'దేశ ద్రోహం': మోడీ రేపిన 'రాహుల్ మంటలు'!
| ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ మధ్య 'దేశద్రోహి' వ్యాఖ్యలతో రాజకీయ వివాదం ముదురుతోంది. విదేశీ శక్తులతో చేతులు కలిపి దేశద్రోహానికి పాల్పడుతున్నారంటూ గత నెల 31న మోదీ రాహుల్‌పై విమర్శలు చేశారు. దీనికి స్పందించిన రాహుల్.. మోదీనే దేశద్రోహి అని నిరూపిస్తానని, ఐదు నిమిషాలు చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఈ వివాదం జాతీయ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
`దేశద్రోహి`- ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తున్న ఏకైక పదం. `ఎవరు దేశ ద్రోహి.`` అంటూ.. కాంగ్రెస్ చేస్తున్న వ్యాఖ్యలు.. బీజేపీలో వణుకు పుట్టిస్తున్నాయని జాతీయ మీడియా చెబుతోంది. ``ప్రధాని మోడీనే దేశద్రోహి. ఈ విషయాన్ని ఐదు నిమిషాల్లో నిరూపిస్తా. ఆయనను చర్చకు రమ్మనండి`` అంటూ.. కాంగ్రెస్ అగ్రనేత.. రాహుల్ గాంధీ గత మూడు రోజులుగా ఊరూ వాడా పిలుపునిస్తున్నారు. ఎక్కడ మీటింగ్ పెట్టినా.. ఇదే వ్యాఖ్యలు చేస్తున్నారు. దీనికి కౌంటర్ ఇవ్వలేక బీజేపీ అగ్రనాయత్వం సతమతం అవుతోంది.
బీజం ఎక్కడ పడింది?
`దేశ ద్రోహం.. దేశ ద్రోహి` వ్యాఖ్యలకు మూలం.. ప్రధాని నరేంద్ర మోడీ గత నెల 31న గుజరాత్లో నిర్వహించిన కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలే!. ఆ రోజు మాజీ ఉప ప్రధాని ఉక్కు మనిషి సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని గుజరాత్లో నిర్వహించిన ఏక్తాదివస్ కార్యక్రమంలో మోడీ మాట్లాడారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీని నేరుగా కార్నర్ చేశారు. ``విదేశీ శక్తులతో చేతులు కలిపి దేశద్రోహానికి పాల్పడుతున్నారు.`` అంటూ రాహుల్ పేరును పేర్కొన్నారు. ఇక అక్కడి నుంచి మంటలు రాజుకున్నాయి.
ఎవరు దేశ ద్రోహి.. అంటూ రాహుల్‌గాంధీ ఆవెంటనే స్పందించారు. విదేశీ శక్తులకు అమ్ముడు పోయింది ఎవరో నిరూపిస్తామని.. చర్చకు రావాలని నేరుగా ప్రధానినే ఆయన టార్గెట్ చేశారు. ``రండి.. చర్చిద్దాం. ఎవరు దేశానికి ద్రోహం చేస్తున్నారో.. చెప్పడానికి నా వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయి. మీరు నన్ను అంటున్నారు కదా.. వాటిలో ఒక్క ఆధారం అయినా బయట పెట్టండి`` అంటూ రాహుల్ నిలదీశారు. దీనిపై బీజేపీ నుంచి ఎలాంటి కౌంటర్లు రావడం లేదు.
దీంతో రాహుల్ మరింతగా ప్రధానిని కార్నర్ చేస్తూ.. తాజాగా పంజాబ్‌లో నిర్వహించిన పార్టీ కార్యక్రమంలోనూ ప్రధాని సెంట్రిక్‌గానే కామెంట్లు కుమ్మరించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంపుతో చేతులు కలిపి దేశానికి ద్రోహం ఎవరు చేశారో.. చెబుతానన్నారు. ఐదు నిమిషాలు చర్చకు రావాలని.. మీరు -నేను మాత్రమే చర్చల్లో పాల్గొందామని.. కావాలంటే.. భారీ భద్రతను ఏర్పాటు చేసుకోవాలని ఆయన ఆఫర్ ఇచ్చారు. దేశానికి అన్ని విధాలా ద్రోహం చేస్తూ.. ఎదురు దాడి చేస్తున్నారని దుయ్యబట్టారు.
కాగా.. ఈ వ్యవహారంపై బీజేపీ నుంచి ఎలాంటి ఆన్సర్ లేక పోవడం గమనార్హం. అంతేకాదు.. తాను చేసిన వ్యాఖ్యలపై ప్రధాని సైలెంట్ అయిపోగా.. రాహుల్ మాత్రం వాటిని కొనసాగిస్తున్నారు. మరి ఈ వివాదం ఎటు దారితీస్తుందో చూడాలి. మరో రెండు మాసాల్లో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈ వ్యవహారం తమకు కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు.