అమెరికాలో హెచ్-1బీ వీసాలపై మళ్లీ మొదలైన నిరసనల సెగ.. భారతీయ టెక్ నిపుణుల్లో పెరుగుతున్న ఆందోళన

అమెరికా వీధిల్లో కనిపించిన ఆ ఒక్క దృశ్యం.. దశాబ్దాలుగా ఎన్నో ఆశలతో, కలలతో అక్కడికి వెళ్లిన వేలాది భారతీయ కుటుంబాల గుండెల్లో ఒక రకమైన అభద్రతాభావాన్ని.. నిశ్శబ్ద భయాన్ని నింపేసింది.

Update: 2026-09-21 10:05 GMT

అమెరికా వీధిల్లో కనిపించిన ఆ ఒక్క దృశ్యం.. దశాబ్దాలుగా ఎన్నో ఆశలతో, కలలతో అక్కడికి వెళ్లిన వేలాది భారతీయ కుటుంబాల గుండెల్లో ఒక రకమైన అభద్రతాభావాన్ని.. నిశ్శబ్ద భయాన్ని నింపేసింది. టెక్సాస్‌లోని ఒక గ్రోసరీ స్టోర్‌లో ఒక వ్యక్తి ధరించిన “End H1B, End H4, End OPT” అనే టీ-షర్ట్ కేవలం ఒక గుడ్డ ముక్క మీద రాసిన అక్షరాలు మాత్రమే కాదు.. అది మనవాళ్లు అక్కడి సమాజం కోసం అందిస్తున్న కష్టాన్ని.. సమర్థతను తిరస్కరిస్తూ విసిరిన ఒక మానసిక బాణం. సొంత ఊరిని.. కన్నవారిని విడిచిపెట్టి.. కంటినిండా నిద్రలేకుండా చదువుకుని.. తమ నైపుణ్యంతో అమెరికా టెక్ దిగ్గజాలను నిలబెడుతున్న వేలాది మంది భారతీయ యువతకు ఈ రకమైన వ్యతిరేకత తీవ్ర మనోవేదనను మిగులుస్తోంది.

మన దేశం నుంచి వెళ్లే విద్యార్థులు, నిపుణులు అక్కడ ఊరికే ఏదీ పొందడం లేదు. చదువు పూర్తయ్యాక ఓపీటీ ద్వారా దక్కే తాత్కాలిక అవకాశం కోసం.. ఆ తర్వాత హెచ్1బీ వీసా లాటరీలో తమ పేరు వస్తుందో లేదో తెలియని అనిశ్చితి మధ్య అనుక్షణం నలిగిపోతూనే తమ జీవితాలను నిర్మించుకుంటారు. ఇల్లూ వాకిలి వదిలేసి సంస్కృతిని మార్చుకుని.. అక్కడి ఆర్థిక వ్యవస్థకు వేల కోట్ల పన్నులు చెల్లిస్తూ సేవలందిస్తున్నా.. ఇంకా “మీరు మా ఉద్యోగాలను దోచుకుంటున్నారు” అనే మాటలు వినాల్సి రావడం ఎంతటి చేదు నిజం.. 70 శాతానికి పైగా హెచ్-1బీ వీసాలు భారతీయులకే దక్కుతున్నాయనేది మన నిపుణుల ప్రతిభకు నిదర్శనం అయితే అదే విషయం అక్కడ వారిపై ఉన్న ద్వేషానికి, అసూయకు కారణంగా మారడం అత్యంత బాధాకరం.

ఇది కేవలం ఉద్యోగం పొందే ఒక వీసా సమస్య మాత్రమే కాదు.. ఒక హెచ్-1బీ ఉద్యోగి వెనుక అతనిపై ఆధారపడిన హెచ్-4 కుటుంబం ఉంటుంది. ఆ భార్యాభర్తలు, వారి పిల్లలు అక్కడి వాతావరణానికి అలవాటుపడి భవిష్యత్తుపై ఎన్నో ఆశలతో బతుకుతుంటారు. అలాంటి సమయంలో “వీటన్నింటినీ రద్దు చేయాలి” అంటూ బహిరంగంగా ప్రచారం జరుగుతుంటే రోజువారీ జీవితంలో వారు ఎలాంటి మానసిక ఒత్తిడికి గురవుతారో ఊహించడం కష్టం. పెరిగిన వీసా ఫీజులు, కఠినతరమైన చట్టాలు ఒకవైపు వేధిస్తుంటే మరోవైపు ఇలాంటి బహిరంగ నిరసనలు.. ఆన్‌లైన్ ద్వేషం వారి ఉనికినే ప్రశ్నార్థకం చేస్తున్నాయి.

అమెరికాను సాంకేతిక ఉన్నతంగా మార్చడంలో భారతీయ రక్తం, చెమట ఎంతో ఉన్నప్పటికీ నేడు వారి స్వంత ఇంట్లోనే వారిని ఆప్యాయంగా చూడకపోవడం.. తమ భవిష్యత్తు ఏ క్షణాన ఏమవుతుందోనన్న భయం భారతీయుల గుండెల్లో నిరంతరం ప్రవహిస్తూనే ఉంది.

Tags:    

Similar News