బీజేపీతో దూరంగానే డీఎంకే.. తృతీయ ఫ్రెంట్ ఆలోచనలో స్టాలిన్
కేంద్రంలో తృతీయ ఫ్రంట్ ఏర్పాటు దిశగా తమిళనాడుకు చెందిన డీఎంకే పార్టీ ప్రయత్నాలు చేస్తుండటం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది.
కేంద్రంలో తృతీయ ఫ్రంట్ ఏర్పాటు దిశగా తమిళనాడుకు చెందిన డీఎంకే పార్టీ ప్రయత్నాలు చేస్తుండటం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. విపక్షం ఇండి కూటమిలో కీలకంగా పనిచేసిన డీఎంకే పార్టీ కేంద్రంలో ప్రత్యామ్నాయ రాజకీయ వేదికకు నాయకత్వం వహించాలని ఉవ్విళ్లూరుతున్నట్లు చెబుతున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఇండి కూటమికి నాయకత్వం వహిస్తున్న కాంగ్రెస్ పార్టీతో డీఎంకేకు విభేదాలు తలెత్తాయి. దీంతో ఇండి కూటమి నుంచి బయటకు వచ్చిన డీఎంకే కేంద్రంలో బీజేపీతో చేతులు కలపాలని ముందుగా భావించిందని అంటున్నారు. అయితే బీజేపీతో సిద్ధాంతపరంగా ఇమడలేమన్న ఆలోచనతో డీఎంకే ప్రత్యామ్నాయ ఆలోచనలు చేస్తోందని అంటున్నారు.
నిజానికి తమిళనాడు ఎన్నికల అనంతరం డీఎంకే పార్టీని ఎన్డీఏలో కలుపుకునేందుకు బీజేపీ అగ్రనేతలు చాలా ప్రయత్నాలు చేశారని చెబుతున్నారు. ఎన్డీఏ కూటమిలో డీఎంకే చేరితే మరింత బలపడవచ్చనే ఆలోచనతోపాటు పెండింగులో ఉన్న మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్ బిల్లులను గట్టెక్కించవచ్చని బీజేపీ నేతలు భావించారని అంటున్నారు. దీంతో ఎన్డీఏలో చేరాలని డీఎంకేపై ఒత్తిడి చేసినట్లు ప్రచారం జరిగింది. అంతేకాకుండా డీఎంకేకు కేంద్రంలో మంత్రి పదవులు ఇస్తామని ఆఫర్ చేసినట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. దాదాపు 22 మంది లోక్ సభ సభ్యులు, 8 మంది రాజ్యసభ సభ్యులు ఉండటం వల్ల డీఎంకే పార్టీ ఎన్డీఏకి అదనపు బలం అవుతుందని భావించారు. అయితే బీజేపీ సిద్ధాంతంతో డీఎంకే భావజాలానికి వైరుధ్యం ఉందనే ఆలోచనతో కేంద్ర పెద్దల ఒత్తడి చేస్తున్నా డీఎంకే ఓకే చేయడం లేదని అంటున్నారు.
తమిళనాడు ఎన్నికలు జరిగి నాలుగు నెలలు గడుస్తోంది. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం రెండున్నరేళ్ల పాలన పూర్తి చేసుకుంటోంది. దీంతో కేంద్ర మంత్రివర్గ విస్తరణ చేయాలని ప్రధాని మోదీ భావిస్తున్నారని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే జాతీయస్థాయిలో చోటు చేసుకుంటున్న రాజకీయ పరిణామాలతో మంత్రివర్గ విస్తరణను ఎప్పటికప్పుడు వాయిదా వేసుకుంటున్నారని అంటున్నారు. ముఖ్యంగా కేంద్రంలో 2/3 వంతు మెజార్టీపై దృష్టి పెట్టిన కేంద్ర పెద్దలు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలతోపాటు డీఎంకేను ఎన్డీఏలోకి చేర్చుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. తృణమూల్ ఎంపీలు బీజేపీతో చెట్టాపట్టాలు వేయడానికి సిద్ధమైనా తమిళనాడులో ఉన్న ప్రత్యేక రాజకీయ పరిస్థితులతో డీఎంకే సాహసం చేయలేకపోతోందని అంటున్నారు.
ఈ నేపథ్యంలో కేంద్రంలో తృతీయ ఫ్రంట్ ఏర్పాటు చేయాలని డీఎంకే హైకమాండ్ నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. బీజేపీ భావజాలానికి వ్యతిరేకంగా పోరాడుతున్న పార్టీలను ఏకతాటిపైకి తీసుకువచ్చి తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ నేతృత్వంలో థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు చేసేలా ఆ పార్టీ పావులు కదుపుతోందని అంటున్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ నాయకత్వంపై నమ్మకం లేని ఇండి కూటమిలోని పార్టీలతోనూ సంప్రదింపులు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగా ఇప్పటికే బెంగాల్ మాజీ సీఎం మమతా బెనర్జీతో డీఎంకే సీనియర్ నేత కనిమొళి భేటీ అయ్యారని చెబుతున్నారు. మరోవైపు బీఆర్ఎస్ వంటి తటస్థ పార్టీలతోనూ డీఎంకే నేతలు టచ్ లోకి వచ్చారని అంటున్నారు.
కేంద్రంలో అధికార ఎన్డీఏ, ప్రతిపక్ష ఇండి కూటమి మధ్యే రాజకీయం నడుస్తోంది. అయితే ఈ రెండు కూటములలో చేరకుండా బీఆర్ఎస్, వైసీపీ వంటి పార్టీలు తటస్థంగా ఉండిపోయాయి. వైసీపీ అంశాలు వారీగా బీజేపీకి మద్దతు ఇస్తుంటే, బీఆర్ఎస్ మాత్రం బీజేపీ దరిదాపుల్లోకి కూడా వెళ్లడం లేదు. దీంతో బీఆర్ఎస్ వంటి పార్టీలను కలుపుకుని తృతీయ ఫ్రంట్ ఏర్పాటు చేయాలని డీఎంకే హైకమండ్ ఆలోచనలు చేస్తోందని అంటున్నారు. మొత్తానికి ఈ పరిణామాలు జాతీయ రాజకీయాల్లో అనూహ్య మలుపులు తిప్పే అవకాశం ఉందని వ్యాఖ్యానిస్తున్నారు. ఇక తమిళనాడులో ప్రస్తుతం మూడు పార్టీల మధ్య రాజకీయం నడుస్తుండగా, అధికార టీవీకే ప్రస్తుతం ఇండి కూటమికి చేరువ అవుతున్నట్లు కనిపిస్తోందని అంటున్నారు అదే సమయంలో విపక్షంలోని అన్నాడీఎంకే ఎన్డీఏ కూటమిలో కొనసాగుతోంది. ఈ పరిస్థితులు కూడా డీఎంకే ఆధ్వర్యంలో మూడో ఫ్రంట్ ఏర్పాటుకు కారణమవుతున్నాయని అంటున్నారు.