ఏపీ ఎన్నికల్లో ఒక విషాదం.. మరిన్ని చిత్ర విచిత్రాలు!
| ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల వేళ పలు జిల్లాల్లో ఘర్షణలు, వింత ఘటనలు చోటుచేసుకున్నాయి. కడపలో బయటి వ్యక్తులపై గ్రామస్థులు దాడి చేయగా, నెల్లూరులో పోలింగ్ సిబ్బంది ఫోన్లు చోరీకి గురయ్యాయి. వట్టిచెరుకూరులో ఓటు వేసిన బ్యాలెట్ ఫొటో వైరల్‌గా మారింది. ఇదిలా ఉండగా, అనంతపురం జిల్లా కూడేరులో విధుల్లో ఉన్న ఉపాధ్యాయురాలు గుండెపోటుతో మృతి చెందడం విషాదాన్ని నింపింది.
ఏపీలో జరుగుతున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఒక తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఇదే సమయంలో పలు జిల్లాల్లో చిత్ర విచిత్ర ఘటనలు చోటు చేసుకున్నాయి. వైసీపీ వర్సెస్ టీడీపీ నాయకుల మధ్య గొడవలు, ఘర్షణలు ఎలా ఉన్నా.. మరికొన్ని సంగతులు ఆశ్చర్యకరంగా ఉండడం గమనార్హం. మరి అవేంటో చూసేద్దాం..
1) కడప జిల్లా నందలూరులోని ఎన్నికల వేళ.. ఊరికి సంబంధం లేని బయటి వ్యక్తులు రావడంతో గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిపై దాడి చేసి కారు అద్దాలు ధ్వంసం చేశారు. వాహనంలోని వ్యక్తుల కళ్లలో మహిళలు కారం కొట్టారు. నిజానికి ప్రజలే తిరగబడడం అనేది ఆశ్చర్యమేకదా!. ఇక, వచ్చిన వారు ఎవరు..? ఏ పార్టీ తరఫున వచ్చారన్నది తేల్చాల్సి ఉంది.
2) కడప జిల్లాలోని గోపవరం మండలం రామాపురంలో జరుగుతున్న పోలింగ్ ప్రక్రియలోనూ బయటి వ్యక్తులు వచ్చి దొంగ ఓట్లు వేశారనే ఆరోపణలు వచ్చాయి. దీంతో గ్రామస్తులు ఏకమయ్యారు. సదరు యువకులను గ్రామస్థులు చితకబాదారు. అంతేకాదు.. కొందరిని చొక్కాలు విప్పి నిలబెట్టి.. ఫొటోలు తీసి.. పోలీసులకు అప్పగించారు. ఈ చైతన్యం గతంలో ఎప్పుడూ లేదు.
3) ఇక, నెల్లూరు జిల్లాలోని ఓ పోలింగ్ కేంద్రంలో దొంగలు పడ్డారు. వీరు ఓటు దొంగలు కాదు. మొబైల్ ఫోన్లు ఎత్తు కెళ్లే ముఠా అంట. ఇంకేముంది.. ఓటరు కార్డుతో వచ్చిన దొంగలు.. పోలింగ్ సిబ్బంది బిజీగా ఉన్నారని చూసుకుని.. 4 ఫోన్లు ఎత్తుకు పోయారు. సిబ్బంది లబో దిబో మంటున్నారు.
4) వట్టిచెరుకూరు మండలంలో ఓ వ్యక్తి తాను వేసిన ఓట్లను ఫొటో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఎన్నికల నిబంధనల ప్రకారం పోలింగ్ కేంద్రంలోకి మొబైల్ ఫోన్ అనుమతి లేదు. కానీ.. ఎన్నికల అధికారులు, సిబ్బంది కళ్లు గప్పి.. సదరు వ్యక్తి ఫోన్‌లో తీసిన బ్యాలెట్ పత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాను వైసీపీకి ఓటేశానని.. అందరూ తననే అనుసరించాలని ఆయన కోరారు. పోలీసులు గాలిస్తున్నారు.
5) నెల్లూరు జిల్లాలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పోలింగ్ బూత్ ముందే బైఠాయించి నిరసన తెలిపారు. ఓ పోలింగ్ బూత్‌లో వైసీపీ నాయకులు చొరబడ్డారని.. వారిని బయటకు పంపాలని ఆయన డిమాండ్ చేశారు. అయితే.. అప్పటికే టీడీపీ నాయకులు పోలింగ్ బూత్‌ను ఆక్రమించుకున్నారని.. వారి సంగతేంటో చెప్పాలని వైసీపీ మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి కూడా వచ్చి.. ఆయన పక్కనే కూర్చున్నారు. ఇంకేముంది.. టెన్షన్, టెన్షన్. ఇద్దరినీ పోలీసుల పంపించేశారు.
విషాదం..
అనంతపురం జిల్లాలోని కూడేరు ఎన్నికల కేంద్రంలో విధుల్లో ఉన్న ఓ అధికారి( టీచర్.. ) గుండె పోటుతో మృతి చెందారు. విధుల కు వచ్చిన ఆమె ఉదయం రెండు మూడు గంటల పాటు బాగానే ఉన్నా.. ఆ తర్వాత ఒక్కసారిగా కూర్చున్న చోటే కుప్పకూలారు. సీపీఆర్ చేసినా ఫలితం దక్కలేదు. ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందారు.