కూటమి పద్మవ్యూహంలో వైసీపీ విలవిల !
| ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని వైసీపీ అధినేత జగన్ ఆరోపించారు. ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని, వైసీపీ నేతలను పోటీకి, పోలింగ్, కౌంటింగ్‌కు దూరం చేస్తున్నారని విమర్శించారు. అయితే మీడియా ముందు విమర్శలు చేయడం కంటే ప్రజా పోరాటాల బాట పట్టాలని, వామపక్షాలు, ఇతర విపక్షాలను కలుపుకుని ఉద్యమాలు చేపట్టాలని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
రాజకీయం అంటే ఇలాగే ఉంటుంది. అందులో వ్యూహాలే ఉంటాయి. ఎత్తులు పై ఎత్తులే ఉంటాయి. వాటిని ఛేదించి ముందుకు సాగాలి. అంతే తప్ప అక్రమం అని అన్యాయం అని రోదిస్తే ఒనగూడేదేంటి అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇదంతా కూటమి మీద చంద్రబాబు మీద వైసీపీ అధినేత జగన్ హాట్ కామెంట్స్ చేస్తున్న నేపథ్యంలో జనాంతికంగా అనిపిస్తున్న మాట. ఇక చూస్తే ఏపీలో అరాచకం సాగుతోంది అని సౌత్ లో మరో బీహార్ అని జగన్ తాజాగా ఆరోపించారు. ఏపీలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిపోయిందని ఎన్నికల వ్యవస్థనే మొత్తం కబ్జా చేశారు అని జగన్ విమర్శించారు. ఏపీలో కూటమి స్థానిక ఎన్నికలను జరిపించడం లేదని అది ఎలక్షన్ కాదు సెలక్షన్ అని కూడా జగన్ ఆగ్రహించారు. ఇలా ఆయన మున్సిపల్ ఎన్నికల గురించి అలాగే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల గురించి కూడా మీడియా ముందు ఎన్నో విషయాలు చెప్పారు. వైసీపీ వారిని పోటీ చేయనీయడం లేదని అలాగే వారికి పోలింగ్ లో కౌంటింగ్ లో ఎక్కడా చాన్స్ ఇవ్వడం లేదని మండిపడ్డారు. మొత్తం స్థానిక సంస్థల ఎన్నికలు అన్నీ అక్రమాలే అంటూ జగన్ గట్టిగానే మాట్లాడారు. ఒక విధంగా చెప్పాలీ అంటే గొంతు చించుకున్నారు.
న్యాయ పోరాటం కూడా :
ఇక వైసీపీ నేతలు అయితే ఏపీలో హైకోర్టు తలుపు తట్టారు, సుప్రీం కోర్టుకు వెళ్లారు, న్యాయ పోరాటాలు కూడా పూర్తి అయ్యాయి. మీడియా ముందు ఎన్ని సార్లు విమర్శలు చేసినా ఫలితం ఏమిటి అన్న చర్చ సాగుతోంది. వైసీపీ ఒక్క గొంతు మాత్రమే ఎక్కడ చూసినా వినిపిస్తోంది అని అంటున్నారు. ఏపీలో అరాచకం అని వైసీపీ మాత్రమే అంటోంది అని కూడా ఎత్తి చూపిస్తున్నారు. ఇక ఏపీలో ఈ నెల 7న పరిషత్తు ఎన్నికల కౌంటింగ్ కూడా పూర్తి అవుతుంది. ఆ మీదట పంచాయతీ ఎన్నికలు రాజకీయ ముద్ర లేకుండానే జరుగుతాయి కాబట్టి అవి ఎవరికి ఎన్ని అన్న చర్చ కూడా ఉండదు, స్థానిక ఎన్నికల పోరాటం దాదాపుగా ముగిసినట్లే అంటున్నారు.
ప్రజా పోరాటాలే :
ఈ దశలో మీడియా ముందు జగన్ ఎంత సౌండ్ చేసినా కలిసి వచ్చేది ఏమిటి అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. జగన్ ప్రజా పోరాటాల మార్గమే ఎంచుకోవాలని సూచిస్తున్నారు. ఢిల్లీ వేదికగా ఇండియా కూటమి నాయకత్వంలో ఇటీవల కాలంలో అనేక ఉద్యమాలు జరిగాయి. రాహుల్ గాంధీ ఎక్కడా విసుగూ విరామం లేకుండా నిరసనలు చేస్తున్నారు. యువతతో ఆయన మీటింగ్స్ పెడుతున్నారు బహిరంగ సభలలో మాట్లాడుతున్నారు. రౌండ్ టేబిల్ మీటింగ్స్ నిర్వహిస్తున్నారు. అలాగే మాక్ పార్లమెంట్ ని కూడా జరిపించారు. ఆపైన మోడీ తనతో చర్చకు రావాలని సవాల్ చేస్తున్నారు. ఇలా ఆయన దూకుడుగానే వెళ్తున్నారు. మరి ఏపీలో వైసీపీ అధినేత జగన్ మాత్రం మీడియా ముందు మాత్రమే మాట్లాడుతూ అక్కడే ఘాటు విమర్శలు చేస్తే ఏమిటి లాభం అన్న చర్చ ఉంది.
కలుపుకుని పోవాలి :
ఏపీలో కూటమి పార్టీలతో పాటు విపక్షంలో వామపక్షాలు ఇతర పార్టీలు ఉన్నాయి. వాటిని కలుపుకుని వైసీపీ ఉద్యమాలు చేపడితే ఫలితం ఉంటుంది తప్ప ఒంటి చేత్తో చప్పట్లు కొడితే ప్రయోజనం లేదని అంటున్నారు. ఇంకా వీలైతే జాతీయ స్థాయిలో ఢిల్లీ వేదికగా కలసి వచ్చే పార్టీలతో దేశమంతా తెలిసేలా ఏపీలో తమకు స్థానిక ఎన్నికల్లో ఏమి జరిగిందో జగన్ వివరిస్తే మీడియా ఫోకస్ పెరుగుతుంది, ఆయన అనుకుంటున్నది మరింతగా చర్చకు వచ్చే చాన్స్ ఉంటుంది అని అంటున్నారు. అలాగే కేంద్రలో ఎన్డీయే ఏపీలో రాజకీయ పరిస్థితుల గురించి వివరించి నట్లు అవుతుందని అంటున్నారు. అంతే తప్ప అదే పనిగా మీడియాలో మాట్లాడితే ఒరిగేది ఏమీ ఉండదని అంటున్నారు. అయినా ఓడిన వారు ఇలాగే అంటారు, గెలిచిన వారు అలాగే ఉంటారు అన్నది కూడా అంతా వింటున్న విషయమే. మొత్తం మీద చూస్తే వైసీపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో అయితే కూటమి పద్మవ్యూహంలో చిక్కుకుని విలవిలలాడుతోందా అన్నదే ఇపుడు అంతా అంటున్న మరో మాట.