విజయవాడలో హైటెన్షన్.. టీచర్లు Vs వైసీపీ నేతలు!

డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు జరిగాయంటూ విపక్ష వైసీపీ చేపట్టిన ధర్నా తీవ్ర ఉద్రికత్తలకు దారితీసింది.

Update: 2026-09-21 08:35 GMT

డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు జరిగాయంటూ విపక్ష వైసీపీ చేపట్టిన ధర్నా తీవ్ర ఉద్రికత్తలకు దారితీసింది. విజయవాడలో శాప్ కార్యాలయం ఎదుట వైసీపీ ధర్నా చేసేందుకు ప్రయత్నించగా, పోలీసులు అనుమతి నిరాకరించారు. అయినప్పటికీ పోలీసు ఆంక్షలను ఛేదించుకుని వైసీపీ నేతలు మాజీ మంత్రి జోగి రమేష్, దేవినేని అవినాశ్, గౌతంరెడ్డి తదితరులతో వందలమంది కార్యకర్తలు నగరంలోని లబ్బీపేటలో ఉన్న ఇందిరా గాంధీ స్టేడియంకు చేరుకున్నారు. అక్కడ శాప్ కార్యాలయం ఎదుట ధర్నాకు ప్రయత్నించారు. అయితే అప్పటికే డీఎస్సీ స్టోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు పొందిన ఉపాధ్యాయులు శాప్ కార్యాలయంలో ఉండటంతో వైసీపీ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఇటు వైసీపీ కార్యకర్తలు, అటు స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు పొందిన ఉపాధ్యాయులు పోటాపోటీగా నినాదాలు చేసుకోవడంతో ఉద్రికత్తకు దారితీసింది.

వైసీపీ నిరసనలకు పోటీగా స్పోర్ట్స్ కోటా ఉపాధ్యాయులు ఆందోళన నిర్వహించడంతో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఆదివారం విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించిన ఉపాధ్యాయులు సోమవారం శాప్ కార్యాలయంలో క్రీడా మంత్రి రామప్రసాద్, ఎండీ భరణిని కలవాలని నిర్ణయించారు. ముందుగా అనుకున్న ప్రకారం ఉదయం పది గంటలకే ఉపాధ్యాయులు స్టేడియంలోకి ప్రవేశించారు. అయితే అదే సమయంలో వైసీపీ కూడా ధర్నాకు పిలుపునిచ్చింది. దీనికి అనుమతి లేదని పోలీసులు చెప్పినప్పటికీ, వైసీపీ కార్యకర్తలు వినిపించుకోలేదు. దీంతో స్టేడియం లోపల ఉపాధ్యాయులు, వెలుపల వైసీపీ శ్రేణులు మొహరించడంతో హైటెన్షన్ నెలకొంది.

ఇక తాము నిజమైన క్రీడాకారులమని, వైసీపీ దుష్ప్రచారం చేస్తుందంటూ టీచర్లు నినాదాలు చేయడం, వారికి అన్యాయంగా ఉద్యోగాలు వచ్చాయంటూ వైసీపీ కార్యకర్తలు కూడా నినాదాలతో హోరెత్తించడంతో ఏం జరుగుతుందోనన్న టెన్షన్ పెరిగిపోయింది. ఇదే సమయంలో కొందరు కార్యకర్తలకు నోటికి పనిచెప్పడంతోపాటు వైసీపీ నేత దేవినేని అవినాశ్ తోపాటు ధర్నాకు వస్తున్న కార్యకర్తలు కొందరు అట్టపెట్టెలు పట్టుకుని వచ్చిన వీడియోలను టీడీపీ సోషల్ మీడియా బయటపెట్టింది. ఆ ఆట్టపెట్టెల్లో ఉపాధ్యాయులపై దాడి చేయడానికి రాళ్లు, కోడిగుడ్లు తీసుకువచ్చారని ఆరోపించింది. మరోవైపు వైసీపికి మద్దతుగా వచ్చిన కొందరు మహిళలు బూతులు తిడుతూ రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని ఆరోపిస్తూ కొన్ని వీడియోలను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తోంది.

మొత్తానికి ఉపాధ్యాయులు, వైసీపీ కార్యకర్తల పోటాపోటీ ఆందోళనలతో విజయవాడ ఎంజీ రోడ్ లో యుద్ధ వాతావరణం కనిపించింది. వైసీపీ శ్రేణుల నుంచి ఉపాధ్యాయులను కాపాడేందుకు పోలీసులు శాప్ కార్యాలయం గేటుకు తాళం వేశారు. కొందరు కార్యకర్తలు గేటుదూకే ప్రయత్నం చేయగా, పోలీసులు లాఠీలకు పనిచెప్పారని స్థానికులు చెబుతున్నారు. ఇదే సమయంలో ఉపాధ్యాయులపైకి కొందరు కార్యకర్తలు దూసుకుపోవడంతో ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. ఓ ఉపాధ్యాయుడు కిందపడగా, తలకు బలమైన గాయమైందని చెబుతున్నారు. క్షతగాత్రుడిని పోలీసులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. మరోవైపు ప్రభుత్వమే వైసీపీ కార్యకర్తలపై లాఠీ చార్జి చేయించిందని వైసీపీ ఆరోపణలు చేసింది.



Tags:    

Similar News