కృష్ణలంక పోలీసుస్టేషన్ కి వైసీపీ కీలక నేతలు.. బెజవాడలో హైటెన్షన్!

డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాలపై ఆందోళన చేసిన వైసీపీ నేతలను విజయవాడ పోలీసులు అరెస్టు చేశారు.

Update: 2026-09-21 09:50 GMT

డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాలపై ఆందోళన చేసిన వైసీపీ నేతలను విజయవాడ పోలీసులు అరెస్టు చేశారు. మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, పార్టీ నేతలు పేర్ని కిట్టూ, అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ తోపాటు పలువురు నాయకులను కృష్ణలంక పోలీసుస్టేషన్ కి తరలించారు. అయితే పోలీసులు తమను అక్రమంగా నిర్బంధించారని ఆరోపిస్తూ వైసీపీ నేతలు పోలీసుస్టేషన్ ఆవరణలో నేలపైనే బైఠాయించారు. శాప్ కార్యాలయం ఎదుట అనుమతి లేకుండా ధర్నా చేశారన్న ఆరోపణలతోపాటు స్పోర్ట్సు కోటాలో ఉద్యోగాలు పొందిన ఉపాధ్యాయులపై దాడి చేశారనే అభియోగాలతో వైసీపీ నేతలను అరెస్టు చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది.

వైసీపీ ఆందోళనతో విజయవాడలో తీవ్ర ఉద్రికత్తలు నెలకొన్నాయి. ఉదయం పది గంటల నుంచి దాదాపు రెండు గంటల పాటు విజయవాడ ప్రధాన రహదారిలో వైసీపీ కార్యకర్తలు వర్సెస్ ఉపాధ్యాయులు తలపడటంతో ఏం జరుగుతుందోనన్న టెన్షన్ కనిపించింది. ప్రధాన రహదారికి అనుకుని ఉన్న ఇందిరా గాంధీ స్టేడియంలో శాప్ కార్యాలయం ఉండగా, శాప్ ఎండీని కలిసేందుకు ఉపాధ్యాయులు వచ్చారు. అదే సమయంలో వైసీపీ నేతల ఆధ్వర్యంలో వందల మంది కార్యకర్తలు ధర్నా చేయడంతో అక్కడ యుద్ధ వాతావరణం కనిపించింది. దీంతో పోలీసులు వైసీపీ కార్యకర్తలను చెదరగొట్టి పలువురు నేతలను అరెస్టు చేశారు.

లబ్బీపేటకు సమీపంలో ఉన్న కృష్ణలంక పోలీసుస్టేషన్ కు వైసీపీ కీలక నేతలు జక్కంపూడి రాజా, పేర్ని కిట్టు, నాగార్జున యాదవ్ తోపాటు మరో పదిహేను మంది నాయకులను తరలించారు. అయితే వీరిపై సాధారణ కేసులు నమోదు చేసి వదిలేస్తారా? లేక పోలీసు విధి నిర్వహణను అడ్డుకున్నారనే కారణంగా రిమాండుకు తరలిస్తారా? అనే విషయం మాత్రం క్లారిటీ కనిపించడం లేదని అంటున్నారు. సాధారణంగా ధర్నా కార్యక్రమాలలో అరెస్టు చేసిన నేతలు, కార్యకర్తలను పోలీసుస్టేషన్ కు తరలించి కొద్దిసేపటి తర్వాత విడిచిపెడతారు. అయితే శాప్ కార్యాలయం ఎదుట కాస్త ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో పోలీసు చర్యలు ఎలా ఉంటాయనేది చూడాల్సివుందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

ఇక విజయవాడలో శాప్ కార్యాలయం ఎదుట వైసీపీ ధర్నాను అడ్డుకునేందుకు పోలీసులు విశ్వప్రయత్నం చేశారని చెబుతున్నారు. ధర్నాకు అనుమతి లేదని ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన నాయకులు అందరికీ నోటీసులు జారీ చేశారు. ధర్నాలో పాల్గొనేందుకు గుంటూరు నుంచి వస్తున్న మాజీ మంత్రి అంబటిని మార్గమధ్యలోనే అడ్డుకున్నారు. అదేవిధంగా సీనియర్ నేత పేర్ని నానిని కూడా మచిలీపట్నంలో గృహ నిర్బంధంలో ఉంచినట్లు చెబుతున్నారు. పోలీసులు తీవ్ర నిర్బంధం విధించినప్పటికీ వారి నుంచి తప్పించుకుని జోగి రమేష్, దేవినేని అవినాశ్, జక్కంపూడి రాజా వంటివారు లబ్బీపేటలోని శాప్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. వారికి మద్దతుగా వందల సంఖ్యలో వైసీపీ కార్యకర్తలు తరలిరావడంతో పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో కాస్త తోపులాట జరగడంతో పోలీసులు స్వల్పంగా లాఠీచార్జి చేశారని అంటున్నారు.



Tags:    

Similar News