేగడం మన ప్రజాప్రతినిధులకు కొత్తేమీ కాదు. ఇప్పుడు ఇదే కోవలో బిహార్‌కు చెందిన యంగ్ ఎమ్మెల్యే, ప్రముఖ గాయని మైథిలీ ఠాకూర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు.

సంగతి ఏంటంటే.. 2025 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో అలీనగర్ నుంచి బీజేపీ తరఫున గెలిచిన ఈ చిన్నమ్మ.. ఎన్నికల అఫిడవిట్‌లో తన మొత్తం ఆస్తుల విలువ కేవలం రూ. 3.82 కోట్లు అని రాసుకొచ్చారు. అందులోనూ రూ. 53 లక్షల బంగారం, ద్వారకలో ఓ ఫ్లాట్.. ఓ యాక్టివా స్కూటర్ తప్ప పెద్దగా లగ్జరీలేవీ లేవని వినయంగా చెప్పుకొచ్చారు. అంతవరకు బాగానే ఉంది కానీ.. రీసెంట్‌గా ముంబై లాల్‌బాగ్చా రాజా దర్శనానికి ఈమె గారు దిగిన రేంజ్ చూసి నెటిజన్లు నోరెళ్లబెట్టారు..

ఏకంగా రూ. 13 కోట్ల విలువ చేసే నిగనిగలాడే బ్లూ కలర్ 'రోల్స్ రాయిస్ కల్లినన్' కారులోంచి ఈ యంగ్ ఎమ్మెల్యే కిందకు దిగడంతో రచ్చ మొదలైంది. "అఫిడవిట్‌లో ఏమో యాక్టివా చూపించారు.. బయటేమో రోల్స్ రాయిస్‌లో షికార్లు కొడుతున్నారు.. ఏంటీ లీలలు?" అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ వర్షం కురుస్తోంది.

అయితే ఈ వ్యవహారంపై మైథిలీ అభిమానులు, బీజేపీ వర్గాలు మరోలా కామెంట్ చేస్తున్నాయి. రాజకీయాల్లోకి రాకముందే ఆమె పాపులర్ సింగర్ అని, యూట్యూబ్, బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల ద్వారా బాగానే సంపాదిస్తారని సపోర్ట్ చేస్తున్నారు. దానికి తోడు ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ కూడా ఎంట్రీ ఇచ్చి "రాజకీయ నాయకులు లగ్జరీ కార్లలో తిరిగితే తప్పేంటి?" అంటూ మైథిలీకి సపోర్ట్‌గా నిలిచారు.

ఇంతకీ ఆ రూ. 13 కోట్ల కారు ఆమె సొంతమా? లేక గణేష్ దర్శనం కోసం ఎవరైనా ఫ్రీగా ఆఫర్ చేసిన రైడా? లేదా అద్దెకు తెచ్చుకున్న కారా? అనేది మాత్రం ఇంకా సస్పెంసే.. ఏది ఏమైనా అఫిడవిట్ లోని అంకెలకీ, బయట కనిపించే హంగులకీ మధ్య ఉన్న ఈ 'రోల్స్ రాయిస్' అంతరం మాత్రం ప్రస్తుతం నెటిజన్లకు మంచి వినోదాన్ని అందిస్తోంది..

Tags:    

Similar News